పెళ్లి వ్యాన్ బోల్తా... ముగ్గురి పరిస్థితి విషమం
గూడెంకొత్తవీధి : వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ పెళ్లి వ్యాను అదుపుతప్పిన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం వివరాలివి. మండలంలోని గాలికొండ గ్రామానికి చెందిన వధువు, లక్కవరం గ్రామానికి చెందిన వరుడికి బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఓ వ్యానులో గాలికొండ నుంచి లక్కవరం గ్రామానికి రాత్రి వారంతా చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం విందు భోజనం అనంతరం స్వగ్రామానికి పయనమయ్యారు.
బూసుల ఘాట్ రోడ్డులో బొలేరో వాహనం బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. ప్రమాదంలో గుమ్మాలగొంది గ్రామానికి చెందిన కాకూరి నర్సింగరావు(45), బత్తునూరు గ్రామానికి చెందిన శ్రీహరి(18), శామ్యూల్(20)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో జి.కె.వీధి పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారి రామ్‌నాయక్ వైద్య చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కొరకు చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 15 మంది కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. వాహనంలో ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, ఘాట్‌లో రక్షణ గోడ లేకుంటే లోయలోకి దూసుకుపోయి పెను ప్రమాదం సంభవించేదని బాధితులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సమీర్ తెలిపారు.
(చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ)