ఎక్కడికైనా నాలుగు గంటల్లోనే...
భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యానికి చేర్చేసే ‘ల్యాప్క్యాట్ ఏ2’ అనే అంతరిక్ష విమానమిది. బ్రిటన్ కంపెనీ ‘రియాక్షన్ ఇంజన్స్’ సాయంతో ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) దీనిని అభివృద్ధిపరుస్తోంది. ‘సబేర్’ అనే రాకెట్ ఇంజన్‌తో నడిచే ఈ విమానం ధ్వని కంటే ఏకంగా ఐదు రెట్లు అంటే.. గంటకు 5,632 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందట. ఒకేసారి 300 మంది ప్రయాణికులతో 15 నిమిషాల్లోనే ఇది అంతరిక్షానికి చేరుకుంటుంది.
గమ్యస్థానం చేరువయ్యాక తిరిగి వాతావరణంలోకి ప్రవేశించి భూమి మీదికి దిగిపోతుంది. ఈ విమానం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విమానాలు నడిపేందుకు అయ్యే ఖర్చులో 95% వరకూ ఆదా అవుతుందట. 2019లో దీనిని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సబేర్ ఇంజన్‌తో రూపొందిస్తున్న ‘స్కైలాన్’ అనే అంతరిక్ష విమానాన్ని కూడా ఈసా అభివృద్ధిపరుస్తోంది. ఆ విమానం ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లి నేరుగా కక్ష్యలో వదిలిపెట్టి వస్తుందట!