land distribution to poor peoples
-
భూ పంపిణీ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పేదలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర ను ప్రారంభించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ మహేశ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూదానోద్యమంలో ప్ర«థమ భూదాత వెదిరె రాం చంద్రారెడ్డి సమాధి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మాట్లాడుతున్న మల్లు భట్టివిక్రమార్క అనంతరం టూరిజం పార్కు ఆవరణ లో ఉన్న ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం వేళ ఆచార్య వినోబాభావే పోచంపల్లిని సందర్శించారన్నారు. రాం చంద్రారెడ్డి వద్ద 100 ఎకరాల భూమిని సేకరించి ఆయన భూదానోద్యమానికి శ్రీకారం చుట్టా రని గుర్తు చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో భూసంస్కరణ చట్టాలు తెచ్చి భూమి లేని నిరుపేదలకు లక్షలాది ఎకరాలు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అయితే నేడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాడు పేదలకు పంచిన అసైన్డ్ భూములను లాక్కుంటోందని విమర్శించారు. అసైన్డ్, భూదాన భూములను ధరణి పోర్టల్‌లోని పార్ట్ బీలో నమోదు చేయడం వల్ల ఇటు పాసుపుస్తకాలు రాక, అటు రైతుబంధు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అక్కడ పనిచేసే వారిని బదిలి చేస్తాం: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కొంతమంది కేసులు వేసి ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని విశాఖ ఇంచార్జ్ మంత్రి కన్నబాబు అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై మంత్రి కన్నబాబు బుధవారం విశాఖలో అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి పారదర్శకంగా చేపడుతున్నాం. అర్హత ఉన్ననిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. విశాఖలో ప్రభుత్వ భూముల రక్షణపై చర్చించాం. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వ్యవహారాలపై ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నాం. (విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి) విశాఖలో ప్రభుత్వ భూముల రికార్డులపై ల్యాండ్ ఆడిటింగ్ చేయనున్నాం. విశాఖలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాలలో ల్యాండ్ రికార్డులు చూస్తూ, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయనున్నాం. పంచగ్రామాల సమస్యలపై చర్చించాం. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటాం. విశాఖలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను రక్షించేందుకు పూర్తి స్ధాయి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. గత ప్రభుత్వంలో విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకి గురయ్యాయి. దీనికి సంబంధించి కలెక్టర్ పర్యవేక్షణలో త్వరలోనే లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి కన్నబాబు తెలిపారు. (‘ఆ కుట్రల్లో నిమ్మగడ్డ బలి పశువు కావొద్దు’) -
103 భూ పంపిణీ లబ్ధిదారులు
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో పేదలకు భూ పంపిణీ నామమాత్రంగా మారింది. పేద, దళిత కుటుంబాలకు సాగుకు యోగ్యమైన భూమి పంపిణీ చేసి లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరకుండా పోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 19,440 మందికి లబ్ధి చేకూరగా.. ఆయన మరణానంతరం పంపిణీ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ పథకం వర్తించేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2005 ఏప్రిల్ 14న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా భూ పంపిణీ చేసే విధంగా రూపకల్పన చేశారు. వైఎస్ హయాంలో ఐదు విడుదలుగా భూ పంపిణీ జరిగింది. ఆయన మరణానంతరం 2010, 2011లో జిల్లాలో భూ పంపిణీ జరగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం రెండు విడతలుగా చేపట్టింది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బస్తీ పేరిట ఈ యేడాది ఆగస్టు 15న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. నియోజకవర్గానికో గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన భూమి కొనుగోలు పథకం పేరున జిల్లాకు మొదటి విడతగా రూ.18.27 కోట్ల నిధులు కేటాయించింది. అధికారులు ఈ యేడాది సెప్టెంబర్ 27 వరకు 170 మంది లబ్ధిదారులను గుర్తించి 103 మందికి భూ పంపిణీ చేశారు. ఆగస్టులో పథకం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు మరోసారి జిల్లాలో భూ పంపిణీ చేపట్టలేదు. కాగా, ప్రతి సోమవారం భూ పంపిణీకి సంబంధించిన అర్జీలు గ్రీవెన్స్‌లో వస్తూనే ఉన్నాయి. గతంలో ఏడు విడుతల్లో పంపిణీ.. గత ప్రభుత్వాలు ఏడు విడతలుగా భూ పంపిణీ చేపట్టాయి. వైఎస్ హయాంలో 2005 నుంచి ఐదు విడతలుగా.. జిల్లాలోని 19,440 మంది లబ్ధిదారులకు 45,486.31 ఎకరాలు పంపిణీ చేసి వ్యవసాయ యోగ్యత కల్పించారు. తర్వాత 2012-13 సంవత్సరాల్లో రెండు విడతలుగా భూ పంపిణీ చేపట్టి 2,250 మంది లబ్ధి చేకూర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బస్తీలో భాగంగా మొదటి దశలో మండలానికో గ్రామం చొప్పున భూ పంపిణీ చేస్తామని ప్రకటించినా.. చివరకు నియోజకవర్గానికో గ్రామం ఎంపిక చేశారు. సాగు యోగ్యమైన ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో పంపిణీకి అధికారులు ఇబ్బంది పడ్డా.. భూమి కొనుగోలు పథకం కింద జిల్లాకు రూ.18.27 కోట్లు కేటాయించడంతో 103 మందికి భూ పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలోని బాలెపల్లిలో, చెన్నూర్‌లోని వెంకటాపూర్‌లో, బెల్లంపల్లిలోని జెండా వెంకటాపూర్‌లో, మంచిర్యాలలోని మెట్టపల్లిలో, ఆసిఫాబాద్‌లోని సారంగిలో, ఖానాపూర్లోని భుట్టాపూర్లో, బోథ్‌లోని సావర్గాంలో, నిర్మల్‌లోని తాంసా, ముథోల్‌లోని జెండాలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని కాప్రి గ్రామంలో భూ పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపులు... భూ పంపిణీ చేయాలని నిరుపేద లబ్ధిదారుల నుంచి జిల్లా అధికారులకు నిత్యం దరఖాస్తులు అందుతున్నాయి. గ్రామ శివారులో ప్రభుత్వ భూమి ఉందని, దానిని పంపిణీ చేయాలని అధికారులకు విన్నవిస్తున్నారు. జిల్లాలో కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న పేదలు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యం ఇస్తారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న వారికి ఏడు విడతల్లోనూ అవకాశం రాలేదు. పలుమార్లు అధికారులకు దరఖాస్తులు సమర్పించినా లాభం లేకుండా పోయింది. దళిత బస్తీలోనూ వస్తుందనుకుంటే ఆ అవకాశం దక్కలేదు. దీంతో ప్రభుత్వం ఎప్పుడు భూ పంపిణీ కార్యక్రమం చేపడుతుందా.. అని అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.