హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను
హైదరాబాద్ : అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని ఉండాలన్నదే తమ అభిప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లాలకు అభివృద్ధి ప్రణాళిక ప్రకటించామన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు మరోసారి చెప్పుకొచ్చారు. రాజధాని కోసం అన్ని కోణాల్లో పరిశీలించామన్నారు.
అడవుల్లో రాజధాని పెడితే ఏం ప్రయోజనం అని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని శివరామకృష్ణన్ కమిటీ అద్దం పట్టిందన్నారు. భూ సేకరణ కోసం కమిటీ వేశామన్నారు. లాండ్పూల్ సిస్టంతో ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయాలని తనకు ఉందని, తిరుపతిలో తన ఇంటి ముందే పది వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.
పేదరికంపై గెలుపు అనే కార్యక్రమం ద్వారా అభివృద్ధిని సాధిస్తామని చంద్రబాబు తెలిపారు. రైతుల ఇబ్బందుల్లో ఉన్నారనే పంట రుణాలు మాఫీ చేస్తానన్నారు. ఆడపడుచుల తాళిబొట్టు విడిపించడానికే బంగారంపై రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను ఆర్థికశాస్త్ర విద్యార్థినని రైతు రుణాలు ఎలా మాఫీ చేయాలో తనకు తెలుసునని చెప్పారు.
కాగా ఇడుపులపాయ, కడపలో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇడుపులపాయలో రాజధాని చేయాలని తాము ఎప్పుడూ కోరలేదన్నారు. చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెప్పి నిజం చేయాలని చేస్తున్నారన్నారు.