laknapur project
-
ఆయకట్టుకు గడ్డుకాలం
సాక్షి, పరిగి: జిల్లాలో రెండో అతిపెద్దదైన లఖ్నాపూర్ ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. గత రెండేళ్ల వరకు ప్రాజెక్టు నీటితో కళకళలాడింది. ఈసారి పరిగి నియోజకవర్గంలో లోటు వర్షపాతంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఓ మోస్తరు వర్షాలు కురిసినా ప్రాజెక్టులోకి ఆశించినస్థాయిలో నీరు రాలేదు. ప్రస్తుతం ఒక అడుగు మేర మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించకుండానే సీజన్‌కు ముగింపు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీలోనైనా పంట వేద్దామనుకుంటే నీరు లేని దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినా నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది. ఈ ఏడాది ఇక్కడ భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. పరిగి మండలంలోని లఖ్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాలతో పాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్ తదితర ఎనిమిది గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తుంటారు. బీళ్లుగా మారిన భూములు ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా ప్రాంతంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండగా ఇక్కడ భిన్నంగా ఉంది. గడిచిన వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురవగా ప్రస్తుత వర్షాకాల సీజన్లో పరిగి ప్రాంతంలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. అగస్టులోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. 50 శాతానికి మించి వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తగా ప్రాజెక్టులోకి కనీసం ఒక ఫీటు నీరైనా చేరలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాకాలం ముగుస్తుండటం, ఇక భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా సన్నగిల్లడంతో రబీ సీజన్‌పైనా కర్షకులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు తీవ్రనష్టం ఖరీఫ్‌లో వర్షాలు విరివిగా కురుస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. మామూలుగా కురిసిన వర్షాలు మెట్ట పంటలకే సరిపోయాయి చెరువుల్లోకి ఏమాత్రం నీరు వచ్చి చేరలేదు. దీంతో లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు కూడా వెలవెలబోయింది. సాగు చేయకుండానే ఖరీప్ సీజన్ ముగుతోంది. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతుల ఆశ నెరవేరేలా లేదు. భారీ తుఫాన్లు వస్తేగాని ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. రూ. 12 కోట్ల నష్టం.. లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టులో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరకపోవడంతో ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసే పరిస్థితి లేదు. దీంతో భూములు బీళ్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీజన్లలో కలిపి దాదాపు రూ. 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో వరి సాగు చేస్తే దాదాపు రూ. 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ధాన్యం పండుతుందని ఇక్కడి రైతులు అంటున్నారు. రెండు సీజన్లలో సుమారు రూ. 12 కోట్లకు పైగా నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్’ అలుగు
ఎట్టకేలకు కరువుదీరా వర్షాలు కురిశాయి. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఊరటనిచ్చాయి.. జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మండలంలోని లక్నాపూర్ ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతోంది. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండుకుండలా మారింది. కాగా శనివారం రాత్రి కురిసిన వర్షానికి అలుగు పారుతోంది. దీంతో సందర్శకులు లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు అందాలు చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. - పరిగి -
అన్నదాతకు కష్టకాలం
పరిగి, న్యూస్‌లైన్: జిల్లాలోనే రెండో అతి పెద్ద జలాశయం లఖ్నాపూర్ ప్రాజెక్టు. ఇప్పుడిది నీరులేక వెలవెలబోతోంది. 2010లో కురిసిన వర్షాలతో ఆ తర్వాతి రెండేళ్లలో ఆయకట్టులో రెండు పంటలు పండగా గత ఏడాది నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం కురిసిన ఓ మోస్తరు వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిపాటి నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగుకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ సంవత్సరం ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో పరిగి మండలానికి చెందిన లఖ్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాలతోపాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్ తదితర ఎనిమిది గ్రామాల ఆయకట్టు రైతులకు శాపంలా పరిణమించింది. గణనీయంగా తగ్గిన వర్షపాతం ఈ సంవత్సరం గణనీయంగా తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ పెద్ద వర్షాలు కురవక పోవడం, పడిన ఒకటిరెండు తుపాన్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చెరువులోకి నీరు చేరలేదు. వర్షాకాలంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 839 మిల్లీమీటర్లు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 585 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు అడుగు నీరు కూడా చేరలేదు. దీంతో 2,600 ఎకరాల ఆయకట్టు మొత్తం ఖరీఫ్ ప్రారంభించకుండానే ముగించాల్సి వస్తోంది. వర్షాకాలం ముగుస్తుండటం, వర్షాలు కురిసే అవకాశాలు కనిపించకపోవడంతో ఇక రబీపై కూడా రైతన్నలు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. రెండు పంటలకూ నిరాశే.. ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. కురిసిన వర్షాలు మెట్టపంటలకే సరిపోయాయి. చెరువుల్లోకి నీరు చేరటానికి సరిపోలేదు. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగులుతోంది. ఇకపై పెద్ద వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులోకి నీరుచేరే పరిస్థితి కనిపించడంలేదు. రూ.12 కోట్లకు పైగా నష్టం సాగు సాధ్యం కాకపోవడంతో రైతుకు ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి భారీగా నష్టం వాటిల్లనుంది. ఒక సీజన్లో ప్రాజెక్టు ఆయకట్టులో వరి సాగు చేస్తే రూ.6 కోట్ల పైచిలుకు విలువచేసే ధాన్యం పండుతుందని, రెండు సీజన్లలో కలిపి రూ.12 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.