ఆనందంగా అమెరికాకు బయలుదేరి.. అంతలోనే విషాదం
హైదరాబాద్: ‘అందరూ సంతోషంగా ఉండండి... జూలైలో తిరిగివస్తా.. అందరికీ బాయ్’ అని చెప్పి కుమారుడితో కలిసి సంతోషంగా బయలుదేరిన ఓ వృద్ధురాలు.. అమెరికా (America) ప్రయాణంలో మార్గమధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే... లంగర్‌హౌస్ బాపునగర్‌లో నివాసముండే కాయిశెట్టి లక్ష్మీబాయి(70)కి నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడవ కుమారుడు శ్రీధర్ అమెరికాలోని షార్లెట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కుంభమేళాలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన ఆయన తిరిగి అమెరికా వెళ్లేందుకు తల్లితో కలిసి ఈ నెల 24న బయలుదేరాడు.శంషాబాద్ (Shamshabad) నుంచి విమానాలు మారుతూ షార్లెట్‌కు వెళ్తున్న క్రమంలో మియామీ ఎయిర్‌పోర్టులో ఈ నెల 25న లక్ష్మీబాయికి తీవ్రమైన గుండెపోటు వచ్చి కుప్పకూలింది. వెంటనే అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ వార్త విని నగరంలోని ఆమె సోదరి ముత్యాల ప్రమీల, కుమారుడు శ్రీనివాస్, ఇతర కుటుంబీకులు శోకసముద్రంలో మునిగారు. మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని తానా (TANA) నిర్వాహకులు వీరికి సహకరించి మృతదేహాన్ని మన దేశానికి పంపించే ప్రయత్నాలు పూర్తి చేశారు. సోమవారం రాత్రి లంగర్‌హౌస్‌కు మృతదేహం చేరనుండగా సంగం శ్మశానవాటికలో మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూతపడిన ట్రాన్స్‘మిత్ర్’ క్లినిక్ ట్రాన్స్జెండర్లకు ఉచిత వైద్యసేవలను అందజేసిన మిత్ర్ క్లినిక్ మూతపడింది. అమెరికా నుంచి వచ్చే ఆర్థిక సహాయం నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లో అన్ని రకాల వైద్యసేవలను నిలిపివేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 2000 మందికి పైగా ట్రాన్స్జెండర్లకు అవసరమైన వైద్యపరీక్షలు, చికిత్సలను అందజేసేందుకు యూఎస్ ఎయిడ్‌తో 2021లో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ.24 లక్షల ఆర్థిక సహాయం లభించేది.చదవండి: అన్నీ తెలుసుకోవడమే సరైన ‘పని’..అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన వెంటనే యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తూ ‘యాంటీ ట్రాన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్’పైన సంతకం చేయడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మిత్ర్ క్లినిక్‌లను ఆర్థిక సాయం నిలిచిపోయిందని ట్రాన్స్ ఆరోగ్య నిపుణులు రచన ముద్రబోయిన తెలిపారు. ‘ఒక్క కలం పోటుతో మాకు లభించే ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. తీవ్ర షాక్‌కు గురయ్యాం. నాలుగేళ్ల వార్షిక వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే మిత్ర్ మూతపడింది.’ అని రచన విచారం వ్యక్తం చేశారు. పీఈటీ టీచర్ అరెస్టు ఉప్పల్: హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. ఉప్పల్ సాగర్ గ్రామర్ స్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థి ముంగా సంగారెడ్డి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన పీఈటీ టీచర్ ఎడమ ఆంజనేయులను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో ఇంకా సాగర్ గ్రామర్ స్కూల్ యాజమాని ధన్సాగర్, క్లాస్ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది.