land loosers
-
స్థలం చూపించి సర్వే చేయాలి
దుబ్బగూడెం గ్రామస్తులు సర్వే అడ్డగింత కాసిపేట : పునరావాసానికి సంబంధించి స్థలం చూపించిన అనంతరం సర్వేలు చేయాలని సోమవారం మండలంలోని దుబ్బగూడెంలో గ్రామస్తులు సామాజిక ఆర్థిక స్థితిగతులపై చేస్తున్న సర్వేను అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో దుబ్బగూడెం గ్రామం నిర్వాసిత గ్రామంగా మారుతుండటంతో గ్రామస్తులు పునరావాస గ్రామానికి స్థలం చూపించిన తరువాత సర్వేలు చేయాలని పలుమార్లు అడ్డుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో గ్రామస్తులు చర్చించడంతో అనువైన స్థలం చూసుకుంటే గ్రామస్తులకు ఇష్టం ఉన్నచోట అనువైన స్థలాన్ని చూపించడం జరుగుతుందన్నారు. అనంతరం సింగరేణి అధికారులు రెండుమూడు స్థలాలను చూపించారు. అయినప్పటికి స్థలం సమస్య కొలిక్కి రాకముందే సర్వేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు. అనంతరం సింగరేణి ప్రాజెక్టు అధికారి రామ్మూర్తి ఆధ్వర్యంలో గ్రామస్తులను కొంతమందిని మందమర్రికి తీసుకువెళ్లి వీలైన స్థలాలు చూపించారు. సర్వేకు వచ్చిన మందమర్రి, బెల్లంపల్లి డెప్యూటీ తహశీల్ధార్లు శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, షరీఫ్‌లు, సింగరేణి అధికారులు వెనుతిరిగారు. -
జోరందుకున్న సంతకాల సేకరణ
కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎర్రవల్లిలో భూసేకరణ కోసం చేపట్టిన సమ్మతి ఫారాలపై సంతకాల సేకరణ జోరందుకుందని తహసీల్దార్ విజయ్‌భాస్కర్‌జీ పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవల్లిలో బుధవారం భూసేకరణ కోసం ఫారం నంబరు (1), (2)లపై రైతుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బయట వ్యవసాయ పనులు సాగుతుండటంతో మరింతగా వేగంగా సంతకాల సేకరణకు రైతులు మొగ్గు చూపడం లేదన్నారు. కేవలం 3 గంటల్లో 30 మంది రైతుల వద్ద నుంచి 86 ఎకరాల భూములు ప్రాజెక్టుకు ఇచ్చేందుకు సమ్మతి పత్రాలపై రైతులు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా 123 జీవో ప్రకారం భూములను అప్పగిస్తున్నారన్నారు. అందరి రైతుల వద్ద నుంచి సమ్మతి సంతకాల సేకరణలు ముగిసిన వెంటనే ఏ రైతుది ఎన్ని ఎకరాల భూమిని కోల్పోతున్నారో తెలిసేలా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టిస్తామన్నారు. తదుపరి భూముల రిజిస్ట్రేఫన్ పరంపర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉటుకూరి నర్సింహారెడ్డి , ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, వీఆర్వోలు జలంధర్, వెంకటనర్సయ్య, ప్రవీణ్, యాదగిరి. రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓసీ కోసం ఇంటింటి సర్వే ప్రారంభం
కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం ఉదయం నుంచి రెవెన్యూ, సింగరేణి అధికారులు కెకె ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు సంబంధించి గహాల సర్వేలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వేలు చేశారు. ఇంటి విస్తీర్ణం మాత్రమే సర్వేచేయడం జరుగుతుందని తెలిపారు. ఈసర్వేల అనంతరం ఇంజనీరింగ్ అధికారులు ఇంటివిలువ, ఇతర నిర్మాణాలు, చెట్లు తదితర అంశాలపై సర్వేచేసి పూర్తివిలువ నిర్ధారించనున్నట్లు తెలిపారు. సర్వేలో ఏంఆర్ఐ కమల్‌సింగ్, బెల్లంపల్లి, నెన్నెల సర్వేయర్లు అలోవ్‌సింగ్, మణిరాజ్, సింగరేణి సర్వేయర్లు, సిబ్బంది తదితరులున్నారు. సర్వేను అడ్డుకున్న ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కెకె ఓపెన్‌కాస్టు కోసం దుబ్బగూడెంలో చేస్తున్న ఇళ్ల సర్వేను సాయంత్రం ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజల ఇష్టం పక్కన పెడితే వారికి చెల్లించే పరిహారంపై ఆమోదం లేకుండానే సర్వేలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గాదేవేణి బుచ్చయ్య, కోకన్వీనర్ బోగె పోశం, నాయకులు గోనెల శ్రీనివాస్ తదితరులున్నారు.