60 అడుగుల బావిలోకి లారీ బోల్తా
వేలూరు, న్యూస్‌లైన్: తిరుపత్తూరు సమీపంలో 60 అడుగులు లోతున్న బావిలోకి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి బెంగళూరుకు 32 టన్నుల ఇనుప కమ్మీలతో లారీ బయలుదేరింది. లారీని బన్రొట్టికి చెందిన రాజేంద్రన్(49) నడుపుతున్నాడు. అదే లారీలో క్లీనర్‌గా అతని కుమారుడు జగన్(19), బన్‌రొట్టి జిల్లా కొంజికుప్పం గ్రామానికి చెందిన ఆర్ముగం ఉన్నారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో లారీ తిరుపత్తూరు సమీపంలోని కాళియమ్మాల్ గుడి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెటు ్టను ఢీకొని పక్కనే ఉన్న 60 అడుగుల లోతు బావిలో పడింది.
లారీ అతి వేగంగా ఢీకొనడంతో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి తిరుపత్తూరు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి వెంకటేశన్ అధ్వర్యంలో సిబ్బంది, పోలీసులు బావి వద్దకు చేరుకొని పరిశీలించారు. బావిలో 15 అడుగుల నీరు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే బావిలోని లారీలో చిక్కుకున్న వారు కేకలు వేయడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి దిగి రాజేంద్రన్, ఆర్ముగం, జగన్‌ను బయటకు తీశారు.
అప్పటికే జగన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ రాజేంద్రన్, ఆర్ముగంను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావిలో ఉన్న ఇనుప కమ్మీలను క్రేన్ల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో గ్రామస్తుల సాయంతో మూడు క్రేన్లను రప్పించి లారీతో పాటు ఇనుప కమ్మీలను కూడా బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది సకల ప్రయత్నాలు చేస్తున్నారు.