మంగళగిరి : అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఈ సారైనా శంకుస్థాపన జరగాలని జిల్లా ప్రజానీకం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అంగీకరించినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో శంకుస్థాపన కార్యక్రమం మూడు సార్లు వాయిదా పడడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేస్తోంది. జూన్ మొదటి వారంలో వివిధ కార్యక్రమాల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మూడు రోజులు ఉండబోతున్నారు. దీంతో ఏదో ఒక రోజు ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం ప్రజల ఆశలను చిగురింపజేస్తోంది.
ఈ నెల 14వ తేదీన ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేయబోతున్నారంటూ పదిలక్షల రూపాయల ఖర్చుతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరకు కార్యక్రమం వాయిదా పడింది. శంకుస్థాపనకు రావాల్సిన కేంద్ర మంత్రి నడ్డాకు వీలుకాకపోవడంతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకున్నా, అసలు కారణం వేరే ఉండి ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. పలు కార్పొరేట్ ఆసుపత్రుల ఒత్తిడి కారణంగానే ఎయిమ్స్ శంకుస్థాపన వాయిదా పడుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూన్‌లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని జరుగుతున్న ప్రచారం కొంత ఊరట కలిగిస్తోంది.
ఎయిమ్స్ నిర్మాణానికి జిల్లా ప్రజలు ఎదురుచూడడానికి పలు కారణాలు ఉన్నాయి. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య వున్న మంగళగిరి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రాంతంగా మారిన తరుణంలో ఇక్కడ ఎయిమ్స్ నిర్మిస్తే మంగళగిరి మెడికల్ హబ్‌గా అవతరించనుందని భావిస్తున్నారు. సుమారు రూ. 1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు శానిటోరియం స్థలం 200 ఎకరాలతో పాటు, ఇక్కడ ఉన్న అటవీభూములు, ప్రశాంత వాతావరణం కలిగి ఉండడం ఎయిమ్స్ ఏర్పాటుకు కలిసి వచ్చే అంశాలు.
ఎయిమ్స్ ఏర్పాటుతో వంద సీట్లతో మెడికల్ కాలేజి, 500 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, పలు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు కానుండడంతో మంగళగిరి ప్రాంతం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మంగళగిరి మున్సిపాల్టీకి తప్పనిసరిగా మరో తాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం కేటాయించనుండడంతో తాగునీటిసమస్యను అధిగమించవచ్చు. ఎయిమ్స్ నిర్మాణం పూర్తయి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తే అదే స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.
ఆశ కారాదు నిరాశ
Published Sat, May 30 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement