చట్టసభలో మాతృమూర్తి!
ఆస్ట్రేలియాలోని గ్రీన్స్‌కు చెందిన సెనెటర్ లారిస్సా వాటర్స్.. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్ సమావేశాలకు కన్నకూతురితోపాటు హాజరయ్యారు. ఓవైపు సమావేశాలు జరుగుతుండగానే.. బిడ్డకు పాలిచ్చి, తల్లి స్థానాన్ని ఉన్నత శిఖరాలపై నిలిపారు. వివరాల్లోకెళ్తే...
‘నాకెంతో గర్వంగా ఉంది. నా కూతురు అలియా.. దేశ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్లో తల్లిపాలు తాగిన తొలి శిశువుగా నిలిచింది. పార్లమెంట్‌కు మరింతమంది మహిళా నేతలు రావడానికి ఇటువంటి చర్యలు ఎంతగానో తోడ్పడతాయి’ ... అంటూ ఆస్ట్రేలియాలోని గ్రీన్స్‌కు చెందిన సెనెటర్ లారిస్సా వాటర్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరు కావడం తప్పనిసరి కావడంతో కన్నకూతురితోపాటు హాజరైన లారిస్సా.. ఓవైపు సమావేశాలు జరుగుతుండగానే బిడ్డకు పాలిచ్చి, కడుపునింపారు.
నిబంధనల సడలింపు..
గత ఏడాదివరకు పార్లమెంట్ భవనంలోకి శిశువుల ప్రవేశంపై నిషేధం అమలులో ఉంది. గత ఏడాదే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ.. ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్‌ను ఫ్యామిలీ ఫ్రెండ్లీ పార్లమెంట్‌గా మారుస్తున్నట్లు తీర్మానించారు. దీనివల్ల మరింతమంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని ఆశించారు. నిబంధనలు సడలించిన తర్వాత తొలిసారిగా బిడ్డతోపాటు పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన మహిళ లారెస్సానే. ఈ విషయమై లారెస్సా మాట్లాడుతూ..
మార్పు రావాలి...
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తల్లులు పాలివ్వడమనే దానిని ఇప్పటికీ ‘లైంగికత్వం’తోనే ముడిపెడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తల్లులు పాలివ్వడం గురించి చాలా దేశాల్లో వింతగా మాట్లాడుకుంటున్నారు. మహిళా నేతలు కూడా ఇదేదో తప్పు పనిగా భావిస్తూ విమర్శకు దిగుతున్నారు. యూరోపియన్ దేశాలు ఈ విషయంలో మనకంటే ఎంతో ఉత్తమమైన ఆలోచనాతీరుతో ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ దిశగా ఆలోచించాలి. అప్పుడే అన్నిచోట్లా మహిళలు స్వేచ్ఛగా పనులు చేసుకుంటారు.
2003లో క్రిస్టీకి చేదు అనుభవం..
విక్టోరియన్ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన క్రిస్టీ మార్షల్... 11 రోజులు కూడా నిండని పసికందుతో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చింది. అయితే బిడ్డకు పాలివ్వాల్సి ఉంటుందనే కారణంతో ఆమెను సమావేశాలకు హాజరు కానివ్వలేదు. ఆ తర్వాత దీనిపై ఎంతో చర్చజరిగింది. చివరకు గత ఏడాది ఆస్ట్రేలియా పార్లమెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ పార్లమెంట్‌గా అవతరించింది.
–సాక్షి, స్కూల్ ఎడిషన్