Lawyer Role
-
లాయర్ అవతారం ఎత్తిన హీరోయిన్లు, ఎవరెవరంటే?
నల్ల కోటు ధరించారు.. ఒత్తయిన కురులను ముడిలా బిగించారు.. న్యాయం కోసం నడుం బిగించారు. యువరానర్ అంటూ వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. అందాల తారలు ఇలా పవర్‌ఫుల్‌గా కనబడితే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. లాయర్లుగా కనిపించనున్న ఆ తారలు చేస్తున్న సినిమాల్లోకి ఓ లుక్కేద్దాం. ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’ వంటి బయోపిక్ కావొచ్చు, ‘గుడ్‌లక్ సఖి’ వంటి స్పోర్ట్స్ డ్రామా కావొచ్చు, ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన చేస్తున్న కమర్షియల్ ఫిల్మ్ ‘సర్కారువారి పాట’ చిత్రంలోని కళావతి పాత్ర కావొచ్చు... క్యారెక్టర్ ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోతారు. తాజాగా కీర్తి లాయర్‌గా మారారు. కోర్టులో ప్రత్యర్థి లాయర్‌ను ఆమె ఎలా ముప్పుతిప్పలు పెడతారో ‘వాషి’ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. కీర్తి లాయర్‌గా నటిస్తున్న మలయాళ చిత్రం ఇది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి లుక్‌ని విడుదల చేశారు. ఇక కీర్తీ సురేష్ అన్నయ్యకు ఓ లాయర్‌గా హెల్ప్ చేయాలనుకుంటున్నారు తమన్నా. కీర్తి అన్నయ్యకు తమన్నా సహాయం చేయడమేంటీ అనుకుంటున్నారా? కీర్తి ఆన్ స్క్రీన్ అన్నయ్య చిరంజీవి తరఫున లాయర్‌గా తమన్నా వాదించనున్నారట. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. లాయర్ పాత్రలో తమన్నా నటించనున్నారని తెలిసింది. ‘బోళాశంకర్’ చిత్రం తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’లో హీరోయిన్గా నటించిన శ్రుతీహాసన్ లాయర్ పాత్రలో కనిపించారు. సో.. ‘బోళా శంకర్’లో తమన్నా లాయర్‌గా కనిపిస్తారని ఊహించుకోవచ్చు. మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా లా సెక్షన్స్‌ను గుర్తుపెట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘పక్కా కమర్షియల్’ కోసం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో రాశీ ఖన్నా లాయర్‌గా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు 2009లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ గడప తొక్కారు హీరోయిన్ విమలా రామన్. ఆ తర్వాత ‘గాయం 2’, ‘రాజ్’, ‘చట్టం’ వంటి సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో విమలా రామన్ కెరీర్ ఆశించినట్లుగా సాగలేదు. కానీ మలయాళంలో హిట్. తాజాగా ఆమె ఓ మలయాళం చిత్రంలో లాయర్‌గా నటిస్తున్నారు. తన లాయర్ లుక్‌ను విమలా షేర్ చేశారు. అటు హిందీకి వెళితే... అక్కడ కూడా ఓ లాయరమ్మ రెడీ అవుతున్నారు. తమిళ బంపర్ హిట్ మూవీ ‘విక్రమ్‌వేదా’ హిందీ రీమేక్‌లో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేయనున్నారని టాక్. తమిళంలో ఇన్స్పెక్టర్ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదగా విజయ్ సేతుపతి నటించగా, ప్రియ అనే లాయర్ పాత్రను పోషించారు శ్రద్ధా శ్రీనాథ్. తమిళంలో తీసిన పుష్కర్ గాయత్రి దర్శక ద్వయమే హిందీ రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో సైఫ్ భార్య అంటే లాయర్‌గా హీరోయిన్ రాధికా ఆప్టే కనిపించనున్నారట. వీరితో పాటు మరికొందరు నాయికలు న్యాయం కోసం కోర్టులో వాదించేందుకు లాయర్లుగా రెడీ అవుతున్నారు. -
కోర్టు మెట్లు ఎక్కనున్న రాధికా ఆప్టే?
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్‌కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. -
లాయర్ సూర్య
‘సింగమ్’ సిరీస్‌లో సూర్య పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. చెప్పాలంటే హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ అది. ఈ సిరీస్‌లో పోలీస్ పాత్రలో హై పిచ్‌లో సూర్య డైలాగులు చెప్పారు. ఇప్పుడు లాయర్‌గా అదే రేంజ్లో కోర్టులో వాదన వినిపించడానికి రెడీ అవుతున్నారట. ‘కూటత్తిల్ ఒరుత్తన్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో గిరిజనుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఇందులో హీరో సెలెక్ట్ కాలేదు. అయితే ఓ కీలక పాత్ర చేయడానికి సూర్య అంగీకరించారని కోలీవుడ్ టాక్. లాయర్‌గా కనిపిస్తారట. ఇదిలా ఉంటే సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దు రా’ విడుదలకు సిద్ధమవుతోంది. హరి దర్శకత్వంలో సూర్య నటించనున్న ‘అరువా’ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ‘అరువా’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
కోర్టుకెళ్తున్న హీరోయిన్
సినిమాల కంటే కూడా ఒక ప్రముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటన ద్వారా ఎక్కువమందికి పరిచయమైన హీరోయిన్ యామి గౌతమ్. అయితే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ తరచుగా బాంబే హైకోర్టు బయట కనిపిస్తుంది. అది కూడా షాహీద్ కపూర్ కోసమంట. వీరిద్దరి మధ్య ఏమైనా వివాదాలు వచ్చాయా.. కోర్టుకెల్లేంత పెద్ద గొడవలు ఏం జరిగి ఉంటాయబ్బ అని ఆలోచిస్తున్నారా.. అయితే మీ ఆలోచనలకు అక్కడే ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే యామి కోర్టుకు వెళ్తుంది విచారణ ఎదుర్కోవడానికి కాదు. తదుపరి చిత్రం ‘బట్టి గుల్ మీటర్ చలు’లో చేయబోయే లాయర్ పాత్ర కోసం ఈ అమ్మడు తరచు కోర్టుకు వెళ్తూ... లాయర్ల పనితీరు గురించి తెలుసుకుంటోంది. సినిమా అంటే ఎంత డెడికేషనో యామీకి! ప్రస్తుతం యామి.. శ్రీనారాయణ సింగ్ దర్శకత్వంలో, షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘బట్టి గుల్ మీటర్ చలు’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చిన్నపట్టణాల్లో ఎదురయ్యే విద్యుత్ సమస్యల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో యామి లాయర్‌గా కనిపించనుంది. ‘కోర్టు ప్రొసిడింగ్స్ ఎలా ఉంటాయి. ప్రాసిక్యూషన్ బాధితుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయంలో నాకు సహాయం చేయమని ఒక లాయర్ స్నేహితురాలిని కోరాను. ఇప్పుడైతే కోర్టుకు సెలవులు కానీ అదృష్టం కొద్ది నా లాయర్ స్నేహితురాలు మరికొందరు లాయర్లు కలిసి ఒక వెకేషన్ బెంచ్ సెషన్‌ను నిర్వహిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యేలోపు నిజంగా కోర్టులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకునేందుకు కోర్టుకు హాజరవుతున్నా’ని యామి చెప్పారు. ‘బట్టి గుల్ మీటర్ చలు’ కాక ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉరి’ చిత్రంలో కూడా ఆమె నటించనున్నారు. 2016, సెప్టెంబర్‌లో ‘ఉరి సెక్టార్’లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరెకెక్కనున్న ఈ చిత్రంలో యామి పవర్‌పుల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. -
నా కల నెరవేరింది: హీరోయిన్
కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదులు జడ్జిని గౌరవంగా యువరానర్ అంటుంటారు. కథానాయిక పూనమ్ కౌర్ కూడా ఇప్పుడు అలానే అంటున్నారు. తొలిసారి ఆమె లాయర్‌గా నటిస్తోన్న చిత్రం ‘ప్రణయం’. దిలీప్, పూనమ్ కౌర్, అక్షిత ప్రధాన పాత్రల్లో శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై జీయస్వీ సత్యప్రసాద్ దర్శకత్వంలో ఎ.నరేందర్, విజయానంద్, సురేష్ గౌడ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత గుణ్ణం గంగరాజు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక సిన్సియర్ లవ్‌స్టోరీ. యువతరంతో పాటు అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కిస్తాం. పూనమ్ కౌర్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర ఈ చిత్రానికి హైలెట్. దిలీప్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. సహ నిర్మాత నరేందర్ సహకారంతోనే ఈ చిత్రం చేయగలుగుతున్నాం’’ అని చెప్పారు. ‘‘నా పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేశారు. రియల్ లైఫ్‌లో లాయర్ కావాలనుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాశా. కానీ సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే నేనంత తెలివైనదాన్ని కాదు. ఇప్పుడు రీల్ లైఫ్‌లో లాయర్ పాత్ర చేయడంతో నా రియల్ డ్రీమ్ నెరవేరినట్లనిపిస్తోంది’’ అని పూనమ్‌కౌర్ తెలిపారు. దిలీప్, అక్షిత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రామ్‌కుమార్, సంగీతం: కేయం రాధాకృష్ణ, నిర్మాణ, నిర్వహణ: యండీ సలీమ్.