మాస్కోః ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీటవేసి అంటూ అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళను వర్ణిస్తారు. అదే కోవకు చెందేట్టుగా ఉంది ఓ రష్యన్ బిలియనీర్ కుమారుడి వివాహ వైభోగం. జెన్నీఫర్ లోపేజ్ అద్భుత ప్రదర్శనతోపాటు... సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే వధువు వెడ్డింగ్ డ్రెస్ ఆ సంపన్న వివాహ కార్యక్రమంలో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.
రష్యన్ చమురు దిగ్గజం మిఖాయిల్ గుట్సరీవ్ తన 28 ఏళ్ళ కుమారుడు సెయిడ్ పెళ్ళి విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా 6,800 కోట్ల రూపాయల ఖర్చుతో లావిష్ గా పెళ్ళి జరిపించాడు. 20 ఏళ్ళ మెడికల్ విద్యార్థిని ఖదీజా ఉదకోవ్, సెయిడ్ లు నాలుగేళ్ళ సహజీవనం తర్వాత సంప్రదాయ బద్ధంగా మాస్కోలో జరిగిన వివాహంతో దంపతులయ్యారు. సువాసనలు వెదజల్లే సుమాలతో అందంగా తీర్చి దిద్దిన కల్యాణ మండపం, ఖరీదైన కార్లతో మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్ లోని సఫియా బ్యాంకెట్ హాల్ అతిథులను అమితంగా ఆకట్టుకుంది. సుమారు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, మంచి ముత్యాలు పొదిగిన 11.5. కేజీల బరువైన ఎలీసాబ్ గౌనును వధువు ఖాదిజాకోసం పారిస్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.
జెన్నీఫర్ లోపేజ్ స్టేజ్ షో అంటే ఆషామాషీ కాదు. ఆమె ప్రదర్శనకు ఆరు కోట్ల రూపాయల వరకూ చెల్లించినట్లు 2013 లో టర్క్మెనిస్టియన్ ప్రెసిడెంట్ వెల్లడించారు. గుట్సరీవ్ వివాహ కార్యక్రమంలో అటువంటి ప్రదర్శన అతిథుల మనసును దోచుకుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 600 మంది దాకా పెళ్ళి వేడుకకు హాజరయ్యారు. అత్యుత్తమ యూరోపియన్ వంటకాలు, ఎనిమిది అంతస్తుల భారీ కేక్ తో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తెల్లని ఐసింగ్, గులాబీ పూలతో అందంగా అలంకరించిన కేక్ పై కనిపించిన నెలవంక, స్టార్ గుర్తులు ఆ నవ దంపతుల మత విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి. అమావాస్యనాడు వెన్నెల కురిసినట్లుగా వినీలాకాశంలో వెలుగులు నింపిన బాణసంచా సందడి మధ్య గుట్పరీవ్, ఖదీజా ఉదకోవ్ ల ఖరీదైన
వివాహం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఏడువేల కోట్ల ఖర్చుతో ఖరీదైన పెళ్ళి..!
Published Wed, Mar 30 2016 7:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement
Advertisement