lazy ness
-
పర్లేదు.. కాస్త బద్దకం అలవరుచుకోండి.. ‘లేజీ డే’ ముచ్చట్లు!
అందరివీ బిజీబిజీ గజిబిజి జీవితాలు.. ఉన్న 24 గంటలూ సరిపోనంతగా ఉరుకులు పరుగులు పెడుతుంటాం.. మరి కొందరేమో సోఫాలోనో, బెడ్ మీదనో గంటలు గంటలు అలా గడిపేస్తారు. అయితే పని తప్పించుకోవడం, లేకుంటే ఎలాగోలా త్వరగా పూర్తిచేసి మళ్లీ ‘రెస్ట్ మోడ్’లోకి వెళ్లిపోవడమే వారి పని. బద్ధకం, సోమరితనం, మందకొడితనం.. ఇలా ఎలా పిలిచినా సరే.. లేజీనెస్ ఎంతో కొంత మంచిదేనట. దాని ప్రయోజనాలు దానికీ ఉన్నాయట. మరి ఈ మంగళవారం (ఆగస్టు 10) ‘లేజీ డే’ నేపథ్యంలో.. ఈ లేజీ క్రేజీ ముచ్చట్లేంటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఉరుకులు.. పరుగుల నుంచి.. ముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు అందరివీ ఉరుకులు, పరుగుల జీవితాలు. ఏ రోజు, ఏ గంటలో ఏమేం చేయాలో ముందే రాసిపెట్టుకుని యంత్రాల్లా గడిపేస్తున్న.. ‘టు–డు’ లిస్టుల బతుకులు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి.. మనసులో గంపెడన్ని ఆందోళనలతో.. నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. మళ్లీ ‘రీఫ్రెష్’ అయిపోతామని అంటుంటారు. కానీ అది జస్ట్ ‘రిపేర్’ చేసుకోవడం మాత్రమేనని శాస్త్రవేత్తలు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే.. కాస్త ‘లేజీనెస్’ అలవర్చుకోవాలని చెప్తున్నారు. 8 విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోవడమో.. లేకుంటే సినిమా, షికారు వంటి పనులు పెట్టుకోవడమో చేస్తుంటారని.. అక్కడ నిజంగా విశ్రాంతి ఎక్కడుంటుందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ‘లేజీనెస్’ అంటే.. ఆందోళనలు, సమస్యలు అన్నీ పక్కనపడేసి.. మీకు నచి్చన ఫుడ్ తిని, మీకు నచ్చినట్టుగా సోఫాలోనో, బెడ్ మీదో బద్ధకంగా పడిపోవడం అని చెప్తున్నారు. ‘సోమరితనం’ కూడా చికిత్సనే.. బద్ధకంగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదేనని.. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. కానీ లేజీగా గడపడం కోసం.. సమయం వృధా చేస్తున్నామనే ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు మీ గురించి మీరు తీసుకునే శ్రద్ద.. రేపటి మీ జీవితంపై శ్రద్ధకు తోడ్పడుతుందని అంటున్నారు. పరిమితి దాటితే ప్రమాదం.. లేజీగా ఉండాలన్నారు కదా అని.. బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోవద్దు. ఇది ఒకస్థాయి దాటితే జీవితంలో మనకు అవసరమైన వాటిపైనా నిర్లక్ష్యం చేసే దశకు చేరుతామని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల దురలవాట్లకు కారణాల్లో సోమరితనం ఒకటి. ఏదైనా సులువుగా చేయలనుకోవడం ‘లేజీనెస్’ ప్రధాన లక్షణమైతే.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డాదారిలో వెళ్లడమూ అందులో భాగమే. కేవలం ‘రీఫ్రెష్’ కావడానికి మాత్రమే లేజీనెస్‌ను పరిమితం చేయాలి మరి. లేజీ లేజీగా.. ఏం చేద్దాం? మీకు నచ్చిన ఏదో ఒక రోజును పూర్తిగా మీకు కేటాయించుకోండి. ముఖ్యంగా డబ్బు, ఇతర సమస్యలను పూర్తిగా పక్కనపెట్టండి. ఆందోళనలను పూర్తిగా వదిలేయండి. పొద్దున్నే లేవడం, అలారం పెట్టుకోవడాన్ని పక్కనపెట్టి.. మీకు ఇష్టమైనప్పుడు నిద్ర లేవండి. హాయిగా వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. సోఫాలో, బెడ్‌పై ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా సుఖంగా ఉండేలా చూసుకోండి. టీవీలోనో, ఫోన్లోనో నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గడపండి. ఎట్లాంటి ఆలోచనలూ పెట్టుకోకండి. అలా బద్ధకంగా కూలబడి.. నచి్చన సంగీతం, పాటలు వినండి. ఫోన్లో నోటిఫికేషన్లను ఆఫ్ చేసేయండి. వీలైతే ఆ రోజు ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టేయండి. వంట పని వంటివి కూడా పెట్టుకోవద్దు. అలాగైతే తిండి ఎలా అనే డౌట్ వద్దు. ఆ ఒక్కరోజు బయటి నుంచి నచ్చిన ఫుడ్ తెప్పించుకుని.. నచ్చినట్టుగా తినండి. ఇవన్నీ మీరు మానసికంగా, శారీరకంగా పునరుత్తేజితం కావడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు. లేజీ.. ముచ్చట్లు ఎన్నో.. లేజీనెస్పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు తాము కనుగొన్న అంశాలతో రిపోర్టులు విడుదల చేశారు. మనం చురుగ్గా ఉండటానికి డోపమైన్ అనే ప్రొటీన్ కీలకం. అది మెదడును ఉత్తేజపరుస్తుంది. కానీ కొందరిలో మెదడులోని డోపమైన్ గ్రాహకాల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దాంతో వారు ఎంతగా ప్రయత్నించినా యాక్టివ్‌గా ఉండలేకపోతారు. స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు దీనికి మందు రూపొందించే పనిలో ఉన్నారు. ఎవరైనా లేజీగా ఉండిపోతే.. మెదడు రెగ్యులర్ యాక్టివిటీని ఆపేసి, పగటికలలు, సృజనాత్మక అంశాలపై దృష్టిపెడుతుందని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. చిత్రమేమిటంటే ఆ సమయంలో మెదడులో యాక్టివ్‌గా ఉండే భాగమే.. మనం మన భవిష్యత్తుపై ఆలోచనలు కూడా చేస్తుందని వెల్లడించారు. లేజీగా ఉండేవారు సమస్యలను పరిష్కరించడానికి సులువైన మార్గాలను వెతుకుతారని పరిశోధకులు నిరూపించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘పెర్ల్’ను రూపొందించిన లారీ వాల్ కూడా ఇదే చెప్పారు. ప్రోగ్రామ్‌ల కోసం వేల లైన్ల కోడ్ రాయాల్సి ఉంటుందని.. అదే లేజీగా ఉండేవారు తక్కువ లైన్లలో ప్రోగ్రామ్ రాసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇది అనారోగ్య సమస్య కాదు సోమరితనం అనారోగ్య సమస్య అని చాలా మంది అనుకుంటారని.. ఆ ఆలోచనే తప్పు అని ‘కాంటెంపరరీ సైకోఅనలైసిస్ గ్రూప్’కు చెందిన సైకాలజిస్టు లారా మిల్లర్ తెలిపారు. ఇతరుల్ని తప్పుపట్టడానికి దీన్ని వాడతారన్నారు. కొందరు లేజీగా కనిపించడానికి చదువు, పని, ఏదైనాగానీ తమ వల్ల కాదేమోనన్న భయం అందుకు కారణమవుతుందని వివరించారు. ఏదైనా కోల్పోవడం, కోల్పోతామన్న భయం, ఓటమి, డిప్రెషన్ వంటివి లేజీనెస్‌కు దారితీస్తాయని.. మనసులో గట్టిగా కోరుకుంటే సులువుగా బయటపడొచ్చన్నారు. నేనైతే లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటా! ‘ఏదైనా కష్టమైన పని చేయాలంటే.. నేను లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటాను. ఎందుకంటే కష్టమైన పనిని సులువుగా చేయగల మార్గాలను అలాంటివారే గుర్తించగలరు..’ – మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చదవండి: గిన్నిస్ రికార్డు పసికందు.. శ్రమించి ఊపిరి నిలిపిన డాక్టర్లు -
ఉచిత బియ్యంతో సోమరులవుతున్నారు!
చెన్నై: ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుండటంతో ప్రజలు బద్దకస్తులుగా మారుతున్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత బియ్యం అందేలా నిబంధనలు సవరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజా పంపిణీ పథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడంటూ పోలీసులు ఓ వ్యక్తిని గూండా చట్టం కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. ధనిక, పేద ఇలా అందరికీ ఉచిత బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,110 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ‘కనీస సౌకర్యాలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం వీటిని అందరికీ ఇస్తున్నాయి. దీంతో ప్రజలు బద్దకస్తులుగా మారారు’ అని కోర్టు పేర్కొంది. -
అతి ‘స్మార్ట్’ అనర్థమే..!
మీరు డిజిటల్ అడిక్షన్ అదేనండి...స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇతర డిజిటల్ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారా ? దీనికి అవుననే స్పష్టమైన సమాధానమే వస్తోంది. స్మార్ట్ఫోన్ల అతి వినియోగం నాడీమండలంలో మార్పులకు కారణమవుతోందని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా తలమునకలైతే ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతో పాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే ‘న్యూరో రెగ్యులేషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే మెసేజ్ అలర్ట్‌ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళన పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది. సిగిరెట్ల మాదిరిగానే డిజిటల్ టెక్నాలజీని కూడా ఓ వ్యసనంగా మారేలా రూపొందించారని నిఫుణులు భావిస్తున్నారు. వివిధ రూపాల్లో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్‌లు, వైబ్రేషన్లు, అలర్ట్‌ల పట్ల ఏదో ప్రమాదం సంభవిస్తుందేమో అన్నట్టుగా స్పందిస్తున్నారు. ఓ వైపు తమ మనసులోని భావాలను ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు (మల్టీ టాస్కింగ్) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్ కావడంలేదు. దాంతో చురుకుదనం మందగిస్తోంది. ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతీ చిన్న విషయానికి ఫోన్లపైనే ఆధారపడడం ఎక్కువై పోయింది. మనలో 40 శాతానికి పైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్ చేసుకుంటున్నట్టు, యాభైశాతానికి పైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్ సంస్థ స్టడీలో వెల్లడైంది. గేమింగ్ డిజార్డరేనంటున్న డబ్ల్యూహెచ్ఓ... పరిసరాలను పట్టించుకోకుండా నిరంతరం వీడియో గేమ్‌ల్లో మునిగిపోయే ‘గేమింగ్ డిజార్డర్’ ను కూడా ‘రివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీసెస్’ (ఐసీడీ–11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేర్చనుంది. దీనిలో భాగంగా ఈ డిజార్డన్‌ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ (ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్) జాబితాలో ప్రచురించనుంది.. ప్రపంచం లోని ఆరోగ్య పోకడలు, సమస్యల తీరును గుర్తించి, వాటి నిర్థారణతో పాటు వర్గీకరణకు ఉద్ధేశించి ఐసీగీ–11ను ఓ ప్రామాణిక సాధనంగా డాక్టర్లు, పరిశోధకులు, ఎపిడమియోలాజిస్ట్‌లు ఉపయోగిస్తున్నారు. భారత్‌లో... మనదేశంలో తొలిసారిగా 2016లో ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు ఈ గేమింగ్ డిజార్డర్‌ను గుర్తించారు. సైకియాట్రీ వార్డులో 22 , 19 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్నారు. వారి తల్లితండ్రులు వైద్యుల సహాయం కోరేనాటికే కొన్నిరోజుల పాటు తిండి,నిద్ర అనే అలోచన లేకుండాS ఎడతెగని గేమింగ్ కారణంగా ఈ యువకులు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తులో మునిగిపోయారు. అధిగమించేందుకు ఏం చేయాలి ? స్మార్ట్ఫోన్టలోని అలర్ట్‌లు, నోటిఫికేషన్లను ఆపేయాలి. ఆన్లైన్ కార్యకలాపాల కంటే ఆఫ్‌లైన్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టడం, కుటుంబసభ్యులు, మిత్రులతో సంభాషణలు కొనసాగించాలి. నిద్రపోవడానికి గంట ముందు అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి లేదా మరో గదిలో ఫోన్‌ను ఉంచాలి. ఫోన్లలోని ‘బ్లూ వేవ్ లెంథ్ లైట్’ మెదడులో నిద్రకు సమయం ఆసన్నమైనదని సూచించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. రాత్రి భోజనం చేసేపుడే ఫోన్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత దానిని ఇంటి వద్దే వదిలేసి కొంతదూరం నడిచిరావాలి. ప్రతీ చిన్న విషయానికి వెబ్‌లో సెర్చ్ చేసే ధోరణి మార్చుకోవాలి నిరంతరం ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి నెట్‌వర్క్‌ల్లో మునిగిపోకుండా సామాజికమాధ్యమాల వినియోగంపై నియంత్రణ పాటించాలి. కంప్యూటర్ లేదా మొబైల్‌ను చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలోని కనీసం 30 పేజీలు చదివాకే వాటిని ముట్టుకోవాలని తమకు తాము సవాల్ చేసుకోవాలి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బరువు – బాధ్యత
పనిని బాధ్యతగా చెయ్యడం ఉద్యోగ ధర్మం. ఆ ధర్మాన్ని మీరడం అంటే యజమానికి ద్రోహం చెయ్యడమే. రామయ్య దగ్గర ఓ గాడిద ఉండేది. అది సోమరి గాడిద. ఎప్పుడూ పని తప్పించుకోవాలని చూసేది. లేదంటే, పని తగ్గించుకోవాలని చూసేది. ఉప్పు బస్తాలను మోయడం దాని పని. ఎప్పటిలాగే ఓ రోజు బద్ధకంగా, అయిష్టంగా ఉప్పు బస్తాను మోస్తూ, దారి మధ్యలో నదిలో పడిపోయింది ఆ గాడిద. రామయ్య దానిని లేవదీసి, తిరిగి నడిపించాడు. బస్తాలోని ఉప్పు కరిగిపోవడంతో గాడిదకు బరువు తగ్గింది. ఆ సంగతి గ్రహించిన గాyì ద, బరువు తగ్గించుకోడానికి ప్రతిరోజూ ఆ నదిలో పడిపోవడం మొదలుపెట్టింది! అది గమనించాడు రామయ్య. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఓ రోజు.. ఉప్పుకు బదులుగా, అంతే బరువున్న దూది బస్తాను గాడిద వీపు మీద వేశాడు. బరువు తగ్గించుకోవడం కోసం గాడిద మళ్లీ నీళ్లలో పడింది. అయితే ఈసారి దాని బరువు విపరీతంగా పెరిగింది! చచ్చీచెడీ ఆ బరువును మోసుకొచ్చింది. ఇంటికి రాగానే రామయ్య కూడా గాడిదకు రెండు తగిలించాడు. సోమరితనం మనిషిని పాడు చేస్తుంది. అడ్డదారులు వెతికేలా చేస్తుంది. అది ఎప్పటికైనా ప్రమాదం.