గుర్తుకొస్తున్నాయి..
లయోలా స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
అది బాల్యంలో అనుబంధం... అరమరికలు లేని స్నేహం... 33 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్న ఆ క్షణం... మాటల్లో చెప్పలేని అనుభూతి... కళ్లల్లో ఉప్పొగిన సంతోషం... ఈ ఉదయం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూపులు ఫలించిన వేళ...ఒకరినొకరు పలకరింపులు...ఆప్యాయతతో ఆలింగనాలు... యోగ క్షేమ సమాచారాల కుశలప్రశ్నలు.. ఈ భావోద్వేగ క్షణాలకు శనివారం వినుకొండ లయోలా స్కూల్ వేదికైంది. ఆ పాఠశాలలో 1983–84 బ్యాచ్‌కు చెందిన 58 మంది పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆనందించారు.అడపాదడపా ఒకరినొకరు కలుస్తున్నా, అందరినీ ఒక్కసారిగా కలవాలనే వారి ఆశ నెరవేరింది. ఆనాటి గురువులతో ఉన్న అనుబంధాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మళ్లీ ఆనాటి విద్యార్థుల్లాగా వీరంతా ఉదయం స్కూల్ డ్రెస్‌తో అసెంబ్లీలో పాల్గొనడం గమనార్హం. నాడు ఏ క్లాస్‌రూమ్‌లో పాఠాలు నేర్చుకున్నారో అదే క్లాస్‌రూమ్‌లో కూర్చొని క్రిష్టయ్య మాస్టార్ చే అటెండెన్స్ వేయించుకొని పాఠం చెప్పించుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల ముఖద్వారం నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పూర్వ విద్యార్థులు మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, విజయరాజకుమార్, ఆదాం, సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్.మురళి, సురేష్, జి. శ్రీనివాసరావు, సీహెచ్ శ్రీనివాసరావు, ఫరీద్‌బాబు, పవన్‌కుమార్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వీరిలో మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఫరీద్‌బాబు అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్ డిఫెన్స్‌లో రీసెర్చ్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. సీహెచ్ శ్రీనివాసరావు భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
– వినుకొండ రూరల్