ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో పేదలకు భూ పంపిణీ నామమాత్రంగా మారింది. పేద, దళిత కుటుంబాలకు సాగుకు యోగ్యమైన భూమి పంపిణీ చేసి లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరకుండా పోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 19,440 మందికి లబ్ధి చేకూరగా.. ఆయన మరణానంతరం పంపిణీ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ పథకం వర్తించేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2005 ఏప్రిల్ 14న ఈ పథకాన్ని ప్రారంభించారు.
అప్పటి నుంచి ఏటా భూ పంపిణీ చేసే విధంగా రూపకల్పన చేశారు. వైఎస్ హయాంలో ఐదు విడుదలుగా భూ పంపిణీ జరిగింది. ఆయన మరణానంతరం 2010, 2011లో జిల్లాలో భూ పంపిణీ జరగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం రెండు విడతలుగా చేపట్టింది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బస్తీ పేరిట ఈ యేడాది ఆగస్టు 15న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. నియోజకవర్గానికో గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన భూమి కొనుగోలు పథకం పేరున జిల్లాకు మొదటి విడతగా రూ.18.27 కోట్ల నిధులు కేటాయించింది. అధికారులు ఈ యేడాది సెప్టెంబర్ 27 వరకు 170 మంది లబ్ధిదారులను గుర్తించి 103 మందికి భూ పంపిణీ చేశారు. ఆగస్టులో పథకం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు మరోసారి జిల్లాలో భూ పంపిణీ చేపట్టలేదు. కాగా, ప్రతి సోమవారం భూ పంపిణీకి సంబంధించిన అర్జీలు గ్రీవెన్స్‌లో వస్తూనే ఉన్నాయి.
గతంలో ఏడు విడుతల్లో పంపిణీ..
గత ప్రభుత్వాలు ఏడు విడతలుగా భూ పంపిణీ చేపట్టాయి. వైఎస్ హయాంలో 2005 నుంచి ఐదు విడతలుగా.. జిల్లాలోని 19,440 మంది లబ్ధిదారులకు 45,486.31 ఎకరాలు పంపిణీ చేసి వ్యవసాయ యోగ్యత కల్పించారు. తర్వాత 2012-13 సంవత్సరాల్లో రెండు విడతలుగా భూ పంపిణీ చేపట్టి 2,250 మంది లబ్ధి చేకూర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బస్తీలో భాగంగా మొదటి దశలో మండలానికో గ్రామం చొప్పున భూ పంపిణీ చేస్తామని ప్రకటించినా.. చివరకు నియోజకవర్గానికో గ్రామం ఎంపిక చేశారు.
సాగు యోగ్యమైన ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో పంపిణీకి అధికారులు ఇబ్బంది పడ్డా.. భూమి కొనుగోలు పథకం కింద జిల్లాకు రూ.18.27 కోట్లు కేటాయించడంతో 103 మందికి భూ పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలోని బాలెపల్లిలో, చెన్నూర్‌లోని వెంకటాపూర్‌లో, బెల్లంపల్లిలోని జెండా వెంకటాపూర్‌లో, మంచిర్యాలలోని మెట్టపల్లిలో, ఆసిఫాబాద్‌లోని సారంగిలో, ఖానాపూర్‌లోని భుట్టాపూర్‌లో, బోథ్‌లోని సావర్‌గాంలో, నిర్మల్‌లోని తాంసా, ముథోల్‌లోని జెండాలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని కాప్రి గ్రామంలో భూ పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
లబ్ధిదారుల ఎదురుచూపులు...
భూ పంపిణీ చేయాలని నిరుపేద లబ్ధిదారుల నుంచి జిల్లా అధికారులకు నిత్యం దరఖాస్తులు అందుతున్నాయి. గ్రామ శివారులో ప్రభుత్వ భూమి ఉందని, దానిని పంపిణీ చేయాలని అధికారులకు విన్నవిస్తున్నారు. జిల్లాలో కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న పేదలు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యం ఇస్తారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న వారికి ఏడు విడతల్లోనూ అవకాశం రాలేదు.
పలుమార్లు అధికారులకు దరఖాస్తులు సమర్పించినా లాభం లేకుండా పోయింది. దళిత బస్తీలోనూ వస్తుందనుకుంటే ఆ అవకాశం దక్కలేదు. దీంతో ప్రభుత్వం ఎప్పుడు భూ పంపిణీ కార్యక్రమం చేపడుతుందా.. అని అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
103 భూ పంపిణీ లబ్ధిదారులు
Published Mon, Nov 17 2014 2:24 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement