lawyer case
-
కోల్గేట్కు షాక్.. రూ.65 వేల జరిమానా
సంగారెడ్డి: కోల్గేట్ సంస్థ పేస్టును అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పి ఓ వినియోగదారుడు పిటిషన్ వేయగా విచారించిన వినియోగదారుల ఫోరం రూ.65 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తోందని సంగారెడ్డికి చెందిన ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను విచారించి శుక్రవారం ఫోరం తీర్పునిచ్చింది. న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7వ తేదీన సంగారెడ్డిలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొన్నారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ.10కి కొనుగోలు చేశారు. అయితే రూ.పదికి 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకోవడంపై నాగేందర్ సందేహం వ్యక్తం చేశారు. అంటే రూ.17 అధికంగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆయన కోల్గేట్ సంస్థ వారికి నోటీసులు పంపించారు. అతడి నోటీసులకు కోల్గేట్ సంస్థ స్పందించకపోవడంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను విచారించి కోల్గేట్ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు. దాంతోపాటు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు. అయితే ఇవన్నీ కూడా నెల రోజుల్లోపు వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ విధంగా వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోసం పని చేస్తుంటుంది. మీరు కూడా ఎక్కడైనా.. ఏం సంస్థ వస్తువు విషయంలో మోసపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. -
నంద్యాల ఆర్డీఓ, సీఐల కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి
కలెక్టర్, ఎస్పీకి కోర్టు ఆదేశం కర్నూలు(లీగల్): న్యాయవాది పాములేటి కాళ్లకు సంకెళ్లు వేసిన ఘటన కేసులో నంద్యాల ఆర్డీఓ, అప్పటి త్రీటౌన్ సీఐ, ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల కులధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ కోర్టు బుధవారం జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10వ తేదీన నంద్యాల న్యాయవాది పాములేటి మరో ఇద్దరిపై నంద్యాల త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా అక్కడ కాళ్లకు బేడీలు వేయడంతో పాములేటి కర్నూలులో ప్రై వేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో ఫిర్యాది, సాక్షుల వాంగ్మూలలను నమోదు చేసిన న్యాయమూర్తి వీవీ శేషుబాబు బుధవారం నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఏఓ మధుసూదన్, సీనియర్ సహాయకులు సుధాకర్‌రావు, సీఐ వెంకటరమణ, కానిస్టేబుళ్లు శోభన్‌బాబు, లక్ష్మణ్రావుల కులధ్రువీకరణ పత్రాలను అందించాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.