యువకుడి హత్య.. పెట్రోల్ పోసి దహనం
మర్యాల సమీపంలో వెలుగుచూసిన ఘటన
మర్యాల(బొమ్మలరామారం) : బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ శివారులో శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి మృతదేహంపై కిరోసిన్ పోసి దహనం చేశారు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు చెట్ల పొదల మాటున కాలిన శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. జాగిలం సంఘటన స్థలం నుంచి మర్యాల వైపు సుమారు కిలో మీటర్ దూరం పరిగెత్తి ఆగిపోయింది.
యువకుడిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని కారులో మర్యాల గ్రామ శివారులోని శేర్‌బండ వద్ద నిర్మానుష ప్రాంతానికి తీసుకువచ్చి గుర్తు పట్టరాని విధంగా పెట్రోల్ పోసి తగలపెట్టారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో మద్యం బాటిల్, ఖాళీ గ్లాసులు లభించాయని, ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన యువకుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుందన్నారు. మృ తుడు హైదరాబాద్ పరిసర ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్నారు.
హత్యకు వ్యాపారా లావాదేవీలు లేదా కిడ్నాప్, మిస్సింగ్‌కు సంబంధించిన కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. జాగిలం మర్యాల వైపు వెళ్లడంతో దుండగులు మృతదేహాన్ని దహనం చేయటానికి గ్రామంలో పె ట్రోల్ కొనుగోలు చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు భువనగిరి సీఐ తిరుపతి తెలిపారు. త్వరలోనే కేసు మిస్టరీని చేదిస్తామని డీఎస్పీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో ఎస్‌ఐ శివనాగప్రసాద్ పాల్గొన్నారు.