Larry collided
-
లారీ ఢీకొని పాదచారి దుర్మరణం
మదనపల్లె క్రైం: రోడ్డు పక్కన నడచి వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె పట్టణం కదిరి రోడు్డలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం పి అండ్ టి (పోస్టల్, టెలికం) కాలనీలో నివాసముంటున్న శివనారాయణ(47) ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సత్యవతి, కుమారులు భానుప్రకాష్, హరిప్రకాష్ ఉన్నారు. నీరుగట్టువారిపల్లె సమీపంలోని ఓ ఇటుక బట్టీకి గురువారం అర్ధరాత్రి వరకు ట్యాంకర్‌తో నీరు తోలాడు. పని ముగించుకుని శుక్రవారం వేకువజామున నడచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. కదిరి రోడ్డు మసీదు కాంప్లెక్స్ సమీపంలో వెళుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న శివనారాయణను గమనించిన స్థానికులు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో తిరుపతికి తరలిస్తుండగా భాకరాపేట వద్ద శివనరాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శివనారాయణ మృతి చెందడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్యా, పిల్లలు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెటా్టరు. -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
పుంగనూరు : ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉన్న వేళ పుంగనూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు కలిగిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కోర్టు రూటులో వెళుతుండగా పాల కంటైనర్ అతివేగంగా వచ్చి ఢీకొంది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎస్ఐ హరిప్రసాద్ అక్కడికి చేరుకుని క్షతగాత్రుడినిస్థానిక ఫ్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలు తెలియరాలేదు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం
తాడిపత్రి రూరల్: తాడిపత్రి-అనంతపురం మార్గంలోని పట్టణ సరిహద్దులో గల రైల్వే గేటు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం కందుగోపుల గ్రామానికి చెందిన నాగేంద్ర(21) మరణించాడని పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎర్రనాగప్ప, సాయమ్మ దంపతుల మూడో కుమారుడైన నాగేంద్ర తాడిపత్రి మండలం సజ్జలదిన్నె నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తాడిపత్రిలోని రైల్వే గేటు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకోనడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. బైక్ కూడా లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జు అయింది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నాగేంద్ర సోదరులిద్దరి వివాహం 20 రోజుల కిందటే కాగా, కుటుంబ సభ్యులందరూ ఇంకా పెళ్లి ముచ్చట్లలోనే ఉన్నారు. అంతలోనే ప్రమాదంలో మూడో కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో తోటికోడళ్లు మృతి
నక్కపల్లి: మండలంలో చీడిక గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తోడికోడళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పెళ్లి తర్వాత సారె భోజనాలకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతవరకూ పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేగటి లక్ష్మి అనే యువతికి వారం రోజుల క్రితం వివాహమైంది. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు లక్ష్మి అత్తవారి గ్రామమైన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వెళ్లారు. సారె భోజనాల అనంతరం అర్ధరాత్రి ఆటోలో బయలు దేరారు. మంగళవారం తెల్లవారుజామున ఆటో తుని సమీపంలో జగన్నాదగిరి వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో చీడిపల్లి రమణమ్మ(35), చీడిపల్లి సింహాచలం(40) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు లక్ష్మి, అప్పలనర్సలకు తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో తుని ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చనిపోయిన వారిద్దరూ తోటికోడళ్లు, పెళ్లికుమార్తె లక్ష్మికి మేనత్తలవుతారు. రమణమ్మకు ఇద్దరు, సింహాచలానికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరూ రోజువారీ కూలిపనులకు వెళ్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. -
ఉద్యోగులను కబళించిన లారీ
కర్నూలు జిల్లాలో ఐదుగురు దుర్మరణం మృతుల్లో నలుగురు రెవెన్యూ సిబ్బంది కర్నూలు: విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన కర్నూలు జిల్లాలోని 18వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ), ముగ్గురు గ్రామసేవకులున్నారు. తీవ్రంగా గాయపడిన ఓర్వకల్లు తహశీల్దార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలనకు కర్నూలు జిల్లా కలెక్టర్ వస్తుండటంతో ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్ఐ శ్రీనివాసులుతోపాటు గ్రామసేవకులు, ఇతర ఉద్యోగులు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నన్నూరు సమీపంలోని గడెంతిప్ప వద్ద ప్రధాన రహదారిపై వేచి ఉన్నారు. అదే సమయంలో సిలికా(కృత్రిమ ఇసుక) లోడుతో నంద్యాల వైపు నుంచి కర్నూలుకు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ వీరిపైనుంచి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆర్ఐ శ్రీనివాసులు, గ్రామసేవకులు శివరాముడు(36), రామకృష్ణ(45), వెంకటేశ్వర్లు(43)తోపాటు స్థానికుడు గోపాల్(28) దుర్మరణం పాలయ్యారు. ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, వీఆర్వో తిమ్మయ్య, గ్రామసేవకుడు నాయుడుకు తీవ్ర గాయాలవగా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తహశీల్దార్ సునీతాబాయి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఇసుక మాఫియానే కారణం! సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల మృతికి ఇసుక మాఫియానే కారణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అనుమానం వెలిబుచ్చింది. ఈ ప్రమాదంపై తమకు అనుమానాలున్నాయని తెలిపింది. ఉద్యోగులను హత్య చేయించడానికి జరిగిన కుట్రగా ఉందని సందేహం వ్యక్తం చేసింది. -
‘ట్రావెల్స్’ బస్సు, లారీ ఢీ
ఈతకోట(రావులపాలెం), న్యూస్‌లైన్ :జాతీయ రహదారిపై మండలంలోని ఈతకోట సెంటర్ సమీపంలో శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లోడ్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ఉన్న ముగ్గురితో పాటు లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.విజయవాడలోని రామలింగేశ్వర నగర్‌కు చెందిన పోతన శ్రీనివాసరావు(48) డ్రైవర్ అండ్ ఓనర్‌గా ఏసయ్య లారీ సర్వీసును నడుపుతున్నాడు. విజయవాడకు చెందిన క్లీనర్ నాగిరి ఏసుతో కలిసి ఈతకోటలోని ఓ రైస్ మిల్లుకు లోడ్‌తో వచ్చాడు. సరుకును అక్కడ దించి వేసి, అనంతరం తిరిగివెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ దాటేందుకు శ్రీనివాసరావు రాంగ్ రూట్లో ఈతకోట సెంటర్‌కు రావులపాలెం వైపు వస్తున్నాడు. ఇదే రూట్లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చింది. ఈతకోట సెంటర్ సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న లారీని గమనించని బస్సు డ్రైవర్.. వేగంగా లారీని ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో లారీలో ఇద్దరు, బస్సులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. బస్సులో అంతగా ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లారీని బస్సు వేగంగా ఢీకొనడంతో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న శ్రీనివాసరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. లారీ క్లీనర్ ఏసుకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్.. ముందు అద్దం పగులగొట్టుకుంటూ రోడ్డుపై పడ్డారు. సమాచారం అందుకున్న 108, హైవే అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగ్రాతులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించాయి. రావులపాలెం ఎస్సై ఆర్.గోవిందరాజు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో వాహనాలను తొలగించారు. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకుతీసి, పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఉన్నారు. రాజోలుకు చెందిన డ్రైవర్ చెల్లుబోయిన శ్రీను బస్సును నడుపుతున్నాడు. ఇతడికి ప్రమాదంలో చెయ్యి, తలకు గాయాలయ్యాయి. మురమళ్లకు చెందిన మరో డ్రైవర్ పి.శ్రీనివాస్(సత్తిబాబు) వెనుక సీటులో నిద్రిస్తున్నాడు. అతడికి కూడా తలు, చెయ్యికి గాయలయ్యాయి, అదే గ్రామానికి చెందిన క్లీనర్ వి.ప్రసాద్ కాలికి గాయమైంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, తొందరపాటుతో లారీ డ్రైవర్ రాంగ్‌రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.