Lalaguda
-
ఉద్యోగులకు వైద్య ప్రదాయినిగా దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు లాక్డౌన్. మరోవైపు కరోనా ఉద్ధృతి. పొంచి ఉన్న వైరస్ ముప్పు. ఇది వయోధికులకు, దీర్ఘకాలిక రోగులకు మరింత ప్రమాదకరమైన పరిణామం. దీనిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ఇటీవల చేపట్టిన వినూత్న కార్యక్రమం రైల్వే కార్మికులకు, ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు వరప్రదాయినిగా మారింది. కరోనా వ్యాప్తి దష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించినప్పటికీ లాలాగూడలోని ద.మ రైల్వే కేంద్రీయ ఆస్పత్రి మాత్రం ఉద్యోగుల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లింది. ఒకవైపు అన్ని రకాల వైద్య సదుపాయాలను కొనసాగిస్తూనే మరోవైపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అవసరమైన మందులను వారి ఇళ్ల వద్దకే చేరవేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్యకర్తలు కోవిడ్ వారియర్స్‌గా పని చేస్తున్నారు.నెల రోజులకుపైగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1500 మందికిపైగా ఉద్యోగులకు వారి ఇళ్ల వద్ద మందులను అందజేశారు. ముఖ్యంగా మూప్రిండాల వ్యాధులు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కోవిడ్ హైరిస్క్ గ్రూపులో ఉన్నవారికి ఈ పథకం గొప్ప ఊరటనిస్తోంది. రెండు రోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా దీనిపై అధికారులు, ఆస్పత్రి వైద్య నిపుణులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే కోవిడ్ వారియర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసుకొని అవసరమైన వారికి సత్వరమే ఇళ్ల వద్ద మందులు అందజేసేలా సేవలను విస్తరించాలని సూచించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు.. ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు ఆస్పత్రిలో సీనియర్ వైద్య నిపుణుడితో పాటు, ఒక స్టాఫ్‌నర్స్, మరో సీనియర్ ఫార్మాసిస్ట్‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. వాట్సప్ నంబర్ల ద్వారా ఉద్యోగుల నుంచి అందిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి అవసరమైన మందులను స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ఇళ్లకే పంపిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2 నెలలకు సరిపడా మందులను అందజేస్తుండగా, ఉద్యోగులకు, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఒక నెలకు అవసరమైన మందులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర వైద్య సేవలు కావాల్సినవారికి ఆస్పత్రిలోనే చికిత్సలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే అతి పెద్దదైన లాలాగూడ కేంద్రీయ ఆస్పత్రిలో అన్ని రకాల అత్యవసర వైద్య విభాగాలు ఉన్నాయి. కార్పొరేట్ తరహా వైద్య సేవలను ఉద్యోగులకు అందజేస్తున్నారు. కార్పొరేట్ వైద్య నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. ప్రతి రోజు 3000మందికి పైగా రోగులకు ఓపీ సేవలను అందజేస్తున్నారు. ఒకవైపు కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న తరుణంలోనూ వైద్య సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ద.మ రైల్వే పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు రైల్వే ఆస్పత్రుల్లో కేవలం రైల్వే ఉద్యోగులకు కాకుండా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు కూడా వైద్య సేవలను విస్తృతం చేశారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ తెలిపారు. వాట్సప్ నంబర్లకు వివరాలు పంపితే చాలు.. మందులు అవసరమైన పేషెంట్లు తమ వివరాలను ఆస్పత్రి సూచించిన ఫోన్ నంబర్లకు వాట్సప్ ద్వారా తెలియజేస్తే చాలు. గతంలో వైద్యులు రాసిన మందుల ప్రిస్కిప్షన్ ఆధారంగా ప్రస్తుతం అవసరమైన మందులను వారికి పంపిస్తారు. మందులు ఇలా అందుకోవచ్చు.. ►వాట్సప్ నంబర్లు: 970137055, 9618936328. ►ఈ నంబర్లకు పేషెంట్ పేరు, ఉద్యోగి పేరు, మెడికల్ కార్డు , గతంలో డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ పంపించాలి ►చిరునామా, ల్యాండ్‌మార్క్ కూడా తెలియజేయాలి ►రైల్వే విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ► 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
‘పోలీసులు ఫోన్ చేశాకే తెలిసింది’
సాక్షి, హైదరాబాద్: ‘నా భర్తను నేను చంపలేదు. నాకేమి తెలియదు. పాలలో నిద్రమాత్రలు కలిపి నా భర్తకు ఇచ్చాను. కార్తీక్ చెబితేనే నిద్రమాత్రలు కలిపాను. నా భర్తను చంపేస్తారని నాకు తెలియదు. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నా భర్తను చంపేశారని పోలీసులు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే తెలిసింద’ని భర్త హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జ్యోతి తెలిపింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన కార్పెంటర్ నాగరాజు హత్య కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్, దీపక్, యాసీన్, నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతి, కార్తీక్, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. మీడియా ముందు జ్యోతి, నాగరాజు భిన్నవాదనలు వినిపించారు. భర్తను చంపాలని తాను అనుకోలేదని జ్యోతి చెప్పగా, ఆమె ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్ చేయడంతో నా ఫ్రెండ్స్‌ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్ వివరించాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. -
భర్తనే కడతేర్చిన భార్య
-
దాగని నిజం
సాక్షి, సిటీబ్యూరో: గురువారం ఉదయం 8 గంటల ప్రాంతం... లాలాపేటలోని గడ్డిచేలో ఓ యువకుడు హఠాత్తుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు... స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు... ప్రాథమిక విచారణ నేపథ్యంలో గత నెల 30న జరిగిన ఓ హత్య వెలుగులోకి వచ్చింది... ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే పోలీసుల భయంతో ఆత్మహత్యకు యత్నించాడు... ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను చౌటుప్పల్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు... దీంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడినీ వారికే అప్పగించనున్నారు. ప్రియుడి సహకారంతో భర్త హత్య... కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన కార్పెంటర్ నాగరాజు జ్యోతి దంపతులు. వివాహానికి ముందు నుంచి జ్యోతికి నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో పరిచయం ఉండేది. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని ఆమెను నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హతమార్చేందుకు కార్తీక్‌తో కలిసి పథకం వేసింది. ఈ నేపథ్యంలో గత నెల 30న జ్యోతి పథకం ప్రకారం తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. ఆపై కార్తీక్‌ను ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి నాగరాజును హత్య చేశారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కార్తీక్ తన స్నేహితులైన దీపక్, యాసీన్లను రమ్మని కోరాడు. దీనికి యాసీన్‌తో పాటు అంగీకరించిన దీపక్ మరొకరినీ తీసుకువెళ్లాలని భావించాడు నరేష్‌ను తీసుకెళ్లిన దీపక్... లాలాపేట లక్ష్మీనగర్‌కు చెందిన నరేష్‌తో (23) దీపక్‌కు పరిచయం ఉండటంతో మృతదేహం తరలింపు కోసం అతడి సహకారం తీసుకోవాలని దీపక్ భావించాడు. అదే రోజు లక్ష్మీనగర్‌కు వచ్చిన దీపక్ తనతో రావాలని, ఓ మృతదేహం తరలింపునకు సహకరించాలంటూ నరేష్‌ను కోరగా, అందుకు అతను నిరాకరించడంతో బయటకు వెళ్ళి వద్దామంటూ చెప్పిన దీపక్ నరేష్‌ను తీసుకుని కర్మన్‌ఘాట్ చేరుకున్నాడు. అనంతరం ముగ్గరూ కలిసి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి చౌటుప్పల్ జిల్లెలగూడ గుట్టల్లో పారవేసి తిరిగి వచ్చారు. 31న డెడ్‌బాడీని గుర్తించిన చౌటుప్పల్ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు చేపట్టిన చౌటుప్పల్ పోలీసులు మృతుడిని నాగరాజుగా గుర్తించి జ్యోతికి సమాచారం అందించారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. బుధవారం మిగిలిన నిందితులతో పాటు దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అతడి సోదరుడు ఆ రోజు నరేష్ కూడా దీపక్‌తో వెళ్ళినట్లు గ్రహించాడు. దీంతో లక్ష్మీనగర్‌లోని నరేష్ ఇంటికి వెళ్ళిన దీపక్ సోదరుడు అతడిని మందలించడమేగాక చేయి చేసుకున్నాడు. ఈ పరిణామంతో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించిన నరేష్ పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. గురువారం ఉదయం ‘100’కు ఫోన్ చేసి తనకు ఓ హత్య విషయం తెలుసని, పోలీసులు చెప్పాలనుకుంటున్నానని, ఏలా చెప్పాలంటూ అడిగాడు. దీంతో స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్ళాలని, లేదంటే చిరునామా చెప్తే తామే పోలీసులను పంపిస్తామన్నారు. తొలుత తప్పుడు వివరాలు చెప్పినా... తానే పోలీసుస్టేషన్‌కు వెళ్తానన్న నరేష్.. లాలాగూడ ఠాణాకు వెళ్లాలని భావించాడు. గడ్డిచేను వరకు చేరుకున్న అతను భయంతో తన వద్ద ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు నరేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంలో నరేష్ మాట్లాడుతూ... గత నెల 30న తన స్నేహితుడు దీపక్ తనను తీసుకువెళ్లాడని, అతడు మరికొందరితో కలిసి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ వ్యక్తి చంపినట్లు తెలిపారు. ఆపై తాము మృతదేహాన్ని నల్లగొండ చెరువులో పారవేశామన్నారు. మిగిలిన వాళ్ళు పోలీసులకు చిక్కడంతో తాను భయపడ్డానన్నాడు. ఈ విషయం విని కంగుతిన్న లాలాగూడ పోలీసులు మాదాపూర్ పోలీసుల్ని సంప్రదించినా ఫలితం దక్కలేదు. దీపక్ కాల్ డిటేల్స్ పరిశీలించడంతో... నరేష్ నోటి వెంట దీపక్ పేరు పదేపదే వస్తుండడంతో అతడి ఫోన్ నంబర్ సేకరించిన పోలీసులు కాల్ డిటేల్స్ ఆరా తీశారు. అందులో ఓ నంబర్‌తో ఎక్కువసార్లు సంప్రదింపులు ఉండడంతో ఆ నంబర్‌కు లాలాగూడ పోలీసులు కాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను చౌటుప్పల్ పోలీసు అధికారినంటూ చెప్పిన అవతలి వ్యక్తి నాగరాజు హత్య నుంచి దీపక్‌ను అదుపులోకి తీసుకోవడం వరకు వివరించారు. దీంతో అప్రమత్తమైన లాలాగూడ అధికారులు నరేష్ వివరాలను చౌటుప్పల్ పోలీసులకు అందించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చౌటుప్పల్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. -
ప్రేమోన్మాదం
హైదరాబాద్ : చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి.. వివాహమైనా ఇంట్లోనే ఉంటున్న అక్కలు.. తల్లితోపాటు తనపైనే పడిన కుటుంబ పోషణ భారం.. ఈ పరిస్థితుల మధ్య చిరుద్యోగంతో నెట్టుకొస్తున్న ఆ యువతి మనసు ప్రేమవైపు మళ్లలేదు. దీంతో ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్న ఉన్మాది కక్ష కట్టాడు. పథకం ప్రకారం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉన్మాది స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నగరంలోని ఉత్తర మండల పరిధిలో ఉన్న లాలాపేట్‌లో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు.. లాలాపేట్ భజన సమాజం ప్రాంతంలో నివసించే నిరేటి సంధ్యారాణి(23) తండ్రి దాసు చిన్నతనంలోనే చనిపోయారు. ముగ్గురు సోదరులకు వివాహాలై వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయినప్పటికీ అనివార్య కారణాలతో వారు పుట్టింట్లోనే ఉంటున్నారు. తల్లి సావిత్రితో పాటు అక్కల బాధ్యత సంధ్యారాణి తీసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె శాంతినగర్ చౌరస్తాలోని లక్కీ ట్రేడర్స్ అనే అల్యూమినియం డోర్స్, విండోస్ తయారు చేసే సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. తన జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ పెద్దదిక్కు అయ్యింది. కాగా, లాలాపేట్‌లోని ఈదమ్మగుడి ప్రాంతంలో సంధ్యారాణి స్నేహితురాలు నివసిస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే సంధ్యారాణికి స్నేహితురాలి సోదరుడు కార్తీక్(25)తో పరిచయమైంది. ప్రేమించాలంటూ వేధింపులు.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. కుటుంబ భారం తనపై ఉండటంతో అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్ నేరుగా, ఫోన్ ద్వారా వేధింపులు మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సం«ధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. విధులు ముగించుకుని వస్తుండగా.. సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు. షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన కార్తీక్ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులతో మాట్లాడిన సంధ్యారాణి తనపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడని చెప్పి అతడి సెల్ నంబర్ చెప్పింది. సంధ్యారాణి పరిస్థితి చూసి ఆమె కుటుంబీకులు గుండె పగిలేలా రోధించారు. పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన సెల్ నంబర్‌కు పోలీసులు కాల్ చేయగా.. ఫోన్ ఎత్తిన కార్తీక్ తానే సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టానని, పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోతానని చెప్పి కాల్ కట్ చేశాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో లాలాగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి అతడు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
స్నేహితురాలి ఇంట్లో పూజకని వెళ్లి..
సికింద్రాబాద్: ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... సౌత్ లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన శాలిని(23) ఈ నెల 4వ తేదీన బర్కత్‌పురలో ఉండే తన స్నేహితురాలి ఇంట్లో పూజ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. శాలిని రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితులను వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. చేసేది లేక లాలాగూడ పోలీసులను మంగళవారం ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య గొంతు కోసిన కసాయి భర్త
హైదరాబాద్: గర్భంతో ఉన్న అర్ధాంగి అన్న కనికరం లేకుండా ఓ కసాయి ఆమె గొంతు కోసిన దారుణ సంఘటన నగరంలోని లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. లక్ష్మి, వెంకటేష్ దంపతులకు ఏడాది కిందట వివాహం అయింది. స్థానిక నఫీజ్ ఫంక్షన్ హాల్లో పనిచేసుకుంటూ పక్క వీధిలో జీవనం సాగిస్తున్నారు. అయితే, బుధవారం రాత్రి ఫ్లై ఓవర్ సమీపంలో వెంకటేష్ తన భార్య లక్ష్మి గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం కోసం ఓ వివాహిత ఆందోళన
-
కూతుళ్లకు ఉరివేసి ఆతర్వాత తల్లితండ్రుల ఆత్మహత్య!
హైదరాబాద్: ఇద్దరు కూతుళ్లను చంపి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించడమే కాకుండా ఆప్రాంత ప్రజల్ని విషాదానికి గురి చేసింది. లాలాపేట్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసముంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్, తన భార్యతో కలిసి ఐదేళ్ల, మూడేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కూతుళ్లకు ముందు ఉరి వేసి ఆతర్వాత వాళ్లు కూడా సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నలుగురు మరణించి ఉండటాన్ని ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణానికి సంబంధించిన సూసైడ్ నోట్ వారి వద్ద లభించలేదు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారి తీసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.