Land deeling
-
ముంబై బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్.. 22 ఎకరాలు రూ.5200 కోట్లు
ముంబై: ముంబై మార్కెట్లో అతిపెద్ద భూ విక్రయ లావాదేవీ నమోదైంది. బాంబే డైయింగ్ వర్లి ప్రాంతంలో తనకున్న 22 ఎకరాల భూమిని జపాన్‌కు చెందిన సుమిటోమోకు రూ.5,200 కోట్లకు విక్రయించనుంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో వాడియా ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన వాడియా గ్రూప్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఇదొక పెద్ద లావాదేవీ అని, దీంతో తమకున్న ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని బాంబే రియల్టీ సీఈవో రాహుల్ ఆనంద్ ప్రకటించారు. లిస్టెడ్ కంపెనీ బోంబే డైయింగ్‌కు సబ్సిడరీయే బాంబే రియల్టీ. రుణ భారం నుంచి బయటపడి, బ్యాలన్స్ షీట్‌ను బలోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 2022–23 సంవత్సరానికి గాను బాంబే రియల్టీ రూ.517 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. తాజా లావాదేవీకి సంబంధించిన చెల్లింపులు తమకు రెండు విడతల్లో లభిస్తాయని.. మొదటి దశలో రూ.4,675 కోట్లు అక్టోబర్ నాటికి, మిగిలిన రూ.525 కోట్లు 2024 మార్చి నాటికి అందుతాయని రాహుల్ ఆనంద్ వెల్లడించారు. జపాన్‌కు చెందిన సుమిటోమో రియల్టీ అండ్ డెవలపర్మెంట్ సబ్సిడరీ అయిన గోయిసు రియల్టీ ఈ భూమిని కొనుగోలు చేయనుంది. గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఈ లావాదేవీ కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
మంత్రిపై చర్యలేవి; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. మంత్రి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన గుర్తుచేశారు. ఇది జరిగి మూడు రోజులైనా.. సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని శ్రవణ్ విమర్శించారు. సాక్ష్యాలతో సహా మాట్లాడినా మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందని ఆరోపించారు. ఈవిషయాన్ని చీఫ్ విజిలెన్స్ ఆఫ్ ఇండియా, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సైదు రెడ్డికి హుజూర్ నగర్ సీటు.. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డబ్బులు అన్న చందాన క్విడ్‌ప్రో కో జరుగుతోందని ఆరోపించారు. అన్ని అంశాలపై ట్విటర్లో స్పందించే మంత్రి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. -
భూ పంపిణీలో వివాదం
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గ్రామస్తుడు ఈపూరు: భూములు అప్పగించే విషయంలో మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో శుక్రవారం వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరు పురుగు మంది తాగి ఆత్మహత్యాయత్నాకి ప్రయత్నించారు. మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో భూములను గత నాలుగు రోజుల నుంచి పేదలకు రెవెన్యూ అధికారులు పంపిణీ చేస్తున్నారు. అధికారులు పంపిణీ చేస్తున్న భూములను గ్రామానికి చెందిన కొందరు బాగు చేసుకొని సాగు చేసుకుంటున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములను పంపిణీ చేయడానికి వీళ్లేదంటూ గ్రామానికి చెందిన బండారు దిబ్బయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని అతని వద్ద ఉన్న పురుగు మందు డబ్బాను లాక్కున్నారు. పురుగు మందు తాగిన వెంటనే ఈపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆద్వర్యంలో బొల్లాపల్లి ఎస్సై పట్టాభిరామయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వేను అడ్డుకుంటున్న దిబ్బయ్య భార్యతో మాట్లాడి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. తహశీల్దార్ ప్రశాంతి జరిగిన విషయాన్ని ఆర్డీవో రవీంద్రకు ఫోన్‌ద్వారా తెలియజేశారు. తాత్కాలికంగా పంపిణీ నిలిపవేసినట్లు తహశీల్దార్ ప్రకటించారు. మొత్తం 84 మందికి గాను 73 మంది లబ్ధిదారులకు భూముల అప్పగించినట్లు తెలిపారు. వీఆర్వో ఉమాశంకర్, సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.