land degradation neutral
-
సుసంపన్నం దుంప పంటల వైవిధ్యం
ప్రజల ఆహారంలో ధాన్యాల తర్వాత అంత ప్రాధాన్యం కలిగినవి దుంపలు. దుంప పంటలు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేవి బంగాళ దుంప, కంద, చేమదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఇంకా చెప్పాలంటే కర్రపెండలం, తాటి తేగలు కూడా. అయితే, మనకు తెలియని దుంప పంట రకాలు మరెన్నో ఉన్నాయి. ఈ పంటల జీవవైవిధ్యం చాలా సుసంపన్నమైనది. గ్రామీణులు, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలకు ఆహార భద్రతను కల్పిస్తున్నప్పటికీ దుంప పంటలు జీవవైవిధ్యం క్రమంగా అంతరించిపోతోంది. భూసార క్షీణత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూతాపోన్నతిని దీటుగా ఎదుర్కోవడంలో దుంప పంటలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ దృష్ట్యా దుంప పంటలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం సహజ సమృద్ధ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఇటీవల మైసూరులో ఇటీవల జరిగిన ప్రత్యేక దుంప పంటల ప్రదర్శన దక్షిణాదిలో దుంప జాతుల జీవవైవిధ్యానికి అద్దం పట్టింది. వివిధ దుంప జాతులను తోటల్లో అంతర పంటలుగా పండించుకొని పరిరక్షించుకోవచ్చు. దుంప జాతుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం, వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారంలోకి తేవడం కోసం సహజ సమృద్ధ సంస్థ నాబార్డు తోడ్పాటుతో ఇటీవల కేలండర్ను ప్రచురించడం విశేషం. గతంలో దేశీ వరి వంగడాలు, చిరుధాన్యాలపై కూడా కేలండర్లను ఈ సంస్థ ప్రచురించింది. దుంప పంటలు, వంటల కేలండర్ ధర రూ. 75. వివరాలకు.. బెంగళూరులోని సహజ మీడియా వారిని 70900 09922 నంబరులో సంప్రదించవచ్చు. -
భూసారం పెంపునకు కొత్త పథకం
‘ల్యాండ్ డీగ్రేడేషన్ న్యూట్రల్’ను ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: దేశంలో వేగంగా పెరుగుతున్న భూముల సారహీనత కారణంగా దేశ ఆహార భద్రత ప్రమాదంతో పడిన విషయాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. భూమి, నీరు, జీవ వైవిధ్యతల మెరుగైన నిర్వహణ ద్వారా భూవనరుల స్థితిగతులను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ‘ల్యాండ్ డీగ్రేడేషన్ న్యూట్రల్’ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ప్రజాజీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న భూముల ఎడారీకరణ, సారహీనత, నిరుపయోగ భూములు మారడం.. అనే సవాళ్లను ఎదుర్కొని 2030 నాటికి భూముల సారహీనతను తటస్థీకరించాలని ఈ పథకంలో లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఇందుకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, జలవనరులు.. తదితర సంబంధిత శాఖల సమన్వయానికి పర్యావరణ శాఖ కృషి చేస్తుందన్నారు. పేదరిక నిర్మూలనకు నడుం బిగించిన మోడీ సర్కారుకు.. ఈ పథకం తోడ్పడుతుందన్నారు. ‘ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా మంగళవారం వాతావరణ శాఖ, జాతీయ అటవీ పరిశోధక మండలి సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల సహకారంతో భూముల సారహీనతను తటస్థీకరించే తమ లక్ష్యం నెరవేరుతుందని కార్యక్రమం అనంతరం జవదేకర్ ట్వీట్ చేశారు.