తరగని గని.. సింగరేణి
తవ్వే కొద్దీ నల్ల బంగారం
సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం సర్వేల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నల్ల బంగారం నిల్వలకు కొరత లేదని సింగరేణి బొగ్గు అన్వేషణ (ఎక్స్‌ప్లోరేషన్) విభాగం నిర్ధారించింది. తెలంగాణ కొంగు బంగారంగా పేరొందిన సింగరేణిలో తరతరాలకు తరగని బొగ్గు నిక్షేపాలున్నట్లుగా గుర్తిం చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆది లాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 10 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు ఇటీవలి సర్వేల్లో వెల్లడైంది. 1889లో బ్రిటిష్ హయాంలో మొదలైన బొగ్గు తవ్వకాలు.. 125 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇన్నేళ్లలో సింగరేణిలో కేవలం 1,100 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికి తీశారు. ఇదే లెక్కన ఈ ప్రాంతంలో లభ్యమయ్యే బొగ్గు నిల్వలను వెలికి తీయడానికి కనీసం మరో 200 ఏళ్ల కాలం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజా సర్వేల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 3,786.42 మిలియన్ టన్నులు, కరీంనగర్ జిల్లాలో 2,041.19 మిలియన్ టన్నులు, వరంగల్ జిల్లాలో 1,291.83 మిలియన్ టన్నులు, ఖమ్మం జిల్లాలో 2,954.10 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. బొగ్గు నిల్వల్లో దాదాపు అరవై శాతం 300 మీటర్ల లోతు మేరకే అందుబాటులో ఉండటం గమనార్హం. అందుకే బొగ్గు ఉత్పత్తికి ఇది అనువైన క్షేత్రంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే 300 మీటర్ల నుంచి 600 మీటర్ల లోతు వరకు 3,630.12 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, అంతకు మించిన లోతులో 72.12 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంత భవిష్యత్‌కు ఢోకా లేదని సింగరేణి యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా విద్యుదుత్పత్తి, బొగ్గు ఆధారిత పరిశ్రమలకు బొగ్గు కొరత తలెత్తే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సర్వేలతో గోదావరి పరివాహక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు బడా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. సింగరేణివ్యాప్తంగా భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ విధానాల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలోని కారేపల్లి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం వీటన్నింటి ద్వారా ఏటా 53.40 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో భూగర్భ గనుల ద్వారా 15 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తే... ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా 85 శాతం బొగ్గును వెలికితీస్తున్నారు.