ఏపీ రాజధానిలో సర్కారు భూగుట్టు..
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణం ముసుగులో ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీ అధికారికంగా బట్టబయలైంది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల సన్నిహితుల రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారుల దాడులతో మొత్తం అవినీతి బాగోతం వెలుగు చూసింది. 6,000 ఎకరాల్లో అక్రమంగా రూ.8,000 కోట్ల విలువైన లావాదేవీలు సాగించారని మొదటి దశ దాడుల్లో ఐటీ శాఖ నిర్ధారించింది. ఆ భూముల ప్రస్తుత విలువ ఏకంగా రూ.30,000 కోట్లని అంచనా వేయడం గమనార్హం. నూతన రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై అస్మదీయులకు ముందుగానే లీకులు... బినామీ పెట్టుబడిదారులతో రియల్ ఎస్టేట్ సంస్థలు... బ్యాంకుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు... రాజధాని ప్రాంతంలో తక్కువ ధరకే భూముల కొనుగోలు... ఇదీ ప్రభుత్వ పెద్దల దోపిడీ విధానం. దీనిపై సీబీఐ, ఆర్బీఐ, ఈడీ, డీఆర్ఐలకు కూడా ఐటీ శాఖ సమచారం ఇవ్వడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు మొదలైనట్లు సమాచారం.
భూసేకరణ నుంచి వారికి మినహాయింపు
2014లో అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం నూతన రాజధానిపై దొంగాటకు తెరతీసింది. ఏలూరు, నూజివీడు, రాజమండ్రి... ఇలా పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చింది. కానీ, అప్పటికే గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో నూతన రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముందుగానే తమ బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ పెద్దలు ఉప్పందించారు. దాంతో అక్కడ తక్కువ ధరకే వేలాది ఎకరాలను కొనేశారు. అనంతరం బినామీలు, సన్నిహితుల భూములను మినహాయిస్తూ రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రక్రియ చేపట్టారు.
బినామీ పెట్టుబడిదారులు
రాజధాని ముసుగులో ప్రభుత్వ పెద్దలు చేసిన రియల్ ఎస్టేట్ దందా తీరును ఐటీ అధికారులు గుర్తించారు. 2014లో అధికారంలోకి రాగానే ముఖ్యనేత, ఆయన సన్నిహితుల అప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆ సంస్థలకు బ్యాంకుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భారీగా రుణాలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో తక్కువ ధరకు రైతుల నుంచి భారీగా భూములు కొనుగోలు చేశారు. రాజధానిగా ఆ ప్రాంతాన్ని ప్రకటించడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రాజధాని ముసుగులో ప్రభుత్వ పెద్దల అవినీతి దందాకు మచ్చు తునకగా ఐటీ అధికారులు చెబుతున్న ఓ ఉదంతం ఇలా ఉంది...
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న కీలక నాయకుడు ప్రభుత్వ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లలో జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నాడు. అందుకే అధికారంలోకి రాగానే ఆయనకు ఆ జిల్లాలో పెద్దపీట వేశారు. ఆ కీలక నేత కుటుంబం ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నెలకొల్పింది. ఆ నేత కుమారుడు, కుమార్తెలను అందులో డైరెక్టర్లుగా నియమిం చారు. అంతేకాదు కొందరు సన్నిహితులు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు. తమ పరపతిని ఉపయోగించి ఆ రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట బ్యాంకుల నుంచి రూ.224 కోట్ల రుణాలు తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు ఆ సంస్థకు రుణాలు మంజూరు చేయడం గమనార్హం.
దేశంలో కృత్రిమ రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న 19 ప్రాంతాలను రిజర్వ్‌బ్యాంక్ గుర్తించింది. వాటిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆ 19 ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు రుణాలు పెద్దగా ఇవ్వొద్దని రిజర్వ్ బ్యాంక్ కచ్చితంగా చెప్పింది. కానీ, దీనికి విరుద్ధంగా గుంటూరు జిల్లా కీలక నేత కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు బ్యాంకులు రూ.224 కోట్ల రుణాలు మంజూ రు చేయడం గమనార్హం. ఓ ప్రధాన బ్యాంకుకు చెందిన గుంటూరు శాఖ, మరో ప్రభుత్వ రంగ బ్యాం కుకు చెందిన గుంటూరు, విజయవాడ శాఖలు, వివాదాస్పద వ్యవహారాలకు పేరుగాంచిన మరో ప్రైవేటు బ్యాంకు నుంచి ఈ రుణాలు తీసుకున్నారు. అంతేకాదు ఆ కీలక నేత కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడిదారులంతా బినామీలేనని సమాచారం. ఆ సంస్థ ఇచ్చిన ఐటీ రిటర్నుల్లో ఉన్న పెట్టుబడిదారులెవరూ సంబంధిత చిరునామాల్లో లేరని ఐటీ శాఖ గుర్తిం చింది. కీలక నేత కుటుంబమే నల్లధనాన్ని బినామీ వ్యక్తుల పేరిట ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు స్పష్టమైందని ఓ అధికారి చెప్పారు.
సీబీఐ, ఈడీ, డీఆర్ఐలకు సమాచారం
ప్రభుత్వ పెద్దల సన్నిహితుల రియల్ ఎస్టేట్ సంస్థలపై జరిపిన దాడుల్లో గుర్తించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ), ఆర్బీఐలకు చేరవేసింది. నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకుల ఉన్నతాధికారులపై ఆర్బీఐ త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ ఉన్నతాధికారులను సీబీఐ అదుపులోకి తీసుకు ని విచారించనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కేసు నమోదు చేసి విచారించే అవకాశాలున్నాయని, దాంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ అధికారులు అం టున్నారు. ఇక ఈ కేసులో మనీల్యాండరింగ్, అక్రమ ఆర్థిక లావాదేవీలు తదితర నేరాలు ఇమిడి ఉన్నా యి. అందువల్ల ఈ కేసు ఈడీ, డీఆర్ఐల పరిధిలోకి కూడా వస్తుంది. అందుకే తాము ముందుగానే ఆర్బీఐ, సీబీఐతోపాటు ఈడీ, డీఆర్ఐలకు అధికారికంగా సమాచారమిచ్చామని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.
సీబీఐకి అడ్డుచక్రం అందుకేనా?
రాజధాని ముసుగులో తాము చేసిన అవినీతి బట్టబయలు కావడంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. కేంద్ర దర్యాప్తుస సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగితే తమ పుట్టి మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. అందుకే ముందస్తు చర్యగానే రాష్ట్రంలో సీబీఐ దాడులు నిర్వహించడానికి వీల్లేకుండా అనుమతిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు అక్రమాలకు సహకరించిన బ్యాంకు అధికారులపై ఢిల్లీలో కేసు నమోదు చేసి, మొత్తం ప్రభుత్వ పెద్దల అవినీతిని బహిర్గతం చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
6,000 ఎకరాలు... విలువ రూ.30,000 కోట్లు
రాజధాని ఎంపిక ప్రక్రియ ముసుగులో ప్రభుత్వ పెద్దలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఐటీ శాఖ తేల్చింది. ఇటీవల ప్రభుత్వ పెద్దల సన్నిహితులైన రియల్టర్లు, బడాబాబులపై జరిపిన దాడుల్లో ఈ వాస్తవాలను గర్తించింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సంచలనాత్మక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. 2014లో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 6,000 ఎకరాల్లో రూ.8,000 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు అధికారులు లెక్కతేల్చారు. ప్రభుత్వ ముఖ్యనేతతో సహా ఆయన బినామీలు, సన్నిహితులు కొల్లగొట్టిన ఆ 6,000 ఎకరాల ప్రస్తుత విలువ రూ.30,000 కోట్ల వరకు ఉండటం ఐటీ వర్గాలనే విస్మయ పరుస్తోంది. మొదటి దశ దాడుల్లో భారీస్థాయిలో అవినీతి బాగోతం బయటపడగా, తదుపరి దశల్లో దాడులు నిర్వహిస్తే మరిన్ని వ్యవహారాలు బహిర్గతమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 50,000 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలు భూదందాకు పాల్పడ్డారు. వాటిపైనా ఐటీ శాఖ దృష్టి సారిస్తే దేశంలోనే సంచలన అవినీతి బాగోతం వెలుగు చూడటం ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.