
విశాఖ మహానగర అభివృద్ధి ప్రణాళికపై క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
సాక్షి, అమరావతి: ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేలా విశాఖ మహానగర ప్రాంత రూపురేఖలలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖ మహానగర అభివృద్ధి ప్రణాళికపై సీఎం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ కూడా పాల్గొన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమవుతున్న దృష్ట్యా.. ఆ విమానాశ్రయానికి, నగరానికి మధ్య ఉన్న ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు.
విశాఖ నగరం నుంచి భోగాపురం ప్రాంతానికి వేగంగా చేరుకునేలా రోడ్డు నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బైపాస్ మార్గాల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. మెట్రో, ట్రాం రైలు వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే బీచ్‌రోడ్డును కూడా సర్వాంగ సుందరంగా, చక్కటి పర్యాటక ప్రాంతంగా నిలిచేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించారు. వారణాశిలో కాశీ విశ్వనాథ్ దేవాలయ ప్రాంగణం అభివృద్ధి ప్రణాళికనూ ఆయనే రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment