- దుబ్బగూడెం గ్రామస్తులు సర్వే అడ్డగింత
కాసిపేట : పునరావాసానికి సంబంధించి స్థలం చూపించిన అనంతరం సర్వేలు చేయాలని సోమవారం మండలంలోని దుబ్బగూడెంలో గ్రామస్తులు సామాజిక ఆర్థిక స్థితిగతులపై చేస్తున్న సర్వేను అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో దుబ్బగూడెం గ్రామం నిర్వాసిత గ్రామంగా మారుతుండటంతో గ్రామస్తులు పునరావాస గ్రామానికి స్థలం చూపించిన తరువాత సర్వేలు చేయాలని పలుమార్లు అడ్డుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో గ్రామస్తులు చర్చించడంతో అనువైన స్థలం చూసుకుంటే గ్రామస్తులకు ఇష్టం ఉన్నచోట అనువైన స్థలాన్ని చూపించడం జరుగుతుందన్నారు. అనంతరం సింగరేణి అధికారులు రెండుమూడు స్థలాలను చూపించారు. అయినప్పటికి స్థలం సమస్య కొలిక్కి రాకముందే సర్వేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు. అనంతరం సింగరేణి ప్రాజెక్టు అధికారి రామ్మూర్తి ఆధ్వర్యంలో గ్రామస్తులను కొంతమందిని మందమర్రికి తీసుకువెళ్లి వీలైన స్థలాలు చూపించారు. సర్వేకు వచ్చిన మందమర్రి, బెల్లంపల్లి డెప్యూటీ తహశీల్ధార్‌లు శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, షరీఫ్లు, సింగరేణి అధికారులు వెనుతిరిగారు.