హైదరాబాద్ : చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి.. వివాహమైనా ఇంట్లోనే ఉంటున్న అక్కలు.. తల్లితోపాటు తనపైనే పడిన కుటుంబ పోషణ భారం.. ఈ పరిస్థితుల మధ్య చిరుద్యోగంతో నెట్టుకొస్తున్న ఆ యువతి మనసు ప్రేమవైపు మళ్లలేదు. దీంతో ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్న ఉన్మాది కక్ష కట్టాడు. పథకం ప్రకారం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉన్మాది స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నగరంలోని ఉత్తర మండల పరిధిలో ఉన్న లాలాపేట్‌లో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు..
లాలాపేట్ భజన సమాజం ప్రాంతంలో నివసించే నిరేటి సంధ్యారాణి(23) తండ్రి దాసు చిన్నతనంలోనే చనిపోయారు. ముగ్గురు సోదరులకు వివాహాలై వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయినప్పటికీ అనివార్య కారణాలతో వారు పుట్టింట్లోనే ఉంటున్నారు.
తల్లి సావిత్రితో పాటు అక్కల బాధ్యత సంధ్యారాణి తీసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె శాంతినగర్ చౌరస్తాలోని లక్కీ ట్రేడర్స్ అనే అల్యూమినియం డోర్స్, విండోస్ తయారు చేసే సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. తన జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ పెద్దదిక్కు అయ్యింది. కాగా, లాలాపేట్‌లోని ఈదమ్మగుడి ప్రాంతంలో సంధ్యారాణి స్నేహితురాలు నివసిస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే సంధ్యారాణికి స్నేహితురాలి సోదరుడు కార్తీక్(25)తో పరిచయమైంది.
ప్రేమించాలంటూ వేధింపులు..
దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. కుటుంబ భారం తనపై ఉండటంతో అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్ నేరుగా, ఫోన్ ద్వారా వేధింపులు మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సం«ధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
విధులు ముగించుకుని వస్తుండగా..
సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు.
షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన కార్తీక్
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులతో మాట్లాడిన సంధ్యారాణి తనపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడని చెప్పి అతడి సెల్ నంబర్ చెప్పింది. సంధ్యారాణి పరిస్థితి చూసి ఆమె కుటుంబీకులు గుండె పగిలేలా రోధించారు. పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఆమె ఇచ్చిన సెల్ నంబర్‌కు పోలీసులు కాల్ చేయగా.. ఫోన్ ఎత్తిన కార్తీక్ తానే సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టానని, పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోతానని చెప్పి కాల్ కట్ చేశాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో లాలాగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి అతడు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment