laid the foundation stone
-
అణ్వస్త్ర సత్తా చాటేందుకే బ్రహ్మోస్ తయారీ
లక్నో: ప్రపంచంలోని ఏ దేశమూ భారత్‌పై దాడికి దిగే సాహసం చేయకూడదనే బ్రహ్మోస్ అణ్వస్త్ర క్షిపణులను తయారుచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. లక్నోలో రక్షణ సాంకేతికత, ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మోస్ ఆయుధ కర్మాగారాలకు రాజ్‌నాథ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్ బ్రహ్మోస్ సహా ఇతర ఆయుధాలను తయారుచేస్తోందంటే అర్ధం.. ఇతర దేశాలపై దాడికి సిద్ధమైందని కాదు. కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించే దేశాలకు భారత తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకే ఇలా క్షిపణులను తయారుచేస్తోంది. భారత్‌కు చెడు చేయాలని పొరుగుదేశం(పాక్) ఎందుకు అనుక్షణం పరితపిస్తోందో నాకైతే అర్ధంకాలేదు’ అని రాజ్‌నాథ్ అన్నారు. బ్రహ్మోస్ యూనిట్ కోసం అడిగిన వెంటనే 200 ఎకరాల స్థలం కేటాయించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రాజ్‌నాథ్ అభినందించారు. ఈ రెండు యూనిట్లను డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూనిట్లో బ్రహ్మోస్ కొత్త తరం వేరియంట్ క్షిపణులను రూపొందిస్తారు. ఏడాదికి దాదాపు వంద క్షిపణులను తయారుచేస్తారు. -
కాంగ్రెస్ ఆలోచన సంకుచితం
బాగ్పత్: దళితులపై అత్యాచారాల దగ్గర్నుంచి రైతుల వరకు ప్రతి అంశంలోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. సంకుచిత ఆలోచలనతో నిండిన కాంగ్రెస్ నేతలకు ఒక కుటుంబాన్ని గౌరవించటం అలవాటైందని.. వారు ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని గౌరవించలేకపోతున్నారని విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో రూ.11వేల కోట్లతో నిర్మించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేను, ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే తొలిదశను జాతికి అంకితం చేసిన ప్రధాని.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘మోదీని వ్యతిరేకించాలనే ఆలోచనలో దేశాన్నే వ్యతిరేకిస్తారని అస్సలు అనుకోలేదు. ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అటువైపు ఓ కుటుంబాన్నే దేశంగా చూస్తున్న వారున్నారు. కానీ నాకు మాత్రం దేశమే నా కుటుంబం’ అని మోదీ పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా అనిశ్చితి సృష్టించాలని ప్రయత్నించారు. రిజర్వ్ బ్యాంకు, ఎన్నికల సంఘం, ఈవీఎంలనూ అనుమానించారు’ అని మండిపడ్డారు. 70 ఏళ్లుగా మోసం చేస్తున్నారు ‘కాంగ్రెస్, వీరి మిత్ర పక్షాలు పేదలు, దళితులు, గిరిజనుల కోసం చేసే పనులను అవహేళన చేస్తున్నారు. వారికి దేశాభివృద్ధి ఓ జోక్. స్వచ్ఛ భారత్, పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీ, మరుగుదొడ్ల నిర్మాణం, పేదలు బ్యాంకు అకౌంట్లు తెరవటం వంటివి వారికి జోక్‌గానే అనిపిస్తున్నాయి. తరతరాలుగా అధికారంలో ఉన్నవారికి (రాహుల్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) పేదల కోసం చేసే పనులు జోక్ లాగే అనిపిస్తాయి. కేబినెట్ నోట్‌ను చించేసిన వారికి పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని గౌరవించటం ఎలా తెలుస్తుంది’ అని ప్రధాని ప్రశ్నించారు. ఎక్స్‌ప్రెస్‌వేల ప్రత్యేకతలు ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ వే తొలిదశ ► దేశంలోనే తొలి 14 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే. 2.5 మీటర్ల సైకిల్ ట్రాక్, 1.5 మీటర్ల ఫుట్‌పాత్ కూడా ఉంటాయి. తొలిదశ నిజాముద్దీన్ నుంచి ఉత్తరప్రదేశ్ సరిహద్దు వరకు. ► తొలి దశ 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తిచేశారు. రూ. 841 కోట్లు ఖర్చుచేశారు. ► గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ► సోలార్ ప్యానెళ్లతో అటోమేటిక్ లైటింగ్ వ్యవస్థ, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థతో మొక్కలకు నీరు. ► రెండో దశ పూర్తయితే, ఢిల్లీ– మీరట్ మధ్య ప్రయాణానికి 45 నిమిషాలే. ప్రస్తుతం రెండున్నర గంటలకు పైనే పడుతోంది. ► రోడ్లకు ఇరువైపులా చారిత్రక కట్టడాల నమూనాలు ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ► ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ)కు 2015 నవంబర్‌లో మోదీ శంకుస్థాపన. కుండ్లీ నుంచి పల్వాల్ వరకు నిర్మించారు. ఈ రెండూ హరియాణాలోనే ఉన్నాయి. కానీ, హరియాణా, యూపీలోని ఆరు పార్లమెంటు నియోజవర్గాలగుండా ఈ రోడ్డు వెళ్తుంది. ► ఈ ప్రాజెక్టు నిర్మాణం 500 రోజుల్లో (రికార్డు సమయం) రూ.11వేల కోట్లతో పూర్తి. ► ఈపీఈపై ఎనిమిది సోలార్ప్లాంట్లున్నాయి. వీటి ద్వారా 4 మెగావాట్ల విద్యుదుత్పత్తి. ► ఈ ప్రత్యేకమైన రహదారిపై అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు, ఆటో చలాన్ వ్యవస్థ ఏర్పాటుచేశారు. ► ప్రయాణించిన దూరానికే టోల్ టాక్స్ కట్టే సదుపాయం కూడా ఉంది. ► రోడ్లకు ఇరువైపులా 2.5లక్షల చెట్లను నాటారు. ఇందులో 8–10 ఏళ్ల చెట్లు కూడా ఉన్నాయి. వీటికి బిందుసేద్యం ద్వారా నీరందుతుంది. ► ఈ రోడ్డు నిర్మాణానికి 9,375 మందికి 50 లక్షల పనిదినాల అవకాశాన్ని కల్పించారు. ► ఈపీఈ ద్వారా ఢిల్లీలో ట్రాఫిక్, కాలుష్యాన్ని గరిష్టంగా తగ్గించవచ్చు. ► ఈపీఈలో నాలుగు పెద్ద వంతెనలు, 46 చిన్న వంతెనలు, 3 ఫ్లైఓవర్లు, 221 అండర్‌పాస్‌లు, 8 ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జెస్)లున్నాయి. ► అక్కడక్కడ పెట్రోల్ పంపులు, హోటళ్లు, దుకాణాలున్నాయి. చార్మినార్, ఎర్రకోట వంటి పలు చారిత్రక కట్టడాల నమూనాలున్నాయి. దళితుల విషయంలో అసత్య ప్రచారం ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టంపై సుప్రీంకోర్టు ఆర్డరు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఈ ఆర్డర్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. కానీ వారు దీన్ని అర్థం చేసుకోకుండా దేశంలో అనిశ్చితి నెలకొనేలా ప్రయత్నించారు. చట్టం విషయంలో, దళితులపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో.. రిజర్వేషన్ల అంశంలో.. ఇలా ప్రతి దాంట్లోనూ అసత్యాలను, వదంతులను ప్రచారం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించారు’ అని ప్రధాని మండిపడ్డారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లలో దళితులకు అవకాశాలను సృష్టించడంతోపాటు వారికి భద్రత, సామాజిక న్యాయం అందిస్తోందని మోదీ వెల్లడించారు. వెనుకబడిన ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని తాము చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్, దీని మిత్రపక్షాలు పార్లమెంటులో మోకాలడ్డుతున్నాయన్నారు. అయినా అనుకున్నది చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. 28వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి రూ. 3లక్షల కోట్లను ఖర్చుపెట్టినట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ వే రెండో దశను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిచేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. -
తాండూరు ప్రజలకు రుణపడి ఉంటా
♦ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి.. ఇప్పుడు మంత్రిని చేశారు ♦ మీరు అడిగినా.. అడగకున్నా సేవ చేస్తా మంత్రి మహేందర్‌రెడ్డి ♦ నారాయణపూర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన తాండూరు రూరల్ : రాజకీయ జీవితం ఇచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన తాండూరు ప్రజల రుణం తీర్చుకోలేదని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మీరు అడిగినా.. అడగకున్నా మీ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. శనివారం తాండూరు మండలం నారాయణపూర్‌తో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో గోనూర్, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్, పేర్కంపల్లి గ్రామలకు నాలుగు బ్రిడ్జిలు మంజూరయ్యాయని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ పథకం కింద నియోజకవర్గానికి 2వేల ఇళ్లు కేటాయించారన్నారు. వీటిలో తాండూరు పట్టణానికి 600, మిగతా నాలుగు మండలాలకు 1400 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. వచ్చే నెలలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం బీసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. కాగా నారాయణపూర్-పాత తాండూరుకు బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సీఆర్ఆర్ నిధులు రూ.9.20 కోట్లు, అదేవిధంగా గ్రామ సమీపంలో కాగ్నానదిలో బావి తవ్వేందుకు రూ.10లక్షలు మంజూరు కాగా ఆయా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, వైస్ ఎంపీపీ శేఖర్, సర్పంచ్ సౌభగ్య, ఎంపీటీసీ చీమల రేణుక, ఉప సర్పంచు ఉప్పరి శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి, గ్రామస్తులు కేశవరెడ్డి, సంజీవరెడ్డి, భీంరెడ్డి, యాదప్ప, వెంకటయ్య, వడ్ల బిచ్చన్న, చీమల నర్సింహులు, బాల్‌రెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు బషీరాబాద్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను రూ.50కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం జరిగిన బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. జిల్లాలోని రైతుల ప్రయోజనార్థం బషీరాబాద్, కోట్‌పల్లి, కుల్కచర్ల, మహేశ్వరం మండలాల్లో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పాలక మండళ్ల నియామకం పూర్తయ్యిందని, ఒక్కో మార్కెట్ కమిటీకి మొదటి విడతలో రూ.కోటితో మార్కెట్ కమిటీ కార్యాలయం నిర్మిస్తామన్నారు. అలాగే రెండో విడతలో మరో రూ.కోటి మంజూరు చేసి మార్కెట్ యార్డులలో రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా చేస్తామని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో 168 చెరువులను రూ.68 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రైతులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆశ కారాదు నిరాశ
మంగళగిరి : అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఈ సారైనా శంకుస్థాపన జరగాలని జిల్లా ప్రజానీకం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అంగీకరించినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో శంకుస్థాపన కార్యక్రమం మూడు సార్లు వాయిదా పడడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేస్తోంది. జూన్ మొదటి వారంలో వివిధ కార్యక్రమాల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మూడు రోజులు ఉండబోతున్నారు. దీంతో ఏదో ఒక రోజు ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం ప్రజల ఆశలను చిగురింపజేస్తోంది. ఈ నెల 14వ తేదీన ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేయబోతున్నారంటూ పదిలక్షల రూపాయల ఖర్చుతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరకు కార్యక్రమం వాయిదా పడింది. శంకుస్థాపనకు రావాల్సిన కేంద్ర మంత్రి నడ్డాకు వీలుకాకపోవడంతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకున్నా, అసలు కారణం వేరే ఉండి ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. పలు కార్పొరేట్ ఆసుపత్రుల ఒత్తిడి కారణంగానే ఎయిమ్స్ శంకుస్థాపన వాయిదా పడుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూన్‌లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని జరుగుతున్న ప్రచారం కొంత ఊరట కలిగిస్తోంది. ఎయిమ్స్ నిర్మాణానికి జిల్లా ప్రజలు ఎదురుచూడడానికి పలు కారణాలు ఉన్నాయి. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య వున్న మంగళగిరి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రాంతంగా మారిన తరుణంలో ఇక్కడ ఎయిమ్స్ నిర్మిస్తే మంగళగిరి మెడికల్ హబ్‌గా అవతరించనుందని భావిస్తున్నారు. సుమారు రూ. 1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు శానిటోరియం స్థలం 200 ఎకరాలతో పాటు, ఇక్కడ ఉన్న అటవీభూములు, ప్రశాంత వాతావరణం కలిగి ఉండడం ఎయిమ్స్ ఏర్పాటుకు కలిసి వచ్చే అంశాలు. ఎయిమ్స్ ఏర్పాటుతో వంద సీట్లతో మెడికల్ కాలేజి, 500 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, పలు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు కానుండడంతో మంగళగిరి ప్రాంతం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మంగళగిరి మున్సిపాల్టీకి తప్పనిసరిగా మరో తాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం కేటాయించనుండడంతో తాగునీటిసమస్యను అధిగమించవచ్చు. ఎయిమ్స్ నిర్మాణం పూర్తయి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తే అదే స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.