సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కొంతమంది కేసులు వేసి ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని విశాఖ ఇంచార్జ్ మంత్రి కన్నబాబు అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై మంత్రి కన్నబాబు బుధవారం విశాఖలో అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి పారదర్శకంగా చేపడుతున్నాం. అర్హత ఉన్ననిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. విశాఖలో ప్రభుత్వ భూముల రక్షణపై చర్చించాం. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వ్యవహారాలపై ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నాం.
(విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి)
విశాఖలో ప్రభుత్వ భూముల రికార్డులపై ల్యాండ్ ఆడిటింగ్ చేయనున్నాం. విశాఖలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాలలో ల్యాండ్ రికార్డులు చూస్తూ, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయనున్నాం. పంచగ్రామాల సమస్యలపై చర్చించాం. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటాం. విశాఖలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను రక్షించేందుకు పూర్తి స్ధాయి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. గత ప్రభుత్వంలో విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకి గురయ్యాయి. దీనికి సంబంధించి కలెక్టర్ పర్యవేక్షణలో త్వరలోనే లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి కన్నబాబు తెలిపారు. (‘ఆ కుట్రల్లో నిమ్మగడ్డ బలి పశువు కావొద్దు’)
Comments
Please login to add a commentAdd a comment