దోచుకునేందుకే పుష్కర పనులు
ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, కాంట్రాక్టర్లు దోచుకునేందుకే కృష్ణా పుష్కర పనులు హడావుడిగా చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పట్టణంలోని సీతానగరం ఘాట్‌ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత కొరవడి నాసిరకంగా వున్నాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పుష్కర పనులు చూస్తుంటే గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన దురదృష్ట ఘటన పునరావృతమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్లపై కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టర్లకు.. తమ్ముళ్లకు అప్పగించిన ప్రభుత్వం వాటిని పర్యేక్షించకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు నివాసంపై నుంచి చూస్తే సీతానగరం పుష్కరఘాట్ కనిపిస్తుందని, కనీసం ఇంటి ముంగిట జరుగుతున్న పనులను పరిశీలించే తీరిక సీఎం చంద్రబాబుకు లేదని విమర్శించారు.