సర్వం సీఆర్డీఏ గుప్పెట్లోనే!
ఏపీ అసెంబ్లీలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు ...
⇒ప్రాధికార సంస్థకు ఏ స్థిర, చరాస్తులనైనా సేకరించే అధికారం
⇒ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములనూ స్వాధీనం చేసుకోవచ్చు
⇒సేకరించిన వాటిని విక్రయించొచ్చు లేదా కాంట్రాక్టుకూ ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన వేల ఎకరాల భూమిని భూసమీకరణ పథకం లేదంటే భూ సేకరణ చట్టం ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటునకు ఉద్దేశించిన బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భూ సమీకరణకు అంగీకరించని పక్షంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బిల్లులోని సెక్షన్-126 కింద స్పష్టం చేశారు. నూతన రాజధాని ప్రాంతంలో ఏ స్థిర, చరాస్తులనైనా సేకరించే అధికారాన్ని ప్రాధికార సంస్థకు బిల్లులో కట్టబెట్టారు.
స్థిర, చరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా గానీ, మార్పిడి , కానుకలుగా , లీజుగా , తాకట్టు ద్వారా . సంప్రదింపుల ద్వారా గానీ... ఇలా వివిధ రూపాల్లో ప్రాధికార సంస్థ సేకరించవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు. భూసమీకరణ పథకానికి అంగీకరించని భూ యజమానులతో ప్రాధికార సంస్థ తొలుత పరస్పర సంప్రదింపులు, అంగీకారం విధానంలో భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు కొన్ని నిబంధనలను, షరతులను విధిస్తారు. ఈ షరతులు, నిబంధనలకు భూ యజమానులు అంగీకరించిన పక్షంలో సంప్రదింపుల ద్వారా సెటిల్మెంట్ చేసుకోనున్నారు. ఈ విధానానికి కూడా అంగీకరించని పక్షంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. ప్రాధికార సంస్థకు సీఎం చైర్మన్‌గాను, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు.
బిల్లులోని ముఖ్యాంశాలు...
రాజధాని నిర్మాణంకోసం అవసరమైన ఎటువంటి భూమినైనా సమీకరించడానికి లేదా రిజర్వ్ చేయడానికైనా 2013 భూ సేకరణ చట్టం కింద ప్రాధికార సంస్థకు అధికారం కల్పించారు. ఇది సాధ్యం కాని పక్షంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా సహాయ, పునరావాసం కల్పిస్తూ తగిన పరిహారాన్ని చెల్లిస్తారు.
ప్రాధికార సంస్థ మొదట రాజధాని ప్రాంత భూమి అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేస్తుంది.
భూ సమీకరణ పథకంకోసం, టౌన్ ప్లానింగ్ పథకం కోసం, ప్రజా అవసరాల సౌకర్యాల కల్పన కోసం అవసరమైన నిధుల కోసం ప్రాధికార సంస్థ, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో ఆ ప్రాంతంలోని అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందని ఎటువంటి భూమినైనా విక్రయించవచ్చునని బిల్లులో పేర్కొన్నారు.
నిర్ధారించిన నిబంధనల మేరకు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను ప్రాధికార సంస్థ స్వాధీనం చేసుకోవచ్చును. అయితే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన పరిహారాన్ని అసైన్డ్ భూములవారికి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులనుంచి సేకరించే భూమికి నష్టపరిహారం చెల్లించకుండా వారు కోరితే మరో ప్రాంతంలో అభివృద్ధి హక్కుల బదిలీ (టీడీఆర్) చేయడానికి అభివృద్ధి హక్కు పత్రం (డీఆర్సీ) ఇవ్వవచ్చు.
ప్రాధికార సంస్థ పేరుతో స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని తన వద్దే ఉంచుకోవడం లేదా విక్రయించడం లేదా కాంట్రాక్టుకు ఇచ్చే అధికారాన్ని బిల్లులో పొందుపరిచారు. అలాగే ప్రభుత్వం సేకరించిన ఏ భూమినైనా ప్రాధికార సంస్థ బదిలీ చేస్తుంది. అలాంటి భూమిని ఎటువంటి అవసరాలకైనా సంస్థ విక్రయించవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు.
భూ సమీకరణ పథకంలో వచ్చిన మొత్తం భూమిలో 50 శాతం మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తారు. కొంత భూమిని మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వమే తమ వద్ద ఉంచుకుంటుంది. మిగిలినది రైతులకు ప్లాట్లు రూపంలో లేదా భూరూపంలో ఇస్తుంది.
భూసమీకరణ పథకం మొత్తంలో వచ్చిన భూమిలో రహదారుల నిర్మాణానికి, ప్రజా సేవల కోసం 30 శాతం భూమిని రిజర్వ్ చేస్తారు. పాఠశాలలు, చికిత్సాలయాలు, ఇతర సామాజిక సేవల కోసం ఐదుశాతం, బలహీన వర్గాల గృహ నిర్మాణాల కోసం మరో ఐదుశాతం భూమిని రిజర్వ్ చేస్తారు.
ప్రాధికార సంస్థ సొంతంగా గానీ లేదా భూమి యజమానులు దరఖాస్తు ద్వారా గానీ లేదా భూ సమీకరణ పథకంలో అభివృద్ధి చేసే ఏజెన్సీ ద్వారా గానీ భూసమీకరణ ప్రాంతాన్ని గుర్తించనున్నారు. భూసమీకరణ ప్రాంతాన్ని అధారిటీ ప్రకటించిన తరువాత పక్షం రోజుల్లోగా భూమి యజమానుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించాలి. ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలి. అనంతరం భూసమీకరణ పథకాన్ని ప్రజలకు, యజమానులకు సమాచారం ఉండే తరహాలో ప్రాధికార సంస్థ నోటిఫై చేయాలి. నిర్ధారించిన సమయంలోగా ప్రతీ భూమి యజమానికి భూ సమీకరణ యాజమాన్య ధృవపత్రాలను ప్రాధికార సంస్థ జారీ చేయాలి.
భూసమీకరణకు 62 మంది అధికారులు
రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణపై సర్కారు వేగం పెంచింది. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లుపై సోమవారం చర్చ జరగనుంది. మరోవైపు భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్)కు అధికారులను నియమించారు. తొలిదశలో 29 గ్రామాల్లో 30 వేల ఎకరాలు సేకరించాలని సర్కారు నిర్ణయించింది.సమీకరణ కోసం 62 మంది అధికారులను నియమించారు.