డబ్బులు అడిగాడని హత్య
ఏకలవ్యకాలనీలో పడేసిన దుండగులు
మృతుడు ఇప్పకుంట వాసి
మహబూబ్‌నగర్ క్రైం : ఇచ్చిన డబ్బులు మళ్లీ అడుగుతున్నాడని పథకం ప్రకారం ఓ వ్యక్తిని దుండగులు వేరేచోట హత్య చేసి మరో ప్రదేశంలో పడేశారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏకలవ్యకాలనీ సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈయనను బల్మూర్ మండలం ఇప్పకుంటకు చెందిన గోపాల్‌రెడ్డి (40) గా గుర్తించారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటూ ఓ చిన్న కేబుల్ కంపెనీ నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. వీరిలో ఒకరు గుప్తనిధులు తవ్వడంలో సిద్ధహస్తుడు.
ఒకచోట వజ్రాలు ఉన్నాయని వాటిని బయటకు తీసిన తర్వాత ఇస్తామని గోపాల్‌రెడ్డిని నమ్మించి రూ.ఐదు లక్షలతోపాటు బుల్లెట్ వాహనం తీసుకున్నారు. చాలా రోజులు కావడంతో డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఎలాగైనా తుదముట్టించాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీ ఉదయం డబ్బులు ఇస్తామని అతడిని కారులో హైదరాబాద్ నుంచి అచ్చంపేట వైపు తీసుకెళ్లారు. అనంతరం శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గంలో హత్య చేసి మృతదే హాన్ని తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని ఏకలవ్యకాలనీ రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.