రోడ్డు ప్రమాదంలో తోటికోడళ్లు మృతి
నక్కపల్లి: మండలంలో చీడిక గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తోడికోడళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పెళ్లి తర్వాత సారె భోజనాలకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతవరకూ పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేగటి లక్ష్మి అనే యువతికి వారం రోజుల క్రితం వివాహమైంది.
సోమవారం ఆమె కుటుంబ సభ్యులు లక్ష్మి అత్తవారి గ్రామమైన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వెళ్లారు. సారె భోజనాల అనంతరం అర్ధరాత్రి ఆటోలో బయలు దేరారు. మంగళవారం తెల్లవారుజామున ఆటో తుని సమీపంలో జగన్నాదగిరి వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో చీడిపల్లి రమణమ్మ(35), చీడిపల్లి సింహాచలం(40) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు లక్ష్మి, అప్పలనర్సలకు తీవ్రగాయాలయ్యాయి.
వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో తుని ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చనిపోయిన వారిద్దరూ తోటికోడళ్లు, పెళ్లికుమార్తె లక్ష్మికి మేనత్తలవుతారు. రమణమ్మకు ఇద్దరు, సింహాచలానికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరూ రోజువారీ కూలిపనులకు వెళ్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.