అన్నదాతకు కష్టకాలం | BAD TIME TO FARMERS | Sakshi
Sakshi News home page

అన్నదాతకు కష్టకాలం

Published Sun, Sep 15 2013 12:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

BAD TIME TO FARMERS


 పరిగి, న్యూస్‌లైన్:
 జిల్లాలోనే రెండో అతి పెద్ద జలాశయం లఖ్నాపూర్ ప్రాజెక్టు. ఇప్పుడిది నీరులేక వెలవెలబోతోంది. 2010లో కురిసిన వర్షాలతో ఆ తర్వాతి రెండేళ్లలో ఆయకట్టులో రెండు పంటలు పండగా గత ఏడాది నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం కురిసిన ఓ మోస్తరు వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిపాటి నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగుకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ సంవత్సరం ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో పరిగి మండలానికి చెందిన లఖ్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాలతోపాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్ తదితర ఎనిమిది గ్రామాల ఆయకట్టు రైతులకు శాపంలా పరిణమించింది.
 
 గణనీయంగా తగ్గిన వర్షపాతం
 ఈ సంవత్సరం గణనీయంగా తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ పెద్ద వర్షాలు కురవక పోవడం, పడిన ఒకటిరెండు తుపాన్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చెరువులోకి నీరు చేరలేదు. వర్షాకాలంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 839 మిల్లీమీటర్లు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 585 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు అడుగు నీరు కూడా చేరలేదు. దీంతో 2,600 ఎకరాల ఆయకట్టు మొత్తం ఖరీఫ్ ప్రారంభించకుండానే ముగించాల్సి వస్తోంది. వర్షాకాలం ముగుస్తుండటం, వర్షాలు కురిసే అవకాశాలు కనిపించకపోవడంతో ఇక రబీపై కూడా రైతన్నలు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది.   
 
 రెండు పంటలకూ నిరాశే..
 ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. కురిసిన వర్షాలు మెట్టపంటలకే సరిపోయాయి. చెరువుల్లోకి నీరు చేరటానికి సరిపోలేదు. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగులుతోంది. ఇకపై పెద్ద వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులోకి నీరుచేరే పరిస్థితి కనిపించడంలేదు.  
 
 రూ.12 కోట్లకు పైగా నష్టం
 సాగు సాధ్యం కాకపోవడంతో రైతుకు ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి భారీగా నష్టం వాటిల్లనుంది. ఒక సీజన్‌లో ప్రాజెక్టు ఆయకట్టులో వరి సాగు చేస్తే రూ.6 కోట్ల పైచిలుకు విలువచేసే ధాన్యం పండుతుందని, రెండు సీజన్లలో కలిపి రూ.12 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement