‘ట్రావెల్స్’ బస్సు, లారీ ఢీ
Published Sun, Jan 12 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
ఈతకోట(రావులపాలెం), న్యూస్‌లైన్ :జాతీయ రహదారిపై మండలంలోని ఈతకోట సెంటర్ సమీపంలో శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లోడ్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ఉన్న ముగ్గురితో పాటు లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.విజయవాడలోని రామలింగేశ్వర నగర్‌కు చెందిన పోతన శ్రీనివాసరావు(48) డ్రైవర్ అండ్ ఓనర్‌గా ఏసయ్య లారీ సర్వీసును నడుపుతున్నాడు. విజయవాడకు చెందిన క్లీనర్ నాగిరి ఏసుతో కలిసి ఈతకోటలోని ఓ రైస్ మిల్లుకు లోడ్‌తో వచ్చాడు. సరుకును అక్కడ దించి వేసి, అనంతరం తిరిగివెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ దాటేందుకు శ్రీనివాసరావు రాంగ్ రూట్‌లో ఈతకోట సెంటర్‌కు రావులపాలెం వైపు వస్తున్నాడు.
ఇదే రూట్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చింది. ఈతకోట సెంటర్ సమీపంలో రాంగ్ రూట్‌లో వస్తున్న లారీని గమనించని బస్సు డ్రైవర్.. వేగంగా లారీని ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో లారీలో ఇద్దరు, బస్సులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. బస్సులో అంతగా ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లారీని బస్సు వేగంగా ఢీకొనడంతో లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న శ్రీనివాసరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. లారీ క్లీనర్ ఏసుకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్.. ముందు అద్దం పగులగొట్టుకుంటూ రోడ్డుపై పడ్డారు. సమాచారం అందుకున్న 108, హైవే అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగ్రాతులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించాయి. రావులపాలెం ఎస్సై ఆర్.గోవిందరాజు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.
క్రేన్ సాయంతో వాహనాలను తొలగించారు. లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకుతీసి, పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఉన్నారు. రాజోలుకు చెందిన డ్రైవర్ చెల్లుబోయిన శ్రీను బస్సును నడుపుతున్నాడు. ఇతడికి ప్రమాదంలో చెయ్యి, తలకు గాయాలయ్యాయి. మురమళ్లకు చెందిన మరో డ్రైవర్ పి.శ్రీనివాస్(సత్తిబాబు) వెనుక సీటులో నిద్రిస్తున్నాడు. అతడికి కూడా తలు, చెయ్యికి గాయలయ్యాయి, అదే గ్రామానికి చెందిన క్లీనర్ వి.ప్రసాద్ కాలికి గాయమైంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, తొందరపాటుతో లారీ డ్రైవర్ రాంగ్‌రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
Advertisement
Advertisement