మహానందీశ్వరుడికి లక్ష బిల్వార్చన
మహానంది: కార్తీకమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ మహానందీశ్వరస్వామివారికి ఆదివారం లక్షబిల్వార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. నంద్యాలకు చెందిన రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులు పూజలకు దాతలుగా పాల్గొన్నారు. మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ డాక్టర్ శంకరవరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకరఅవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, తదితర పండిత బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, దీక్షా ధారణ, కంకణ ధారణ, గోపూజ, తదితర పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తామని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం 10 గంటల నుంచి ఆర్జిత కుంకుమార్చనలు ఉండవని భక్తులు గమనించాలని ఆయన కోరారు.