మంత్రాల నెపంతో వృద్ధ దంపతుల దారుణహత్య
పట్నా: మంత్రాల నెపంతో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బీహార్లోని పతారా గ్రామానికి చెందిన జానకీ మాంఝీ, లక్ష్మీదేవి దంపతులు చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో గొంతుకోసి చంపేశారు. క్షద్రవిద్యలు ప్రయోగిస్తూ గ్రామస్తులను ఇబ్బందుల కు గురి చేస్తున్నారనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసు అధికారి ధనుంజయ్ కుమార్ తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు సోహారా మాంజీ, మరో ఇద్దరిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ల క్రితం ఇలాంటి సంఘటనపై స్పందించిన బీహార్ మానవహక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో 1999 చట్ట ప్రకారం కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది.