ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్‌ రెడ్డి | IND Vs AUS Perth Test: Nitish Reddy Relishes Dream Virat Kohli Moment After Impressive Debut, Says It Was A Great Feeling | Sakshi
Sakshi News home page

ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్‌ రెడ్డి

Nov 22 2024 8:49 PM | Updated on Nov 23 2024 11:56 AM

Nitish Reddy relishes dream Virat Kohli moment after impressive debut

టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్‌, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్‌ కుమార్ రెడ్డి త‌న టెస్టు అరంగేట్రంలోనే అదర‌గొట్టాడు. శుక్ర‌వారం(నవంబ‌ర్ 22) పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టుతో డెబ్యూ చేసిన నితీశ్‌.. త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు. 

జట్టు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన నితీశ్‌ త‌న ఫైటింగ్ నాక్‌తో జ‌ట్టుకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించాడు. విరాట్ కోహ్లి, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయ‌ర్లే తడ‌బ‌డిన చోట కంగారు బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ప్యాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, నాథన్ లియాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా నితీశ్‌ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో 59 బంతులు ఆడిన నితీశ్‌.. 6 ఫోర్లు, ఒక‌ సిక్స్‌తో 41 పరుగులు చేశాడు. అత‌డితో పంత్ 37 ప‌రుగుల‌తో రాణించాడు. వీరిద్ద‌రి పోరాటం ఫ‌లితంగా భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

చాలా సంతోషంగా ఉంది
ఇక తొలి రోజు ఆట అనంత‌రం త‌న ఇన్నింగ్స్‌పై నితీశ్‌ కుమార్ రెడ్డి స్పందించాడు. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి చేతుల మీద‌గా టెస్టు క్యాప్‌ను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని నితీశ్‌ తెలిపాడు.

"భార‌త్ త‌ర‌పున టెస్టు క్రికెట్ ఆడాల‌ని ఎప్ప‌టినుంచో క‌ల‌లు కంటున్నాను. ఎట్టకేల‌కు నా క‌ల నేర‌వేరింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా విరాట్ భాయ్ నుంచి క్యాప్ అందుకోవ‌డం కూడా నాకు చాలా ప‌త్యేకం.  ఈ క్ష‌ణం నా జీవితంలో ఎప్ప‌టికి గుర్తుండిపోతుంది.

నేను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి విరాట్‌నే ఆరాధ్య దైవంగా భావిస్తున్నాను. అటువంటిది అతడి చేతుల మీదగా ఈ రోజు క్యాప్‌ను అందుకున్నాను. అరంగేట్రం చేయనున్నానని మ్యాచ్‌కు కేవలం ఒక్క రోజు ముందే నాకు తెలిసింది.

ఇదే విషయం హర్షిత్ రాణాకు కూడా మేనెజ్‌మెంట్ తెలియజేసింది. ఆ క్షణాన మా ఆనందానికి అవధులు లేవు. కానీ కొంచెం భయపడ్డాము కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదు. ఆ తర్వాత మేము ఎక్కువగా ఆలోచించకుండా డిన్నర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము.

ఆసీస్‌తో అనధికారిక టెస్ట్ సిరీస్‌లో ఏ విధంగా అయితే రాణించామో అదే పెర్త్‌లో కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాము. అయితే ఇది నాకు డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు, మంచి ఆరంభంగా మాత్రమే భావిస్తాను" అని నితీశ్‌ రెడ్డి పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: బుమ్రా అరుదైన ఫీట్‌.. ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement