సమాచార హక్కు చట్టం.. ప్రజా చుట్టం
విజయవాడ : ఒకప్పుడు ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాలన్నిటినీ గోప్యంగా ఉంచేవారు. దీనివల్ల అవినీతి వ్యవహారాలు బయటకు పొక్కేవి కాదు. ప్రజాధనం దుర్వినియోగమయ్యేది. ఈ నేపథ్యంలోను సామాన్యుడు సైతం ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునే విధంగా సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
చట్టం ప్రధాన ఉద్దేశం
ఈ చట్టం పరిధిలోకి అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న సంస్థలన్నింటిని తీసుకొచ్చారు. అయితే, సెక్షన్ 8(ఏ) ప్రకారం దేశ రక్షణ, దేశ సార్వభౌమాధికారానికి భంగం కల్గించే విషయాలు, విదేశీ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలను ఈ చట్టం నుంచి మినహాయించారు.
పౌర సమాచార అధికారి విధులు
దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సదరు పౌర సమాచార అధికారి కనిష్టంగా 48 గంటల నుంచి 30 రోజుల్లోగా సమాచారాన్ని అందజేయాలి. దరఖాస్తు అసమగ్రంగా ఉన్నా, నిర్ణీత ఫీజు చెల్లించకపోయినా తిరస్కరించవచ్చు. సమాచార పత్రాలు, సీడీలు కావాలంటే అదనపు ఫీజు చెల్లించవలసినదిగా దరఖాస్తుదారుడిని కోరవచ్చు. నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వడంలో సమాచార అధికారి విఫలమైతే దరఖాస్తుదారుడు అప్పిలేట్ సమాచార అధికారికి తన వద్ద ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. అప్పిలేట్ అధికారి కింది అధికారి నుంచి సమాచారం ఇప్పించాల్సి ఉంటుంది. అప్పిలేట్ అధికారి కూడా నిర్ణీత సమయంలో సమాచారాన్ని అందించకపోతే రాష్ట్ర సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ర్ట సమాచార కమిషన్ ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి.. ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని ఇవ్వలేదని నిరూపణ అయితే సదరు అధికారికి రూ.25 నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే..
సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని పొందాలనుకునే వారు నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి, నిర్దేశిత రుసుమును కోర్టు ఫీజు స్టాంప్‌తో, పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించి ఏ విభాగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారో సదరు కార్యాలయంలోని పౌర సమాచార అధికారికి అందజేయాలి. దరఖాస్తు ఇచ్చినట్టుగా తగిన రశీదు పొందాలి. తెల్లరేషన్ కార్డుదారులు తమ కార్డు నకళ్లను దరఖాస్తుతో జత చేస్తే ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.