పాదయాత్ర చేస్తున్న భట్టి, మీనాక్షి నటరాజన్, సీతక్క, మధుయాష్కీగౌడ్ తదితరులు
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పేదలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర ను ప్రారంభించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ మహేశ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూదానోద్యమంలో ప్ర«థమ భూదాత వెదిరె రాం చంద్రారెడ్డి సమాధి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
మాట్లాడుతున్న మల్లు భట్టివిక్రమార్క
అనంతరం టూరిజం పార్కు ఆవరణ లో ఉన్న ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం వేళ ఆచార్య వినోబాభావే పోచంపల్లిని సందర్శించారన్నారు. రాం చంద్రారెడ్డి వద్ద 100 ఎకరాల భూమిని సేకరించి ఆయన భూదానోద్యమానికి శ్రీకారం చుట్టా రని గుర్తు చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో భూసంస్కరణ చట్టాలు తెచ్చి భూమి లేని నిరుపేదలకు లక్షలాది ఎకరాలు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అయితే నేడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు పేదలకు పంచిన అసైన్డ్ భూములను లాక్కుంటోందని విమర్శించారు. అసైన్డ్, భూదాన భూములను ధరణి పోర్టల్‌లోని పార్ట్ బీలో నమోదు చేయడం వల్ల ఇటు పాసుపుస్తకాలు రాక, అటు రైతుబంధు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment