land occupies
-
కదిరి టీడీపీ ఇన్చార్జ్ కందికుంటకు షాక్!
సాక్షి, అనంతపురం(కదిరి) : తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ పాపం పండింది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన కబ్జాలు కోకోల్లలుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. తాను బాధితులకు అండగా నిలబడతానని బాధితులకు గట్టి భరోసా నిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితుల పక్షాన నిలిచి కందికుంట కబ్జా చేసిన 3 ఎకరాల స్థలాన్ని బాధితులకు దక్కేలా చేసి వారి మన్ననలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే...కదిరి–హిందూపురం రహదారిని ఆనుకొని వీవర్స్ కాలనీ వద్ద ముస్లింలకు చెందిన సర్వే నం.70–3లో ఉన్న 3.04 ఎకరాల స్థలాన్ని కందికుంట వెంకటప్రసాద్ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి తన సమీప బంధువుల పేరుమీద రిజిష్ట్రర్ కూడా చేయించుకున్నాడు. ఆ భూమికి సంబందించిన వ్యక్తులు 2018 జూలై 14న చదును చేయడానికి వెళితే ఆ రోజు కందికుంట తన అనుచరుల ద్వారా వారిపై దాడి చేయించాడు. తర్వాత ఆ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి ముందు వైపు పెద్ద గేట్ అమర్చి తాళం వేశాడు. బాధితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే కందికుంట కబ్జా చేసిన స్థలం ఆ పేదలకే దక్కాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి బాధితుల పక్షాన రెవెన్యూ అధికారులను సంప్రదించి కదిరి ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఆర్డీఓ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు పరిశీలించిన మీదట కందికుంటకు సమీప బంధువులైన దాసరి వెంకటేష్, చంద్రశేఖర్, ఈయన సతీమణి డి.నాగమణిల పేరుమీద చెరో 1.52 ఎకరాలు చొప్పున సర్వే నెం.70–3లో పొందిన 3.04 ఎకరాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ఆర్డీఓ రామసుబ్బయ్య తన కోర్టులో బుధవారం తీర్పును వెలువరించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా జేసీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. కందికుంటకు సహకరించిన అధికారులల్లో వణుకు కందికుంట కబ్జా చేసిన స్థలాన్ని తన సమీప బంధువుల పేరుమీద పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు అప్పట్లో ఆయనకు సహకరించిన రెవెన్యూ అధికారులు, కొందరు సిబ్బందికి ఆర్డీఓ ఇచ్చిన తీర్పు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో అప్పట్లో కాసేపు రెవెన్యూ రికార్డులను ఆన్లైన్లో తారుమారు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ యథాతథంగా మార్పు చేసిన విషయం కూడా ఇప్పటి రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపితే ఒకరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కందికుంట పలువురు తన అనుచరుల పేరుమీద పలు తేదీల్లో రిజిష్ట్రేషన్ చేయించి చివరకు మళ్లీ తన బంధువుల పేరుమీద రిజిష్ట్రర్ చేయించుకొని పలు లింక్ డాక్యుమెంట్లు సంపాదించారు. కాగా ఆర్డీఓ తీర్పుతో కందికుంట బాధితులు త్వరలోనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. -
భూ పంపిణీకి నై.. సేకరణకు సై !
– భూ బ్యాంక్ పేరుతో ప్రభుత్వ భూముల స్వాధీనం – సాగు చేసుకుంటున్న వారికి మొండిచెయ్యి – మూడేళ్లలో ఎకరా కూడా ఇవ్వని వైనం - ప్రభుత్వ తీరుపై ఆందోళనకు సిద్ధమంటున్న వామపక్షాలు అనంతపురం అర్బన్ : ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో ప్రత్యేకంగా కొన్ని పేదల పాలిట వరంగా నిలుస్తాయి. అవి వారి బతుకులకు భరోసా ఇస్తాయి. ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. అలాంటి పథకాలు కొనసాగిస్తూ ఉండాలనే అంతా కోరుకుంటారు. అటు తరువాత వచ్చే ప్రభుత్వాలు ఆ పథకాలను నిర్వీర్యం చేస్తే పేదల బతుకులు దుర్భరంగా మారతాయి. ఇలాంటి పరిస్థితే భూ పంపిణీ పథకంలో కనిపిస్తోంది. భూముల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడడమే కాకుండా పేదలు సాగు చేసుకుంటున్న భూములను సేకరణ పేరుతో బలవంతంగా తీసుకుంటోంది. ఏళ్లతరబడి ప్రభుత్వ భూములకు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలపై ప్రభుత్వం కనికరించడం లేదు. భూ బ్యాంక్ పేరుతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం చూస్తే ప్రభుత్వం ఏ ‘రూట్’లో వెళుతోందో స్పష్టమవుతోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత 2005లో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టి యజ్ఞం 2013 వరకు కొనసాగింది. ఏడు విడతల్లో 34,750 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేదలకు 79,027.17 ఎకరాల భూ పంపిణీ జరిగింది. 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో ఒక్క ఎకరా కూడా భూమిని పంపిణీ చేయలేదు సరికదా వందల ఎకరాలను సాగుదారుల నుంచి సేకరించింది. భూ బ్యాంక్ పేరిట లక్ష ఎకరాలు పేదలకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం భూ బ్యాంక్ పేరిట జిల్లాలో లక్ష ఎకరాలను సిద్ధం చేసింది. వీటిని పరిశ్రమలకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఈ తీరును ప్రతిపక్ష పార్టీలు ఎండగడుతున్నాయి. 2005 నుంచి 2013 వరకు పంపిణీ ఇలా.. కేటగిరీ లబ్ధిదారులు పంపిణీ ఎకరాల్లో ఎస్సీ 7,789 15,524.04 ఎస్టీ 4,616 10,375.46 బీసీ 16,299 37,392.63 మైనార్టీ 781 2,044.16 ఓసీ 5,265 13,690.83 మొత్తం 34,750 79,027.17 పేదల సంక్షేమం పట్టడం లేదు – రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్టడం లేదు. ఏళ్లగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలను విస్మరిస్తోంది. వీరిని విస్మరించి కార్పొరేట్ శక్తులకు భూములను ధారాదత్తం చేసేందుకు జిల్లాలో భూ బ్యాంక్ అంటూ లక్ష ఎకరాలను సిద్ధం చేశారు. దీనిపై మా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పేదల పొట్టకొట్టేందుకే.. – డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది. భూ బ్యాంక్ ద్వారా కార్పొరేట్ శక్తులకు భూమిని ధారాదత్తం చేసేందుకు సిద్ధపడింది. ఏళ్లగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తారని పేదలకు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేదలకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వంపై పోరాటం చేపట్టబోతున్నాం. -
సర్కారు భూ దందా
గిరిజనుల భూములను బలవంతంగా లాక్కున్న ప్రభుత్వం నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండానే స్వాధీనం కోర్టుకు సైతం తప్పుడు నివేదిక బాధితుల తరఫున వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సిద్దారెడ్డి న్యాయ పోరాటం గిరిజనుల భూములను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా, రూపాయి కూడా పరిహారం చెల్లించకుండానే మొత్తం 1,146 ఎకరాలను స్వాధీనం చేసుకుని.. అటవీ శాఖకు అప్పగించింది. అయితే.. తాము ఆ భూములను ఇంకా అటవీ శాఖకు అప్పగించలేదని, ఇప్పటికీ గిరిజనులే సాగు చేస్తున్నారంటూ తలుపుల మండల రెవెన్యూ అధికారులు హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా నివేదిక సమర్పించారు. వాస్తవానికి ఆ భూముల్లో అటవీ శాఖ ఇప్పటికే మొక్కలు నాటింది. తలుపుల మండలం ఈదులకుంట్లపల్లి పంచాయతీ పరిధిలోని మడుగుతండా, చంద్రానాయక్ తండాకు చెందిన వందలాది మంది గిరిజనులు కొన్నేళ్లుగా అక్కడి భూములను సాగు చేస్తుండేవారు. కొందరు వర్షాధార పంటగా వేరుశనగ, కంది వేసేవారు. మరికొందరు బోర్లు వేసుకొని ఇందిర జలప్రభ ద్వారా మామిడి, సపోట, నేరేడు వంటి పండ్లమొక్కలు కూడా పెట్టారు. చాలామంది పట్టా కూడా పొందారు. ప్రభుత్వం ప్రజావసరాల నిమిత్తం ప్రజల నుంచి భూములను తీసుకోవాలంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. నయాపైసా చెల్లించకుండానే, భూమికి బదులు భూమి ఇవ్వకుండానే బలవంతంగా లాగేసుకుంది.జిల్లాలోని లక్ష్మీపురం–భూపసముద్రం రహదారితో పాటు హంద్రీ–నీవా కాలువ నిర్మాణం వల్ల అటవీ శాఖ కొన్ని భూములను కోల్పోయింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 2422లోని మొత్తం 1,146 ఎకరాలను అప్పగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ 2011 ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..అటవీ శాఖ అధికారులు ఇటీవలే ఆ భూముల్లోకి వెళ్లి.. మొక్కలు నాటారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, పరిహారం కూడా చెల్లించకుండానే భూములను స్వాధీనం చేసుకోవడంతో గిరిజన రైతులు కంగుతిన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ గ్రామ సర్పంచ్ భర్త మధుసూదన్‌రెడ్డిని సంప్రదించగా.. ఆయన అదే పార్టీకి చెందిన ఆ మండల నేత పూల శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. ఆయన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సిద్ధారెడ్డి వెంటనే స్పందించి బాధితుల తరఫున హైకోర్టులో పిటిషన్ (నెం.25231 ఆఫ్ 2016) దాఖలు చేశారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, ఎఫ్ఆర్ఓ, కదిరి ఆర్డీఓతో పాటు తలుపుల తహశీల్దార్‌ను ప్రతివాదులుగా చేర్చారు. కోర్టునూ తప్పుదోవ పట్టించిన రెవెన్యూ అధికారులు ఆ భూములను తాము కాగితం రూపంలోనే అటవీ శాఖకు ఇచ్చామే కానీ, ఇంకా స్వాధీనం చేయలేదంటూ రెవెన్యూ అధికారులు అటవీ శాఖకు తప్పుడు నివేదిక సమర్పించారు. అయితే.. అటవీ అధికారులు ఇప్పటికే ఆ భూముల్లో వేప, తపసి, మర్రి, అల్లనేరేడు, రావి వంటి మొక్కలు నాటించారు. తమకు రెవెన్యూశాఖ అధికారులు అప్పగించడంతోనే మొక్కలు నాటుతున్నామని వారు చెబుతున్నారు. రెవెన్యూ మాయాజాలం మడుగుతండా, చంద్రానాయక్ తండా గిరిజనులు ఆయాగ్రామాల పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో భూములు చదును చేసి ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు భూ పంపిణీ సమయంలో వారు సాగు చేసుకుంటున్న చోట కాకుండా వేర్వేరు సర్వే నంబర్లు కేటాయించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూములతో మీకు సంబంధం లేదనేలా మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం నష్టపరిహారం చెల్లించకుండా గిరిజనుల భూములు లాక్కోవడం ఆర్టికల్ 14, 21 అండ్ 300ఏ ప్రకారం నేరమవుతుంది. ఇప్పటికే వారి తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశా. కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా రెవెన్యూ అధికారులు సమాధానమిచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాటం చేస్తా. –డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి, కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త