కాంగ్రెస్‌ ఆలోచన సంకుచితం | PM Modi inaugurates the first phase of Delhi-Meerut Expressway | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఆలోచన సంకుచితం

Published Mon, May 28 2018 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

PM Modi inaugurates the first phase of Delhi-Meerut Expressway - Sakshi

ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన తరువాత రోడ్‌షోలో పాల్గొన్న మోదీ

బాగ్‌పత్‌: దళితులపై అత్యాచారాల దగ్గర్నుంచి రైతుల వరకు ప్రతి అంశంలోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. సంకుచిత ఆలోచలనతో నిండిన కాంగ్రెస్‌ నేతలకు ఒక కుటుంబాన్ని గౌరవించటం అలవాటైందని.. వారు ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని గౌరవించలేకపోతున్నారని విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో రూ.11వేల కోట్లతో నిర్మించిన ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను, ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వే తొలిదశను జాతికి అంకితం చేసిన ప్రధాని.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘మోదీని వ్యతిరేకించాలనే ఆలోచనలో దేశాన్నే వ్యతిరేకిస్తారని అస్సలు అనుకోలేదు. ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అటువైపు ఓ కుటుంబాన్నే దేశంగా చూస్తున్న వారున్నారు. కానీ నాకు మాత్రం దేశమే నా కుటుంబం’ అని మోదీ పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా అనిశ్చితి సృష్టించాలని ప్రయత్నించారు. రిజర్వ్‌ బ్యాంకు, ఎన్నికల సంఘం, ఈవీఎంలనూ అనుమానించారు’ అని మండిపడ్డారు.  

70 ఏళ్లుగా మోసం చేస్తున్నారు
‘కాంగ్రెస్, వీరి మిత్ర పక్షాలు పేదలు, దళితులు, గిరిజనుల కోసం చేసే పనులను అవహేళన చేస్తున్నారు. వారికి దేశాభివృద్ధి ఓ జోక్‌. స్వచ్ఛ భారత్, పేద మహిళలకు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ, మరుగుదొడ్ల నిర్మాణం, పేదలు బ్యాంకు అకౌంట్లు తెరవటం వంటివి వారికి జోక్‌గానే అనిపిస్తున్నాయి. తరతరాలుగా అధికారంలో ఉన్నవారికి (రాహుల్‌ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) పేదల కోసం చేసే పనులు జోక్‌ లాగే అనిపిస్తాయి. కేబినెట్‌ నోట్‌ను చించేసిన వారికి పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని గౌరవించటం ఎలా తెలుస్తుంది’ అని ప్రధాని ప్రశ్నించారు.
 
ఎక్స్‌ప్రెస్‌వేల ప్రత్యేకతలు
ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే తొలిదశ

► దేశంలోనే తొలి 14 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌వే. 2.5 మీటర్ల సైకిల్‌ ట్రాక్, 1.5 మీటర్ల ఫుట్‌పాత్‌ కూడా ఉంటాయి. తొలిదశ నిజాముద్దీన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు వరకు.
► తొలి దశ 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తిచేశారు. రూ. 841 కోట్లు ఖర్చుచేశారు.  
► గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు.
► సోలార్‌ ప్యానెళ్లతో అటోమేటిక్‌ లైటింగ్‌ వ్యవస్థ, డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థతో మొక్కలకు నీరు.
► రెండో దశ పూర్తయితే, ఢిల్లీ– మీరట్‌ మధ్య ప్రయాణానికి 45 నిమిషాలే. ప్రస్తుతం రెండున్నర గంటలకు పైనే పడుతోంది.  
► రోడ్లకు ఇరువైపులా చారిత్రక కట్టడాల నమూనాలు

 
ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే
► ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ)కు 2015 నవంబర్‌లో మోదీ శంకుస్థాపన. కుండ్లీ నుంచి పల్వాల్‌ వరకు నిర్మించారు. ఈ రెండూ హరియాణాలోనే ఉన్నాయి. కానీ, హరియాణా, యూపీలోని ఆరు పార్లమెంటు నియోజవర్గాలగుండా ఈ రోడ్డు వెళ్తుంది.
► ఈ ప్రాజెక్టు నిర్మాణం 500 రోజుల్లో (రికార్డు సమయం) రూ.11వేల కోట్లతో పూర్తి.
► ఈపీఈపై ఎనిమిది సోలార్‌ప్లాంట్లున్నాయి. వీటి ద్వారా 4 మెగావాట్ల విద్యుదుత్పత్తి.
► ఈ ప్రత్యేకమైన రహదారిపై అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు, ఆటో చలాన్‌ వ్యవస్థ ఏర్పాటుచేశారు.
►  ప్రయాణించిన దూరానికే టోల్‌ టాక్స్‌ కట్టే సదుపాయం కూడా ఉంది.  
► రోడ్లకు ఇరువైపులా 2.5లక్షల చెట్లను నాటారు. ఇందులో 8–10 ఏళ్ల చెట్లు కూడా ఉన్నాయి. వీటికి బిందుసేద్యం ద్వారా నీరందుతుంది.
► ఈ రోడ్డు నిర్మాణానికి 9,375 మందికి 50 లక్షల పనిదినాల అవకాశాన్ని కల్పించారు.
► ఈపీఈ ద్వారా ఢిల్లీలో ట్రాఫిక్, కాలుష్యాన్ని గరిష్టంగా తగ్గించవచ్చు.
► ఈపీఈలో నాలుగు పెద్ద వంతెనలు, 46 చిన్న వంతెనలు, 3 ఫ్లైఓవర్లు, 221 అండర్‌పాస్‌లు, 8 ఆర్‌వోబీ (రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జెస్‌)లున్నాయి.
► అక్కడక్కడ పెట్రోల్‌ పంపులు, హోటళ్లు, దుకాణాలున్నాయి. చార్‌మినార్, ఎర్రకోట వంటి పలు చారిత్రక కట్టడాల నమూనాలున్నాయి
.

దళితుల విషయంలో అసత్య ప్రచారం
ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టంపై సుప్రీంకోర్టు ఆర్డరు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఈ ఆర్డర్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. కానీ వారు దీన్ని అర్థం చేసుకోకుండా దేశంలో అనిశ్చితి నెలకొనేలా ప్రయత్నించారు. చట్టం విషయంలో, దళితులపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో.. రిజర్వేషన్ల అంశంలో.. ఇలా ప్రతి దాంట్లోనూ అసత్యాలను, వదంతులను ప్రచారం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించారు’ అని ప్రధాని మండిపడ్డారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లలో దళితులకు అవకాశాలను సృష్టించడంతోపాటు వారికి భద్రత, సామాజిక న్యాయం అందిస్తోందని మోదీ వెల్లడించారు.

వెనుకబడిన ఓబీసీలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని తాము చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్, దీని మిత్రపక్షాలు పార్లమెంటులో మోకాలడ్డుతున్నాయన్నారు. అయినా అనుకున్నది చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. 28వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి రూ. 3లక్షల కోట్లను ఖర్చుపెట్టినట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే రెండో దశను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిచేస్తామని గడ్కరీ పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement