Lands regularization
-
భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రామాలు, పట్టణాలలో ఉచితంగానే భూముల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ ఆందోళ నలు నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పలు జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ తీరును నిరసించారు. గతంలో ఎల్ఆర్ ఎస్‌ను తప్పు పట్టి, ప్రజల్లో విషాన్ని నింపిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగా నే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడం సిగ్గుచేటని విమర్శించారు. నాడు అడ్డగోలు గా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు, ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మిర్యాలగూడ, మెదక్, వరంగల్, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. -
ఒక్క క్లిక్‌తో రెవెన్యూ సేవలు
♦ ఐటీతో భూ సమస్యల పరిష్కారం ♦ సీసీఎల్ఏగా బాధ్యతలు స్వీకరించిన రేమండ్ పీటర్ సాక్షి, హైదరాబాద్: ‘అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా.. సొంతూళ్లోని తమ భూములతో ప్రతి ఒక్కరికీ ఎంతో అనుబంధం ఉంటుంది. కంప్యూటర్లో ఒక్క క్లిక్ చేస్తే తమ భూముల సమాచారం తెలుస్తుందంటే ఎవరైనా సంతోషిస్తారు. రెవెన్యూ సేవ లన్నింటినీ ఐటీతో అనుసంధానం చేసి, వాటిని ప్రజలకు మరింత చేరువ చేస్త్తా’ అని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ అన్నారు. నూతన సీసీఎల్ఏగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తన ప్రాధామ్యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. భూములకు సంబంధించిన (కబ్జాలు, ఆక్రమణలు లాంటివి) సమస్యలు బాగా పెరిగాయని, రెవెన్యూ ప్రక్రియలకు సాంకేతిక తను జోడించడం ద్వారా వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు వీలవుతుందని చెప్పారు. క్రమబద్ధీకరణ వేగవంతం రెవెన్యూ శాఖలో ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులన్నింటినీ కొనసాగిస్తానని రేమండ్ పీటర్ చెప్పారు. రాష్ట్రంలో పంట భూములు, రైతులకు సంబంధించిన వివరాల నమోదుకోసం చేపట్టిన ఈ-పహాణీ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలయ్యే చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల క్రమబద్ధీకరణ, పేదలకు భూపంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేస్తానని తెలిపారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన భూములను సమకూర్చడంలోనూ క్రియశీలకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రాధమ్యాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు.ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నూతన సీసీఎల్ఏ రేమండ్ పీటర్‌కు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. -
తుది దశకు క్రమబద్ధీకరణ
♦ చెల్లింపు కేటగిరీలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి ♦ మిగతా సొమ్ము చెల్లించాలని ఫైనల్ డిమాండ్ నోటీసులు జారీ ♦ డిసెంబర్‌కల్లా వసూళ్లు పూర్తిచేయాలని కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం ♦ సంక్రాంతికల్లా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తుదిదశకు చేరింది. చెల్లింపు కేటగిరీలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక అన్ని జిల్లాల్లోనూ పూర్తయింది. దీంతో దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్ము పోను, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ లబ్దిదారులకు ఆటో జెనరేటెడ్ డిమాండ్ నోటీసులను రెవెన్యూ శాఖ జారీచేసింది. డిసెంబర్ 31కల్లా ఈ వసూళ్లు పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్) తాజాగా ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారు నిర్ధేశిత ధర చెల్లిస్తే సదరు భూమిని క్రమబద్ధీకరించేందుకు గాను గత డిసెంబరులో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి విదితమే. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 23,516దరఖాస్తులు అందగా, జీవో 58 కింద ఉచిత కేటగిరీలో వచ్చిన దరఖాస్తుల్లో 21,493 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీ కింద ఉన్న దరఖాస్తుల సంఖ్య 45,009కు చేరింది. త్వరలో భూమి హక్కుల బదలాయింపు భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారికి నిర్దేశిత ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ఐదు సులభ వాయిదాల సదుపాయాన్ని కూడా కల్పించింది. సెప్టెంబర్ 30తో రెండోవాయిదా చెల్లింపు గడువు ముగియగా, కొందరు మూడో వాయిదా సొమ్మును, మరికొందరు ఒకేసారి మొత్తం సొమ్మును కూడా చెల్లించారు. దరఖాస్తులు వివిధ వాయిదాల కింద ఇప్పటివరకు మొత్తం రూ.141.35 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. ఒకేసారి సొమ్ము చెల్లించిన 409మంది లబ్ధిదారులకు ఈ నెలఖారుకల్లా భూమి హక్కులను బదలాయిస్తామని, ఇందుకోసం రూపొం దించిన కన్వీనియన్స్ డీడ్ నమూనా ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల చెబుతున్నారు. ఇప్పటికే న్యాయ విభాగం నుంచి క్లియరెన్స్ లభించినందున కన్వీనియన్స్ డీడ్ నమూనాకు ప్రభుత్వ ఆమోదం ఇక లాంఛనమేనంటున్నారు. వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న లబ్ధిదారుల నుంచి డిసెంబరులోగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కల్లా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. చెల్లింపు క్రమబద్ధీకరణ తీరు వచ్చిన దరఖాస్తులు 23,516 మార్పిడి దరఖాస్తులు 21,493 మొత్తం దరఖాస్తులు 45,009 మొదటి వాయిదాలో వచ్చిన సొమ్ము రూ.129.30 కోట్లు రెండో వాయిదాలో అందిన సొమ్ము రూ.9.42 కోట్లు మూడో వాయిదా సొమ్ము రూ.91.90 లక్షలు ఒకేసారి చెల్లించిన సొమ్ము రూ.1.70 కోట్లు సర్కారుకు అందిన మొత్తం సొమ్ము రూ.141.35 కోట్లు