Larsen & Toubro Infotech
-
ఎల్టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
ఫ్రెషర్లకు ఎల్టీఐలో 4,500 కొలువులు
ముంబై: లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) ఈ ఏడాది సుమారు 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను అధిగమించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్టీఐ గతేడాది 3,000 మందిని రిక్రూట్ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 18.3%గా ఉన్న అట్రిషన్ రేటు హైరింగ్ పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.2%కి తగ్గింది. అయితే, సీక్వెన్షియల్‌గా మార్చి త్రైమాసికంలో నమోదైన 12.3%తో పోలిస్తే మాత్రం పెరిగింది. కంపెనీ సీఈవో సంజయ్ జలోనా ఈ విషయాలు తెలిపారు. ఐటీ రంగంలో మార్కెట్ దిగ్గజం టీసీఎస్‌లో అట్రిషన్ రేటు క్యూ1లో అత్యల్పంగా 8.6%గా (మార్చి క్వార్టర్లో 7.2 %) నమోదైంది. అటు ఇన్ఫోసిస్‌లో 13.9% (మార్చిలో 10.9%), విప్రోలో 15.5% (మార్చి త్రైమాసికంలో 12%)గా అట్రిషన్ రేటు ఉంది. జూన్ త్రైమాసికంలో కాగ్నిజెంట్‌లో అత్యధికంగా 31 శాతంగా నమోదైంది. -
ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు నిర్మాణ రంగ దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ ముందుకు వచ్చింది. ప్రతీ ఉద్యోగికి అదనంగా రూ.35 లక్షల కరోనా బీమా కవరేజీని ప్రకటించింది. అంటువ్యాధుల కవరేజీ ప్లాన్ కింద రూ.35 లక్షల బీమాను 12 నెలల కాలానికి అందించనున్నట్టు తెలిపింది. ఈ పాలసీ కింద కరోనా కారణంగా మరణించిన ఉద్యోగికి రూ.35 లక్షల పరిహారం లభించనుంది. ఇప్పటికే ప్రతీ ఉద్యోగికి అందిస్తున్న రూ.50-60 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఇది అదనం. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.2-12 లక్షల మధ్య ఆప్షనల్ టాపప్ మెడికల్ హాస్పిటలైజేషన్ కవరేజీని 365 రోజులకు అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.6.25 లక్షల వరకూ మెడికల్ కవరేజీ కూడా ఉంటుందని ఎల్అండ్టీ తెలిపింది. మరణించిన ఉద్యోగి పిల్లల చదువులకు కూడా సాయాన్ని ప్రకటించింది. 3 నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల విద్యకు అయ్యే వ్యయాలను సంస్థే భరించనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి వృత్తి శిక్షణ, విద్య అందించి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపింది. ‘‘ఎన్నో సవాళ్లతో కూడుకున్న కాలం ఇది. కరోనా రెండో దశ గట్టిగానే తాకింది. కరోనా కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో వెనుకాడేది లేదు. మా ఉద్యోగులకు సాయంగా ఉండేందుకు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు ఇవి’’ అని ఎల్అండ్టీ ఎండీ, సీఈవో ఎస్ఎన్ సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్త! -
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ స్టాక్‌మార్కెట్ ఎంట్రీ
ముంబై: రికార్డుస్థాయిలో సబ్‌స్క్రైబ్ అయిన లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ నేటి (జూలై 21 గురువారం) నుంచి స్టాక్ మార్కెట్ లో తెరంగేట్రం చేయనుంది. ఈ కంపెనీ షేర్లు ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ ఎన్ఎస్ఇ , బిఎస్ఇ లో లిస్ట్ కానుంది. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఛైర్మన్ ఎఎం నాయక్ , ఇతర ఉన్నతాధికారులతోపాటు మర్చంట్ బ్యాంకర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 887 మిలియన్ డాలర్ల ఆదాయంతో 20 వేల మంది ఉద్యోగులతో ఐటీ సేవల్లో ఆరవ అతి పెద్ద సంస్థగా ఉంది ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ . తాజా ఐపీవో లో భారీ స్థాయిలో మిలియన్ అప్లికేషన్లు సాధించిందనీ, 2011 నుండి ఇప్పటివరకు ఒక షేర్ ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్లు ఆకర్షించడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత బుధవారంతో ముగిసిన ఐపీఓ లో 12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేరు ధరను రూ.705-710గా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఐటీ అనుబంధ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎనర్జీ పరిశ్రమలకు ఐటీ సొల్యూషన్లనందిస్తున్నది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, అబర్న్... యాంకర్ ఇన్వెస్టర్లలో కొన్ని సంస్థలు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
ముగిసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ఇష్యూ ముంబై: లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారంతో ముగిసిన ఈ ఐపీఓకు ధర శ్రేణిని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ రూ.705-710గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,243 కోట్ల నిధులు సమకూరుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఐటీ అనుబంధ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎనర్జీ పరిశ్రమలకు ఐటీసొల్యూషన్లనందిస్తోంది. ఈ కంపెనీ ఇటీవలనే రూ.710 ధరకు రూ.373కోట్ల విలువైన షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, అబర్న్... యాంకర్ ఇన్వెస్టర్లలో కొన్ని సంస్థలు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరించాయి.