lavish
-
ఏడువేల కోట్ల ఖర్చుతో ఖరీదైన పెళ్ళి..!
మాస్కోః ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీటవేసి అంటూ అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళను వర్ణిస్తారు. అదే కోవకు చెందేట్టుగా ఉంది ఓ రష్యన్ బిలియనీర్ కుమారుడి వివాహ వైభోగం. జెన్నీఫర్ లోపేజ్ అద్భుత ప్రదర్శనతోపాటు... సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే వధువు వెడ్డింగ్ డ్రెస్ ఆ సంపన్న వివాహ కార్యక్రమంలో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. రష్యన్ చమురు దిగ్గజం మిఖాయిల్ గుట్సరీవ్ తన 28 ఏళ్ళ కుమారుడు సెయిడ్ పెళ్ళి విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా 6,800 కోట్ల రూపాయల ఖర్చుతో లావిష్ గా పెళ్ళి జరిపించాడు. 20 ఏళ్ళ మెడికల్ విద్యార్థిని ఖదీజా ఉదకోవ్, సెయిడ్ లు నాలుగేళ్ళ సహజీవనం తర్వాత సంప్రదాయ బద్ధంగా మాస్కోలో జరిగిన వివాహంతో దంపతులయ్యారు. సువాసనలు వెదజల్లే సుమాలతో అందంగా తీర్చి దిద్దిన కల్యాణ మండపం, ఖరీదైన కార్లతో మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్ లోని సఫియా బ్యాంకెట్ హాల్ అతిథులను అమితంగా ఆకట్టుకుంది. సుమారు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, మంచి ముత్యాలు పొదిగిన 11.5. కేజీల బరువైన ఎలీసాబ్ గౌనును వధువు ఖాదిజాకోసం పారిస్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. జెన్నీఫర్ లోపేజ్ స్టేజ్ షో అంటే ఆషామాషీ కాదు. ఆమె ప్రదర్శనకు ఆరు కోట్ల రూపాయల వరకూ చెల్లించినట్లు 2013 లో టర్క్మెనిస్టియన్ ప్రెసిడెంట్ వెల్లడించారు. గుట్సరీవ్ వివాహ కార్యక్రమంలో అటువంటి ప్రదర్శన అతిథుల మనసును దోచుకుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 600 మంది దాకా పెళ్ళి వేడుకకు హాజరయ్యారు. అత్యుత్తమ యూరోపియన్ వంటకాలు, ఎనిమిది అంతస్తుల భారీ కేక్ తో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తెల్లని ఐసింగ్, గులాబీ పూలతో అందంగా అలంకరించిన కేక్ పై కనిపించిన నెలవంక, స్టార్ గుర్తులు ఆ నవ దంపతుల మత విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి. అమావాస్యనాడు వెన్నెల కురిసినట్లుగా వినీలాకాశంలో వెలుగులు నింపిన బాణసంచా సందడి మధ్య గుట్పరీవ్, ఖదీజా ఉదకోవ్ ల ఖరీదైన వివాహం ప్రత్యేకతను సంతరించుకుంది. -
ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ హల్ చల్..
ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నాయో ఏమో ఆ శునక రాజాలు రాజభోగాలు అనుభవించాయి. సంపన్న వ్యక్తుల వివాహాలకు ఏమాత్రం తీసిపోకుండా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లతో పాపులర్ అయిపోయాయి. అంతేకాదు ఈ ప్రత్యేక వేడుక వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ గా కూడ ప్రఖ్యాతి చెందింది. ఇంతకూ ఈ వివాహం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేమిటో మీరూ చూడండి. న్యూయార్క్ నగరంలోని ఒకప్పటి చారిత్రక ప్రాంత ఛల్సియా నైబర్ హుడ్ లోని.. హైలైన్ హోటల్ గతవారం రెండు శునక రాజాల కల్యాణ వైభోగానికి వేదికయ్యింది. వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను ధరించి పోజిచ్చిన వధువు... కావలియర్ కింగ్ ఛార్లెస్ స్పానియల్.. సుమారు మూడు లక్షల నలభై వేలమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ను సంపాదించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు లండన్ జ్యుయలర్స్ లో సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు కొన్ననెక్లెస్... ఆ శునకం నిశ్చితార్థం ఉంగరం స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్.. మాత్రం 16 వేలమంది ఫాలోయర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో నిరాడంబరంగా కనపడింది. కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే ఖరీదైన దుకాణం రూపొందించిన తక్సేడో తో పాటు టోపీని ధరించి హుందాగా తయారయ్యింది. శునకాల వెడ్డింగ్ పార్టీకి... ఇరువైపుల యజమానులే కాక, వారి వారి బంధుమిత్రులతోపాటు వారి పెంపుడు కుక్కలూ హాజరయ్యాయి. సుమారు రెండు వందల మంది హాజరైన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ హంగామా అంతా సామాజిక మీడియాలో స్థానం సంపాదించేందుకో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకో కాదని నిర్వాహకులు అంటున్నారు. దీనంతటికీ వెనుక సేవా ధృక్పధం దాగుందని చెప్పారు. పెంపుడు జంతువుల సంరక్షణార్థం ఓ సేవా సంస్థకు సహాయం అందించేందుకే ఈ వేడుకను నిర్వహించినట్లు వారు చెప్పారు. ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా వచ్చిన విరాళాన్ని ఆ సంస్థకు అందించారు.