భూ పంపిణీకి నై.. సేకరణకు సై !
– భూ బ్యాంక్ పేరుతో ప్రభుత్వ భూముల స్వాధీనం
– సాగు చేసుకుంటున్న వారికి మొండిచెయ్యి
– మూడేళ్లలో ఎకరా కూడా ఇవ్వని వైనం
- ప్రభుత్వ తీరుపై ఆందోళనకు సిద్ధమంటున్న వామపక్షాలు
అనంతపురం అర్బన్ : ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో ప్రత్యేకంగా కొన్ని పేదల పాలిట వరంగా నిలుస్తాయి. అవి వారి బతుకులకు భరోసా ఇస్తాయి. ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. అలాంటి పథకాలు కొనసాగిస్తూ ఉండాలనే అంతా కోరుకుంటారు. అటు తరువాత వచ్చే ప్రభుత్వాలు ఆ పథకాలను నిర్వీర్యం చేస్తే పేదల బతుకులు దుర్భరంగా మారతాయి. ఇలాంటి పరిస్థితే భూ పంపిణీ పథకంలో కనిపిస్తోంది. భూముల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడడమే కాకుండా పేదలు సాగు చేసుకుంటున్న భూములను సేకరణ పేరుతో బలవంతంగా తీసుకుంటోంది. ఏళ్లతరబడి ప్రభుత్వ భూములకు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలపై ప్రభుత్వం కనికరించడం లేదు.
భూ బ్యాంక్ పేరుతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం చూస్తే ప్రభుత్వం ఏ ‘రూట్’లో వెళుతోందో స్పష్టమవుతోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత 2005లో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టి యజ్ఞం 2013 వరకు కొనసాగింది. ఏడు విడతల్లో 34,750 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేదలకు 79,027.17 ఎకరాల భూ పంపిణీ జరిగింది. 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో ఒక్క ఎకరా కూడా భూమిని పంపిణీ చేయలేదు సరికదా వందల ఎకరాలను సాగుదారుల నుంచి సేకరించింది.
భూ బ్యాంక్ పేరిట లక్ష ఎకరాలు
పేదలకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం భూ బ్యాంక్ పేరిట జిల్లాలో లక్ష ఎకరాలను సిద్ధం చేసింది. వీటిని పరిశ్రమలకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఈ తీరును ప్రతిపక్ష పార్టీలు ఎండగడుతున్నాయి.
2005 నుంచి 2013 వరకు పంపిణీ ఇలా..
కేటగిరీ లబ్ధిదారులు పంపిణీ ఎకరాల్లో
ఎస్సీ 7,789 15,524.04
ఎస్టీ 4,616 10,375.46
బీసీ 16,299 37,392.63
మైనార్టీ 781 2,044.16
ఓసీ 5,265 13,690.83
మొత్తం 34,750 79,027.17
పేదల సంక్షేమం పట్టడం లేదు
– రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్టడం లేదు. ఏళ్లగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలను విస్మరిస్తోంది. వీరిని విస్మరించి కార్పొరేట్ శక్తులకు భూములను ధారాదత్తం చేసేందుకు జిల్లాలో భూ బ్యాంక్ అంటూ లక్ష ఎకరాలను సిద్ధం చేశారు. దీనిపై మా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
పేదల పొట్టకొట్టేందుకే..
– డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది. భూ బ్యాంక్ ద్వారా కార్పొరేట్ శక్తులకు భూమిని ధారాదత్తం చేసేందుకు సిద్ధపడింది. ఏళ్లగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తారని పేదలకు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేదలకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వంపై పోరాటం చేపట్టబోతున్నాం.