తాండూరు ప్రజలకు రుణపడి ఉంటా
♦ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి.. ఇప్పుడు మంత్రిని చేశారు
♦ మీరు అడిగినా.. అడగకున్నా సేవ చేస్తా మంత్రి మహేందర్‌రెడ్డి
♦ నారాయణపూర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
తాండూరు రూరల్ : రాజకీయ జీవితం ఇచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన తాండూరు ప్రజల రుణం తీర్చుకోలేదని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మీరు అడిగినా.. అడగకున్నా మీ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. శనివారం తాండూరు మండలం నారాయణపూర్‌తో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో గోనూర్, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్, పేర్కంపల్లి గ్రామలకు నాలుగు బ్రిడ్జిలు మంజూరయ్యాయని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద నియోజకవర్గానికి 2వేల ఇళ్లు కేటాయించారన్నారు. వీటిలో తాండూరు పట్టణానికి 600, మిగతా నాలుగు మండలాలకు 1400 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. వచ్చే నెలలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం బీసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. కాగా నారాయణపూర్-పాత తాండూరుకు బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సీఆర్‌ఆర్ నిధులు రూ.9.20 కోట్లు, అదేవిధంగా గ్రామ సమీపంలో కాగ్నానదిలో బావి తవ్వేందుకు రూ.10లక్షలు మంజూరు కాగా ఆయా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, వైస్ ఎంపీపీ శేఖర్, సర్పంచ్ సౌభగ్య, ఎంపీటీసీ చీమల రేణుక, ఉప సర్పంచు ఉప్పరి శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి, గ్రామస్తులు కేశవరెడ్డి, సంజీవరెడ్డి, భీంరెడ్డి, యాదప్ప, వెంకటయ్య, వడ్ల బిచ్చన్న, చీమల నర్సింహులు, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు
బషీరాబాద్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లను రూ.50కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం జరిగిన బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. జిల్లాలోని రైతుల ప్రయోజనార్థం బషీరాబాద్, కోట్‌పల్లి, కుల్కచర్ల, మహేశ్వరం మండలాల్లో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పాలక మండళ్ల నియామకం పూర్తయ్యిందని, ఒక్కో మార్కెట్ కమిటీకి మొదటి విడతలో రూ.కోటితో మార్కెట్ కమిటీ కార్యాలయం నిర్మిస్తామన్నారు. అలాగే రెండో విడతలో మరో రూ.కోటి మంజూరు చేసి మార్కెట్ యార్డులలో రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా చేస్తామని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో 168 చెరువులను రూ.68 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రైతులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.