ఆగస్టు ఒకటి నుంచి పెరగనున్న భూముల విలువ
తణుకు టౌన్ : జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాలలో ఆగస్టు ఒకటి నుంచి భూములు ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల ధరలను పెంచుతూ, తద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేపట్టింది. జిల్లాలో భూముల ధరల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.40 కోట్ల అదనపు ఆదాయం అంచనా వేస్తున్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ ఎం.సాయిప్రసాద్ చెప్పారు. తణుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాలలోని భూముల విలువ 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. దీనివలన రిజిస్ట్రేషన్‌లో 20 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందన్నారు. త్వరలో స్టాంప్ డ్యూటీ కూడా 1 శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. పట్టణాలలో మార్కెట్ విలువలలో ఎక్కడైనా హెచ్చుధరలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనికోసం జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. ఈ క మిటీలో సభ్య కన్వీనర్‌గా స్థానిక సబ్‌రిజిస్ట్రార్, సభ్యులుగా జెడ్పీ సీఈవో, మునిసిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని వివరించారు. ఆయన వెంట తణుకు సబ్‌రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, సజ్జాపురం సబ్‌రిజిస్ట్రార్ ఎ.వెంకటేశ్వరరావు, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ఇ.వెంకటేశ్వరరావు ఉన్నారు.