lawyer dies
-
పాట్నా సివిల్ కోర్టు వద్ద పేలుడు..
పాట్నా: బిహార్‌లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇటీవల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫర్మర్ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’ -
న్యాయదిగ్గజం జగన్నాథం మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ న్యాయవాద దిగ్గజం, సీనియర్ న్యాయవాది లంక జగన్నాథం (73) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దిరోజులుగా నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశాఖ న్యాయవాదులకు పెద్ద దిక్కైన జగన్నాథం 1949లో జన్మించారు. ఏవీఎన్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, ఏయూ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. 1973లో న్యాయవాదిగా తన ప్రస్థానం ప్రారంభించి, తండ్రి దివంగత న్యాయవాది లంక వెంకటేశ్వర్లు వద్ద ప్రాథమిక మెళకువలు నేర్చుకున్నారు. విశాఖ జిల్లా కోర్టులో నాటి నుంచి న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జగన్నాథానికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘంలో ఐదు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా ఉన్న ఆయన అనేక ప్రముఖ సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. ఏయూ, ఏవీఎన్ కళాశాల, ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవీఎంసీ, పలు బీమా సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. శంకరమఠం, శ్రీ రామాయణ ప్రవచన సంఘం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అద్యక్షుడిగా పనిచేశారు. దిగువ, హైకోర్టులో పలు ప్రముఖ కేసులలో తన ప్రతిభతో మార్గదర్శిగా నిలచారు. తండ్రి వెంకటేశ్వర్లు బాటలో నడిచి, ఎందరో జూనియర్ న్యాయవాదులకు దారిచూపారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం చూడగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించి, రెండు చేతులు జోడింగ్ నమస్కరించే మంచి మనిషి నేడు కనుమరుగయ్యారు. లంక జగన్నాథం మృతితో పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు సీనియర్ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురి సంతాపం... లంక జగన్నాథం మృతి పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, విశాఖ న్యాయవాదుల సంఘం అద్యక్షుడు జి.ఎం రెడ్డి, ఇతర సీనియర్ న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవాది లంక జగన్నాథం మృతికి ప్రముఖ న్యాయవాదులు కేవీ రామ్మూర్తి, చీమల పాటి శ్రీరామమూర్తి, ఎం.కె సీతారామయ్య, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాద్యక్షుడు కె.రామ జోగేశ్వర రావు, ఎస్.క్రిష్ణమోహన్, శిష్ట్ల శ్రీనివాస మూర్తి సంతాపం ప్రకటించారు. చదవండి: నకిలీ వకీలు: కోర్టులో ప్రశ్నలకు తడబడటంతో.. -
ఓరుగల్లు న్యాయ దిగ్గజం ప్రసాద్ కన్నుమూత
సాక్షి, వరంగల్ : ఓరుగల్లు న్యాయదిగ్గజం, తొలి తరం న్యాయవాది కిలారు శ్రీరామ గోవింద ప్రసాద్(కేఎస్ఆర్జీ.ప్రసాద్) శుక్రవారం కన్నుమూశారు. హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీలో ఉన్న తన స్వగృహంలో తెల్లవారుజామున 2.30గంటలకు ఆయన మృతి చెందారని కుటుంబీకులు వెల్లడించారు. 50 ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ప్రసాద్ మరణం జిల్లా కోర్టు న్యాయవాదులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1925లో నాటి నిజాం సంస్థానం పరిధిలోని నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామలో ప్రసాద్ జన్మించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అధిష్టానం అదేశాల మేరకు మహబూబాబాద్‌లో స్థిరపడ్డారు. వామపక్ష విద్యార్థి సంఘ నేతగా డిగ్రీ చదువుతున్న సమయంలో గుంటూరు హిందు కాలేజీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా మాజీ గవర్నర్ కోణిజేటి రోశయ్యపై విజయం సాధించాడు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టా పొంది 1955లో న్యాయవాదిగా నాటి హైదరాబాద్ రాష్ట్రంలో పేరు నమోదు చేసుకున్నారు. నాటి నుండి సివిల్ కేసులు వాదించడంలో, యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వడంలో ఎంతో నైపుణ్యం సాధించాడు. న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, రచయితగా బహుముఖ రంగాల్లో ప్రజ్ఞాశాలిగా ప్రసాద్‌కు పేరు ఉంది. స్టాండింగ్ కౌన్సిల్లో.. అధ్యాపకుడిగా కాజీపేటలోని నిట్‌తోపాటు వివిధ బ్యాంకులు,, విద్యాసంస్థలకు ప్రసాద్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. జిల్లా బార్ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులుగా పని చేశారు. అనేక సెమినార్లు నిర్వహించి భూసంస్కరణలు, మానవహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, ప్రాథమిక హక్కులు అంశాలలో తనదైన శైలిలో పత్రాలు సమర్పించారు. కేయూ, ఎస్డీఎల్సీఈ, న్యాయ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కాగా, మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం ఉపా«ధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో పాటు సీనియర్ న్యాయవాది సహోదర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, అరవింద్, రాంగోపాల్‌రావు, యూసుఫుద్దీన్, వీరస్వామి, వెంకటేశ్వర్రావు, జితేందర్‌రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమౌళి, ఆర్.సదానందం, ఎన్.సురేందర్, కిషోర్‌కుమార్, రేవతిదేవి, ఆండాలు, రిటైర్డ్ జిల్లా జడ్జి రాజన్న తదితరులు ప్రసాద్ వద్ద శిష్యరికం చేశారు. అప్పట్లోనే కులాంతర వివాహం చేసుకుని ప్రసాద్ అదర్శంగా నిలవగా, ఆయన జీవిత భాగస్వామి సూర్యముఖి పింగిళి మహిళా కళాశాలలో లెక్చరర్‌గా రిటైర్డ్ అయ్యారు. వీరి కుమారుడు డాక్టర్ సతీష్‌చందర్ కాగా, కుమార్తెలు సుధ, స్వర్ణలత అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా రిటైర్డ్ అయ్యారు. కాగా, కేఎస్ఆర్జీ.ప్రసాద్ మృతి విషయం తెలిసి జిల్లా కోర్టు న్యాయవాదుల ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే, మొదటి అదనపు జిల్లా కోర్టు హాల్లో జడ్జి జయకుమార్ అధ్యక్షతన, బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షుడు లెక్కల జలేందర్‌రెడ్డి అధ్యక్షతన సంతాపసభ నిర్వహించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సంజీవరావు, జయకర్, జనార్దన్, సత్యనారాయణ, వేణుగోపాల్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బోయినిపల్లి వినోద్‌కుమార్ సంతాపం హన్మకొండ: సీనియర్ న్యాయవాది కేఎస్ఆర్జీ.ప్రసాద్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్యతో కలిసి జైలు జీవితం అనుభవించిన ప్రసాద్.. స్వాతంత్య్ర సమరయోదుడైనా పెన్షన్ తీసుకోలేదని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో న్యాయవాది దుర్మరణం
మడకశిర రూరల్ : మడకశిరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగేపల్లికి చెందిన న్యాయవాది లోకేష్‌రెడ్డి (35) దుర్మరణం చెందారు. వివరాలిలావున్నాయి... మంగళవారం సాయంత్రం పనినిమిత్తం పట్టణానికి చెందిన మారుతి, లోకేష్‌రెడ్డిలు ద్విచక్రవాహనంలో పావగడకు వెళ్లారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వస్తుండగా మడకశిరలోని చంద్రమౌళేశ్వరస్వామి దేవాలయ సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి ముళ్లపొదల్లోకి పడిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న లోకేష్‌రెడ్డిని కొంతసేపటి తర్వాత ఆటు వెళుతున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని బెంగళూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మరో యువకుడు మారుతి స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. లోకేష్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మక్బూల్‌బాషా కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, రైతు సంఘం కార్యదర్శి ఎస్ఆర్ అంజినరెడ్డి, నాయకులు వెంకటరంగారెడ్డి, వెంకటేష్, సర్పంచు పుట్టమ్మ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, వివిధ పార్టీల నాయకులు, రెడ్డి సంఘం నాయకులు వెంకటసుబ్బారెడ్డి , రవిశంకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చౌడరెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. లోకేష్‌రెడ్డి మృతిపట్ల బుధవారం జడ్డి రమేష్‌నాయుడు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.