land distribution to scs
-
మూడెకరాలు ముందుకు
వరంగల్ రూరల్: నిరుపేద దళితులు అభివృద్ధి చెందాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. వారి అభ్యున్నతి కోసం భూములు లేని కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం మూడెకరాల భూమి అందిస్తున్న విషయం విధితమే. అయితే ఈ పథకం అమలులో ఉమ్మడి జిల్లాలో రూరల్ జిల్లా ముందంజలో ఉంది. ఇప్పటికే 180 మందికి ఒకరికి మూడెకరాల చొప్పున పంపిణీ చేశారు. భూ పథకం కింద రైతులకు 487.37 ఎకరాలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందజేశారు. మరో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి అధికారులు మంతనాలు జరుపుతున్నారు. భూమి కొనుగోలుపై చర్చ ఇటీవల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో భూ కొనుగోలు పథకం ముందంజలో ఉందని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో 350 ఎకరాల భూమిని ఇప్పటికే కొనుగోలు చేశామని, మరో 80 ఎకరాల భూమిని కొనుగోలుకు రైతులతో చర్చలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. భూముల ధరలకు రెక్కలు రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు, సాగు నీటిని రైతులకు సాగుకు అందించడానికి చర్యలు తీసుకోవడం మూలంగా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఒక్కప్పుడు 3 నుంచి రూ.4 లక్షలకే ఎకరం భూమి లభించేది. ఇప్పుడు గ్రామాల్లో ఎకరానికి రూ.6 నుంచి 7 లక్షలకు ఎకరం ధర పెరిగింది. దీంతో మిగతా జిల్లాల్లో భూములు దొరకని పరిస్థితి ఉంది. భూ పంపిణీ వివరాలు ఇలా.. నర్సంపేట రెవెన్యూ డివిజన్లో 2014–15 నర్సంపేట మండలం బాంజీపేటలో ఏడుగురు దళితులకు 21 ఎకరా>ల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. 2015–16 నుంచి 2018 –19 వరకు 21 ఎకరాల ప్రభుత్వ భూమిని, 485.37 ఎకరాల ప్రైవేట్ భూములను 26.21 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు అందజేసింది. ఇంకా నర్సంపేట రెవెన్యూ డివిజన్ లో మరో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ఇటీవల నెక్కొండ మండలం చంద్రుగొండలో జాయింట్‌కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఎన్.రవి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.సురేష్, ఫీల్డ్ లెవల్ సర్వే నిర్వహించి 50 ఎకరాల భూమిని సర్వే చేశారు. ధరలు పెరిగినా కొనుగోలు చేస్తున్నాం జిల్లాలో భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు పథకంలో భూముల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఎకరం భూమి ధర ప్రస్తుతం రూ.8 నుంచి 10 లక్షలకు పెరిగింది. రైతు బంధు, సాగునీటి సౌకర్యం, ఉచిత విద్యుత్ కారణంగా భూములను అమ్మడానికి రైతులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరం భూమికి రూ.6 లక్షలకు మించి ఇవ్వడం లేదు. డబ్బులు పెంచాల్సిన అవసరం ఉంది. – రావుల మహేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ -
పా‘మాయ’లు సాగనివ్వం
బొబ్బిలి కోట ముందే తేల్చుకుంటాం మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు తన భూములను రక్షించుకునేందుకు, తన అనుచరులకు పనికి రాని భూములకు ఎక్కువ ధర వచ్చేలా సర్కారుకు అంటగట్టేందుకే మంత్రి పదవి సంపాదించుకున్నారు. శిష్టు సీతారాంపురంలో ఎస్సీలకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా పంపిణీ చేసేందుకు ఎకరా కనీసం రూ.6లక్షలు కూడా చెయ్యని భూములను అధికారులతో రూ.14 లక్షలకు కొనుగోలు చేయించిన ఘనత మంత్రిది. కొనుగోలు చేసిన భూముల్లో ఎకరాకు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు మంత్రి కమీషన్లు దండుకుంటున్నారు. ఈ భూదందా, దోపిడీలపై బొబ్బిలి కోట ముందే సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తాం. ప్రజాక్షేత్రంలోనే దీనిపై తేల్చుకుంటాం. – బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్ : రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురం సిత్రాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. తెరవెనుక జరిగిన బాగోతంపై వరుసగా వస్తున్న కథనాలు నేతల్లో కదలిక తీసుకువచ్చాయి. అధికారవర్గాల్లో వణుకు పుట్టించాయి. తప్పు చేసిన వారు నోరెత్తడానికే భయపడి బయటకు రావడం లేదు. పెద్దలకు అండగా వ్యవహారాన్నంతా నడిపించిన జిల్లా అధికారుల్లో ఒకరు జ్వరం వచ్చిందంటూ విధులకు సెలవు పెట్టేస్తే... మరికొందరు తప్పును కప్పిపుచ్చుకునే యత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి అనుచరులు రంగంలోకి దిగి అధికారులను, ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టారు. సాక్షికి ఎలాంటి సమాచారం అందించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. సాక్షికి ఎవరైనా వాస్తవాలు వెల్లడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ విపక్షాలు వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాయి. అధికారపార్టీ నాయకులే కారకులు తక్కువధర భూములు అధికధరలకు కొనుగోలు చేసిన స్కాంలో అధికారపార్టీ నాయకులే కీలకం. మంత్రి అనుచరులు చేసిన ఈ స్కాంలో మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విచారణ చేసి సూత్రధారులపై చర్యలు చేపట్టి ఎస్సీలకు న్యాయం చేయాలి. బా«ధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలి. – ఒమ్మి రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, బొబ్బిలి అధికారులు, పాలకులు కుమ్మక్కయ్యారు ఎస్.సీతారాంపురం భూ పంపిణీ పథకంతో అధికారులు, ప్రభుత్వం కలసి దళితులను ఇరుకున పెడుతున్నాయి. వాళ్ళ నెత్తిన రుణాల భారాన్ని రుద్దుతున్నాయి. దళితుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దళితులను అనేక చిక్కుల్లో, ఇబ్బందుల్లో పెడుతోంది. ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్న వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దళితులను దగా చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక జిల్లాలో అనేక చోట్ల అనేక రకాలుగా దళితులపై దాడులు పెరిగాయి. భూ పంపిణీ పథకంలో దళితులను ఇరుకున పెట్టి వాళ్ళకు తెలియకుండానే అప్పుల పాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను సీపీఎం చూస్తూ ఊరుకోదు. సీతారాంపురం దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. బొబ్బిలి రాజులు అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్ని లాక్కుంటున్నారు. – తమ్మినేని సూర్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి. సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించిన ధరే రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో పేదలకు పంపిణీ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించిన మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేశాం. చుట్టుపక్కల ధరలను కమిటీ పరిశీలించి అందుకు అనుగుణంగా ధర నిర్ణయించింది. సాధారణ భూములు రూ.13 లక్షల వరకు ధర పలుకుతుంది. శిష్టు సీతారాంపురంలో ఆయిల్‌పామ్ తోటలు పెంచి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వాటికి అయిన ఖర్చును కలుపుకొని అందుకు అనుగుణంగా ధరను నిర్ణయించాం. రెండునెలల క్రితమే ఈ ప్రక్రియ పూర్తిచేశాం. కమిటీలో ఎస్సీ కార్పొరేషన్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, ఉద్యానవనశాఖ, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు. – బి.సుదర్శనదొర, ఆర్డీఓ, పార్వతీపురం కఠిన చర్యలు చేపట్టాలి వరుసగా పత్రికలో కథనాలు వస్తున్నా అటు అధికారులు కానీ, ఇటు అధికారపార్టీకానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. శిష్టు సీతారాంపురంలో ఎకరా రూ.7లేదా రూ.8లక్షలు ఉంటుంది. అలాంటిది రూ.14లక్షలు ఎలా అంచనా వేసి కొనుగోలు చేశారు? దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉందో దర్యాప్తు చేయాలి. బాధ్యులపై చర్యలు చేపట్టాలి. – రెడ్డివేణు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, బొబ్బిలి ఇదేనా నీతివంతమైన పాలన? మంత్రి నీతివంతమైన పాలన ఇదేనా? గతంలో పేద ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కున్నారు. ప్రస్తుతం ఎస్సీలకు పనికిరాని ఆయిల్‌పామ్ తోటను కమీషన్లకోసం బలవంతంగా అంటగట్టి పెద్ద స్కాంకు తెరతీశారు. పాత్రధారులు ఎవరైనా వారిపై చర్యలు చేపట్టాలి. పేదలకు న్యాయం చేయాలి. ఎవరూ నోరుమెదపకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సమాధానం చెప్పాలి. – ఆకుల దామోదరరావు, లోక్‌సత్తా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, బొబ్బిలి. -
మూడెకరాల భూమి, ఇల్లు కలేనా?
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లింపు నామమాత్రంగా భూ పంపిణీ ప్రభుత్వ మోసాలపై ఉద్యమాలు నిర్మిస్తాం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు కలగానే మిగిలే పరిస్థితి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మాణిక్యం అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన సీపీఎం డివిజన్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 10 లక్షల దళితు కుటుంబాలు ఉన్నాయని, సీఎం హామీ అమలు కావాలంటే 30 లక్షల ఎకరాల భూమి అవసరమన్నారు. ఇప్పటి వరకు కేవలం 3 వేల ఎకరాల కూడా పంపిణీ చేయలేదన్నారు. జిల్లాలో 16 వేల దళిత కుటుంబాలు ఉంటే కేవలం 550 మందికి మాత్రమే భూమి ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే దళితులు సాగు చేసుకుంటున్న భూములను దళారులు కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతి అటుంచితే గతంలో నిర్మించుకున్న ఇళ్లకు నేటికీ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత వాడల అభివృద్ధికి కేటాయించాలని, కానీ వీటిని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇతర పథకాలకు మళ్లించి దళితులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితులను సంఘటితం చేసి ఉద్యమాలను నిర్మిస్తామని మాణిక్యం హెచ్చరించారు. లాఠీచార్జీ చేసిన పోలీసులపై కేసులు పెట్టాలి శివ్వంపేట మండలం ధర్మా తండాకు చెందిన గిరిజనుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు కబ్జాలకు పాల్పడుతుంటే అడ్డుకున్న గిరిజనులపై కక్షగట్టి అర్ధరాత్రి పోలీసులు తండాపై దాడిచేసి లాఠీచార్జీ శారని మాణిక్యం అన్నారు. అమాయక గిరిజనులపై దౌర్జన్యాలు చేస్తూ 50 మందిపైన కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గిరిజనులపై దాడులకు పాల్పడిన సీఐ, ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిరంజీవి, నర్సింహులు, సంగమేశ్వర్, రాములు, మోషప్ప, అరుణ్ పాల్గొన్నారు.