‘గడప గడపకూ వైఎస్ఆర్’ జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్:
గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం
గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల టీడీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. వందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.
భవిష్యత్తులో ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నేను మారిన మనిషిని, ఒక్కసారి చూడమని ప్రాధేయపడితే ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చారని ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈ విషయాలన్నింటినీ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాజేంద్రనాథ్‌రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, పి. ప్రసాద్‌రెడ్డి, మండలకన్వీనర్లు ఉత్తమారెడ్డి, చంద్రారెడ్డి, వీరారెడ్డి, రఘునాథరెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.